ఆరుబయట మందు తాగితే డీజీపీ ఆఫీస్‌కు సమాచారం | Telangana Police Department Going To Use Space Technology For Crime Control | Sakshi
Sakshi News home page

నింగి నుంచి ఖాకీ నిఘా! 

Published Fri, Jan 17 2020 1:30 AM | Last Updated on Fri, Jan 17 2020 8:57 AM

Telangana Police Department Going To Use Space Technology For Crime Control - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టెక్నాలజీ సాయంతో నేర దర్యాప్తులో దేశంలోనే నం.1గా ఉన్న తెలంగాణ పోలీసు శాఖ విప్లవాత్మక ముందడుగు వేసింది. నేరాల నియంత్రణకు స్పేస్‌ టెక్నాలజీని వాడాలని నిర్ణయించింది. రోడ్డు ప్రమాదం జరిగినా.. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించినా క్షణాల్లో డీజీపీ కార్యాలయంలో తెలిసిపోతుంది. వెంటనే సంబంధిత ఠాణా అధికారులను అప్రమత్తం చేస్తారు. వారు నిమిషాల్లో ఘటనాస్థలానికి చేరుకుని చర్యలు తీసుకుంటారు. రాష్ట్రంలో నేర నియంత్రణ, మెరుగైన ట్రాఫిక్‌ వ్యవస్థ ఏర్పాటు ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం, అన్ని పోలీస్‌ స్టేషన్‌ సరిహద్దుల నిర్ధారణకు స్పేస్‌ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని రాష్ట్ర పోలీస్‌ శాఖ నిర్ణయించింది.

ఈ అంశాలపై డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి గురువారం తెలంగాణ స్టేట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (ట్రాక్‌) కార్యాలయంలో ట్రాక్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ట్రాక్‌ సైంటిఫిక్‌ ఇంజనీర్లతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, అడిషనల్‌ డీజీపీ లా అండ్‌ ఆర్డర్‌ జితేందర్, సాయుధ బెటాలియన్‌ అడిషనల్‌ డీజీపీ అభిలాష బిస్త్‌ కూడా పాల్గొన్నారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి రాష్ట్రంలో నేరాలను తగ్గించడం, మెరుగైన ట్రాఫిక్‌ వ్యవస్థ ఏర్పాటు ద్వారా రోడ్డు ప్రమాదాలకు చెక్‌పెట్టవచ్చని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. దీనికిగాను ‘ట్రాక్‌’తో త్వరలోనే ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లు తెలిపారు.  

రిమోట్‌ సెన్సింగ్‌ సాంకేతికతతో.. 
రిమోట్‌ సెన్సింగ్‌ ద్వారా రాష్ట్రంలో ఎక్కువగా నేరాలు జరిగే ప్రాంతాల మ్యాపింగ్, తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగి మరణాలు అధికంగా సంభవించే ప్రాంతాలు, కీలక రోడ్డు మలుపులతో కూడిన సమగ్ర సమాచారం కలిగిన మ్యాపింగ్‌ని ట్రాక్‌ సాయంతో చేపట్టనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల సరిహద్దులను రెవెన్యూ రికార్డులతో అనుసంధానం చేసి మ్యాపింగ్‌ చేయాలని కూడా నిర్ణయించారు. తద్వారా పోలీస్‌ స్టేషన్ల సరిహద్దుల పేర్లు స్పష్టంగా తెలియడంతో పాటు ఫిర్యాదుల నమోదుకు సరైన పోలీస్‌స్టేషన్‌ను ఎంచుకునే అవకాశం ప్రజలకు ఏర్పడుతుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించే ప్రదేశాలను గుర్తించి వాటిని కూడా జియో మ్యాపింగ్‌ చేయాలని డీజీపీ కోరారు.

ఆయా ప్రదేశాలను హైదరాబాద్‌లోని పోలీస్‌ ప్రధాన కార్యాలయం, జిల్లా పోలీస్‌ కార్యాలయాల ద్వారా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు. తద్వారా మహిళలపై జరిగే నేరాలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో పోలీస్‌ శాఖకు ఉన్న స్థలాలు, స్టేషన్లు, కార్యాలయ భవనాలు, ఇతర శాశ్వత ఆస్తుల పరిరక్షణకు వాటిని జియోఫెన్సింగ్‌ ద్వారా మ్యాపింగ్‌ చేయాలని ట్రాక్‌ అధికారులకు డీజీపీ సూచించారు. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 25వేల కిలోమీటర్ల వెంట ఆవాసాలు ఉన్నాయని, వాటిని ఇప్పటికే రిమోట్‌ సెన్సింగ్‌ ద్వారా మ్యాపింగ్‌ చేసినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

గురువారం డీజీపీ మహేందర్‌రెడ్డికి వివరాలు వెల్లడిస్తున్న ట్రాక్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ శ్రీనివాస్‌రెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement