దేశ ప్రగతిలో భాగం పంచుకుని, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలనుకునేవారికి అద్భుతమైన రంగం అంతరిక్షం. మన దేశం ఇప్పటికే వందకుపైగా ప్రయోగాలు చేసింది. ఇటీవలే అంగారకుడిపైకి ఉపగ్రహాన్ని ప్రయోగించి ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా రికార్డు పుటలకెక్కింది. ఈ క్రమంలో అంతరిక్ష శాస్త్రం అవకాశాలకు ఆలంబనగా మారింది. స్పేస్ సైన్స్/ఇంజనీరింగ్‌ను అభ్యసిస్తే కెరీర్ రాకెట్ వేగంతో దూసుకుపోవడం ఖాయం. ఈ నేపథ్యంలో సంబంధిత కోర్సులు అందిస్తున్న సంస్థలు, అర్హతలు, కావాల్సిన స్కిల్స్‌పై ఫోకస్..
స్పేస్ సైన్స్/ఇంజనీరింగ్.. ఇటీవల కాలంలో డిమాండ్ పెరుగుతున్న సబ్జెక్టు. అంతరిక్షానికి సంబంధించిన వివిధ అంశాలను గురించి చేసే అధ్యయనాన్ని స్పేస్ సైన్స్ అంటారు. ఇందులోనే వివిధ స్పెషలైజేషన్లు ఉన్నాయి. అవి.. ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, గెలాక్టిక్ సైన్స్, స్టెల్లర్ సైన్స్, స్పేస్ డిఫెన్స్, స్పేస్ కొలనైజేషన్, జీఐఎస్, శాటిలైట్ మెటియొరాలజీ, గ్లోబల్ క్లైమేట్, అట్మాస్ఫియరిక్ సెన్సైస్, శాటిలైట్ కమ్యూనికేషన్స్ మొదలైనవి. ఆస్ట్రోనాట్స్, రాకెట్ సైంటిస్టులు, మెటియొరాలజిస్టులను కలిపి స్పేస్ సైంటిస్టులుగా వ్యవహరిస్తారు.
ఏయే విభాగాలు:
రాకెట్ రూపకల్పన నుంచి అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపేవరకు ఎన్నో దశలుంటాయి. ముందుగా ఉపగ్రహ వాహక నౌక/రాకెట్ నమూనా రూపొందించడం, డిజైనింగ్, వాటి తయారీ వరకు ఎన్నో ప్రక్రియలుంటాయి. అదేవిధంగా రాకెట్‌లో వాడే వివిధ యంత్ర పరికరాలు, చిన్న చిన్న విడి విభాగాలు ప్రతిదీ కీలకమే. రాకెట్‌ను మండించడానికి ఎంత ఇంధనం వాడాలి? కక్ష్యలో ప్రవేశపెట్టడానికి అనుసరించాల్సిన విధివిధానాలు తెలిసి ఉండాలి. తర్వాత ఆ ఉపగ్రహాన్ని సంబంధిత వ్యవస్థలకు అనుసంధానించడం, ఉపగ్రహ పనితీరును పరిశీలించడం ఇలా ప్రతి అంశం.. కత్తి మీద సామే. ఈ నేపథ్యంలో ప్రతి విభాగంలో సంబంధిత నిపుణుల అవసరం ఏర్పడుతోంది.
ఎవరు అర్హులు:
ఫిజిక్స్, మ్యాథ్స్ సూత్రాలపై పట్టు ఉండి, ధైర్యసాహసాలు, సానుకూల దృక్పథం ఉన్నవారు స్పేస్ సైంటిస్ట్ కావచ్చు. ఇందుకోసం ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్‌లను ప్రధాన సబ్జెక్టులుగా చదివుండాలి. తర్వాత బీఎస్సీలో మ్యాథ్స్, ఫిజిక్స్, ఎంఎస్సీలో స్పేస్ ఫిజిక్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్ వంటి స్పెషలైజేషన్లు ఎంచుకోవాలి. ఇంజనీరింగ్ విద్యార్థులైతే బీటెక్‌లో ఏరోనాటికల్/ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్, ఫిజికల్ సెన్సైస్ వంటి కోర్సులు అభ్యసించాలి. ఆ తర్వాత స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషలైజేషన్‌తో ఎంటెక్ పూర్తిచేయాలి. తర్వాత పీహెచ్‌డీ కూడా పూర్తిచేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
కావాల్సిన నైపుణ్యాలు:
గణితం, భౌతిక శాస్త్రం సూత్రాలపై పట్టు ఉండాలి.
విశ్లేషణాత్మక నైపుణ్యాలు ఉండాలి.
తార్కిక పరిజ్ఞానం
కష్టపడి పనిచేయడం, అంకిత భావం
ధైర్యసాహసాలు, సహనం.
సవాళ్లను ఎదుర్కోగల సామర్థ్యం ఉండాలి.
నిరంతరం వివిధ అంశాలను నేర్చుకుంటుండాలి.
అందించే సంస్థలు:
మన దేశంలో ఐఐటీలు మొదలుకుని వివిధ రాష్ట్ర విశ్వవిద్యాలయాల వరకు స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కోర్సులు అందిస్తున్నాయి. మన దేశంలో ఐఐటీ- మద్రాస్ (వెబ్‌సైట్: www.iitm.ac.in), ఐఐటీ-బాంబే (వెబ్‌సైట్: www.iitb.ac.in), ఐఐటీ-కాన్పూర్ (వెబ్‌సైట్: www.iitk.ac.in), ఐఐటీ-ఖరగ్‌పూర్‌లు (వెబ్‌సైట్: www.iitkgp.ac.in) బీటెక్‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఐఐటీ-ఖరగ్‌పూర్, ఐఐటీ-మద్రాస్‌లు ఐదేళ్ల బీటెక్-ఎంటెక్ డ్యుయెల్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టాయి. మన రాష్ట్రంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (వెబ్‌సైట్: www.uohyd.ac.in), ఆంధ్రా యూనివర్సిటీ (వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in), శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (వెబ్‌సైట్: www.svuniversity.in), జేఎన్‌టీయూ- హైదరాబాద్ (వెబ్‌సైట్: www.jntuh.ac.in), ఉస్మానియా యూనివర్సిటీ (వెబ్‌సైట్: www.osmania.ac.in), జేఎన్‌టీయూ- కాకినాడ (వెబ్‌సైట్: www.jntk.edu.in) మొదలైనవి సంస్థను బట్టి.. ఏరోనాటికల్/ఏరో స్పేస్ ఇంజనీరింగ్, స్పేస్ ఫిజిక్స్, ఆస్ట్రో ఫిజిక్స్, ఆస్ట్రానమీ, స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నాయి.
ఐఐఎస్‌టీ:
అంతరిక్ష రంగానికి సంబంధించిన కోర్సులను అందించడంలో కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ)కి మంచిపేరుంది. పూర్తిస్థాయిలో అంతరిక్ష కోర్సులను ఆఫర్ చేస్తోన్న ఈ సంస్థ 2007లో ఏర్పడింది. ఆసియాలోనే ఈ తరహా కోర్సులను అందిస్తోన్న తొలి ఇన్‌స్టిట్యూట్‌గా ఐఐఎస్‌టీ ప్రసిద్ధిగాంచింది. యూజీ నుంచి డాక్టోరల్ వరకు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
బీటెక్‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్, ఫిజికల్ సెన్సైస్ కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. 70 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌లతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సులకు అర్హులు. గతేడాది వరకు ఐశాట్ ద్వారా ప్రవేశాలు కల్పించేవారు. ఈ ఏడాది నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తున్నారు. ఎంఎస్‌లో కూడా ఎన్నో స్పెషలైజేషన్లు ఉన్నాయి. మంచి అకడెమిక్ రికార్డ్‌తో కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులకు ఇస్రోలో ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా ఐఐఎస్‌టీ ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది.
కోర్సుల గురించి క్లుప్తంగా..
బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్:
ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన ప్రాథమిక విభాగాల్లో అడ్వాన్స్‌డ్ నాలెడ్జ్‌ను నేర్చుకునేలా కోర్సును రూపొందించారు. లాంచ్ వెహికల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, స్పేస్ క్రాఫ్ట్స్‌ల డిజైన్, డెవలప్‌మెంట్‌పై బోధన ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో మెకానిక్స్, సాలిడ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్‌ల గురించి, అడ్వాన్స్‌డ్ స్థాయిలో ఏరో డైనమిక్స్, ప్లైట్ మెకానిక్స్, థియరీ ఆఫ్ మెషిన్స్, ఏరోస్పేస్ స్ట్రక్చర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఆటోమేటిక్ కంట్రోల్ గురించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
బీటెక్ ఏవియానిక్స్:
ఇందులో ప్రాథమికంగా విద్యార్థుల్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సిస్టమ్స్‌లో శిక్షణ అందిస్తారు. ఏరోస్పేస్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో విద్యార్థి ప్రాథమిక పరిజ్ఞానం పొందేలా కోర్సు కరిక్యులం, సిలబస్ ఉంటుంది. కోర్సులో భాగంగా కంట్రోల్ సిస్టమ్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సిస్టమ్స్‌తోపాటు అనుబంధ సబ్జెక్టులను విద్యార్థులు అభ్యసించాల్సి ఉంటుంది. శాటిలైట్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, నావిగేషన్ సిస్టమ్స్, లాంచ్ వెహికల్ కంట్రోల్, వీఎల్‌ఎస్‌ఐ సిస్టమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ మొదలైనవి కోర్సులో ఉంటాయి.
బీటెక్ ఫిజికల్ సెన్సైస్:
కోర్సుల్లో భాగంగా విద్యార్థులు ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, రిమోట్ సెన్సింగ్, ఎర్త్ సిస్టమ్ సైన్స్, కెమికల్ సిస్టమ్స్, బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, మ్యాథమేటిక్స్‌లను అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
నియామకాలు:
ఇస్రో, డీఆర్‌డీవో, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తదితర సంస్థలు వాటిల్లో ఖాళీల భర్తీకి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్, రోజ్‌గార్ సమాచార్ యోజన, వివిధ దినపత్రికల్లో ప్రకటనలు ఇస్తుంటాయి. సంబంధిత వెబ్ పోర్టల్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
కెరీర్:
ఇప్పటివరకు మనదేశం 109 అంతరిక్ష ప్రయోగాలను నిర్వహించింది. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని ప్రయోగాలు నిర్వహించనుంది. వీటిల్లో ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-2 వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్పేస్ సైన్స్ కోర్సులు పూర్తిచేసిన వారికి ఇస్రోతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష పరిశోధన సంస్థలు, రాకెట్ ప్రయోగ కేంద్రాల్లో అపార అవకాశాలున్నాయి. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా అంతరిక్ష రంగంలో అడుగుపెడుతున్నాయి. ఇవి అంతరిక్ష పర్యటనలను నిర్వహిస్తున్నాయి. వీటిల్లో కూడా శాస్త్రవేత్తలుగా పనిచేయొచ్చు.
అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల్లో కూడా అవకాశాలు పొందొచ్చు. మన దేశంలో ఇస్రో, షార్, డీఆర్‌డీవో వంటి సంస్థల్లో వివిధ విభాగాల్లో శాస్త్రవేత్తలుగా అవకాశాలుంటాయి. మొదట జూనియర్ శాస్త్రవేత్త/ట్రైనీ సైంటిస్ట్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి సీనియర్ శాస్త్రవేత్తగా పదోన్నతి లభిస్తుంది. పూర్తి స్థాయి అంకితభావంతో పనిచేసేవారు సంబంధిత విభాగం చీఫ్, డెరైక్టర్ స్థాయికి చేరుకోవచ్చు. ఇంకా సైన్స్ మ్యూజియం, ప్లానెటోరియంలలో, అబ్జర్వేటరీ, స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీలలో, పరిశోధన, అభివృద్ధి కేంద్రాల్లో వివిధ స్థాయిల్లో అవకాశాలుంటాయి.
ఈ సంస్థల్లో అవకాశాలు:
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ - తిరువనంతపురం, ఇస్రో శాటిలైట్ సెంటర్- బెంగళూరు, స్పేస్ అప్లికేషన్ సెంటర్ - అహ్మదాబాద్, షార్- శ్రీహరికోట, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్- తిరువనంతపురం, బెంగళూరు, మహేంద్రగిరి, నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్, ఇస్రో శాటిలైట్ ట్రాకింగ్ సెంటర్- బెంగళూరు, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏరోస్పేస్ సిస్టమ్స్ పరిశ్రమల్ల్లో శాస్త్రవేత్తలుగా ఉద్యోగం పొందొచ్చు.
మహిళలు ముందుకు రావాలి..
నేను తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సు అభ్యసించాను. కోర్సు పూర్తయ్యాక అకడెమిక్ రికార్డు ఆధారంగా షార్‌లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాను. షార్‌లో పని రెండు విధాలుగా ఉంటుంది. అవి.. టెక్నికల్ వర్క్, రీసెర్చ్ వర్క్. సైంటిస్ట్/ఇంజనీర్లు రెండు పనులు చేస్తారు. రాకెట్ రీసెర్చ్, రాకెట్ సైన్స్, శాటిలైట్స్, స్పేస్‌సైన్స్, వివిధ యంత్రపరికరాలు, వివిధ విడి విభాగాలు మొదలైనవాటి నిర్మాణం, డిజైన్, పరిశోధన విధులను నిర్వర్తించాలి. సొంతంగా కూడా పరిశోధనలు చేయొచ్చు.
అంకితభావం, కష్టపడి పనిచేయడం, ఆసక్తి ఉన్నవారు ఎవరైనా అంతరిక్ష రంగాన్ని ఎంచుకోవచ్చు. విదేశాల్లో ఉన్నంతమంది మహిళా శాస్త్రవేత్తలు మనదేశంలో ఈ రంగంలో లేరు. మహిళలు ధైర్యంగా ముందడుగు వేయాలి. పనిగంటలు కూడా అనుకూలంగానే ఉంటాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమై 5.30కు ఆఫీస్ ముగుస్తుంది. శ్రీహరికోట వంటి పట్టణాల్లో ప్రారంభంలో నెలకు రూ. 40,000 వరకు వేతనాలు ఉంటాయి. బెంగళూరు వంటి నగరాల్లో దాదాపు 60,000 వరకు వేతనం అందిస్తారు. ఎక్కడ ఉన్నా నివాస, వైద్య, ఇతర సదుపాయాలు కల్పిస్తారు.
-సురేఖ,
సైంటిస్ట్/ఇంజనీర్-సీ,
షార్, శ్రీహరికోట
టాప్ ర్యాంకు విద్యార్థులు ఈ కోర్సును ఎంచుకుంటున్నారు
ఏయూలో స్పేస్ ఫిజిక్స్‌లో మొత్తం 10 సీట్లు ఉన్నాయి. వీటిలో 5 మన రాష్ట్ర విద్యార్థులకు, మరో 5 జాతీయ స్థాయిలో విద్యార్థులకు కేటాయించాం. ఇతర రాష్ట్రాల విద్యార్థులు లేకుంటే రాష్ట్ర విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తాం. ఈ కోర్సుకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆసెట్‌లో ర్యాంకు సాధించిన వారిలో టాప్ ర్యాంకుల విద్యార్థులు ఈ కోర్సులో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. విద్యార్థినులు కూడా భారీ సంఖ్యలో చేరుతున్నారు.
ఐనో స్పియర్ ఫిజిక్స్, ఏరోనమీ, మాగ్నిటోస్ఫియర్ తదితర అంశాలపై బోధన ఉంటుంది. ప్రాక్టికల్స్‌కు సంబంధించి వర్సిటీలో అన్ని వసతులు ఉన్నాయి. సెకండియర్‌లో విద్యార్థులు ఏదైనా జాతీయ పరిశోధన సంస్థల్లో రెండు నెలలు ప్రాజెక్టు మీద పనిచేయాల్సి ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసిన వారిలో ఎక్కువ మంది పీహెచ్‌డీని ఎంచుకుంటున్నారు. వివిధ పరిశోధన సంస్థలతోపాటు ఇస్రో, ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ- అహ్మదాబాద్ వంటి సంస్థలలో పరిశోధనలు చేస్తున్నారు. వీరికి దేశ, విదేశాల్లో అపార అవకాశాలున్నాయి.
-ఆచార్య కె.నిరంజన్,
భౌతికశాస్త్ర విభాగాధిపతి, ఏయూ, విశాఖపట్నం
సోలార్ యాక్టివిటీపై పరిశోధన చేయాలనుకుంటున్నా..
నేను స్పేస్ ఫిజిక్స్‌పై ఉన్న ఆసక్తితో ఈ కోర్సులో చేరాను. తక్కువ సీట్లు ఉండటంతో ఈ కోర్సుకు భారీ డిమాండ్ ఉంది. అట్మాస్ఫియరిక్ సైన్స్, ప్లాజ్మాపై అధ్యయనం చేసే విధానాలు తెలుసుకుంటున్నాను. భూమిపై ఉన్న పొరల్లో, ఆవరణంలో జరిగే మార్పులపై పరిశోధన చేయడానికి ఈ కోర్సు ఉపకరిస్తుంది. ఏరోజోల్స్, సోలార్‌యాక్టివిటీ, కాలుష్యం కారణంగా ఏర్పడే మార్పులపై రీసెర్చ్ చేస్తాను.
-వి.సాయిగౌతమ్, స్పేస్ ఫిజిక్స్ (సెకండియర్), ఏయూ, విశాఖపట్నం.