సామాన్యుడికి సాయపడాలి
ఆవిష్కరణలపై శాస్త్రవేత్తలకు ప్రధాని సూచన
సాక్షి, న్యూఢిల్లీ: అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సామాన్యుడికి సాయపడే ఆవిష్కరణలు చేయాలని అధికారులు, శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తక్కువ ఖర్చులో సరళమైన విధానంతో పేదలకు టెక్నాలజీ అందించడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలన్నారు. ‘స్పేస్ టెక్నాలజీకి, సామాన్యుడికి మధ్య స్పేస్ (అంతరం)’ ఉండకూడదన్నారు. సుపరిపాలనలో టెక్నాలజీదే కీలక పాత్ర అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలూ తమ పరిధిలో సాంకేతిక రంగాల్లో అన్వేషణలకు చర్యలు చేపట్టాలని సూచించారు. ‘స్పేస్ టెక్నాలజీ’పై అంతరిక్ష విభాగం సోమవారం ఢిల్లీలో నిర్వహించిన జాతీయ సమావేశంలో మోదీ ప్రసంగించారు.
ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు
ఒకే కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 1,600 మంది అధికారులు, శాస్త్రవేత్తలు హాజరై స్పేస్ టెక్నాలజీపై మేధోమథనం చేయడం ఇదే తొలిసారి..
* విశ్వవ్యాప్తంగా దేశం గర్వించే స్థాయిలో అంతరిక్ష రంగంలో మన శాస్త్రవేత్తలు లక్ష్యాన్ని సాధించారు.
* మనం ఎంత ఎత్తులో ప్రయాణిస్తున్నామో విమాన పైలట్‌కు మానిటర్‌లో ఎలాగైతే ముందుగా తెలుస్తుందో, అలాగే మానవరహిత రైల్వే క్రాసింగ్‌ల వద్ద మానిటర్‌లు ఏర్పాటు చేసి శాటిలైట్‌కు అనుసంధానం చేస్తే రైల్వే డ్రైవర్లు అప్రమత్తమవుతారు. తద్వారా ఘోరప్రమాదాలను నివారించవచ్చు. వారణాసిలోని డీజిల్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఇంజనీర్లు ఈ దిశగా కొత్త టెక్నాలజీని అభివృద్ధిచేశారు. ఇది త్వరలో అమల్లోకి తెస్తాం.
* పోస్టల్ నెట్‌వర్క్‌ను శాటిలైట్‌తో అనుసంధానం చేసి చాలా సాధించవచ్చు. సామాన్యుల అవసరాలకు తగ్గట్లు విజ్ఞానం, విద్యావిధానం, విద్యుత్, ఆప్టికల్ ఫైబర్ వ్యవస్థలలో టెక్నాలజీని ఉపయోగించాలి.
* కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల కోసం యువతను ఆహ్వానించాలి. ప్రభుత్వ విభాగాల్లో సెల్ ఏర్పాటు చేసి ఆవిష్కరణలకు దారిచూపే ఆలోచనలను స్వీకరించాలి.
* మాంఝీ అనే వ్యక్తి 45 ఏళ్ల పాటు కొండను తొలచి 50 కి.మీ ప్రయాణాన్ని 2కి.మీ. ప్రయాణానికి తగ్గించాడు. అప్పుడంటే టెక్నాలజీ లేదు. ఇప్పుడు టెక్నాలజీని వాడి దగ్గరిదారులు(షార్ట్‌వే) తెరవచ్చు.
* ఎర్రచందనం అక్రమ రవాణాపై హై రిజల్యూషన్ కెమెరాలతో నిఘా పెట్టొచ్చు. ఖనిజాల తవ్వకం, రోడ్డు పన్ను వసూళ్లు, జాతీయ రహదారుల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలను శాటిలైట్ అనుసంధానం ద్వారా నిరోధించవచ్చు.
* సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేదాకా ప్రజాప్రతినిధులను సాంకేతికపై అవగాహన కల్పించి భాగస్వాములను చేయాలి.
* విశాఖలో హుద్‌హుద్ తుపానుపై శాటిలైట్ సాయంతో ముందస్తుగా కచ్చితమైన సమాచారం ఇచ్చారు. దీంతో తక్కువ నష్టం జరిగింది.
* ఈ క్యాలెండర్ ఇయర్‌లోనే పేదలకు సాయపడేలా ఒక్క స్పేస్ అప్లికేషన్‌ను అయినా అభివృద్ధిచేయాలి.
* విక్రమ్ సారాభాయ్ గొప్ప దార్శనికుడు. ప్రపంచవిపణిలో పోటీపడేందుకే భారత్ అంతరిక్షరంగంలో అడుగుపెట్టిందని వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. సామాన్యుల జీవితాలను బాగు చేసేందుకే అంతరిక్ష పరిజ్ఞానాన్ని భారత్ వినియోగిస్తోందని ఆయన నిరూపించారు.