గ్రహశకలంపైకి సందేశం పంపండి!
వాషింగ్టన్: గ్రహశకలంపైకి సంక్షిప్త సందేశాలు, ఫొటోలను పంపాలని ఉందా? అంతరిక్ష టెక్నాలజీ గురించి జోస్యం చెప్పాలని ఉందా? అయితే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన మిషన్‌తో ఈ అరుదైన అవకాశం మీకు సొంతం కానుంది. ఇందుకు చేయవల్సిందల్లా ఒక్కటే. ట్విట్టర్‌లో ‘ఓసిరిస్-రెక్స్’ ఆస్టరాయిడ్ టైమ్ క్యాప్సూల్ కు ట్వీట్లు, ఫొటోలను సమర్పించడమే. గతేడాది జరిగిన అంతరిక్ష పరిశోధనలు, 2023 నాటికి సాకారమయ్యే అంతరిక్ష సాంకేతికతల గురించిన టాపిక్‌లే ఎంచుకోవాలి.
అయితే వీటన్నింటిలో 50 ట్వీట్లను, 50 ఫొటోలను, భవిష్యత్తు అంచనాలను మాత్రమే నాసా ఎంపిక చేస్తుంది. వాటిని ఓ టైమ్ క్యాప్సూల్‌లో ఉంచి క్యాప్సూల్‌ను ఓసిరిస్-రెక్స్ వ్యోమనౌకపై అమర్చి 2016లో అంతరిక్షానికి పంపిస్తుంది. ఈ వ్యోమనౌక 1,760 అడుగుల సైజున్న బెన్నూ అనే గ్రహశకలాన్ని 2019 లో చేరి, దానిపై రెండేళ్లపాటు అధ్యయనం చేస్తుంది. తర్వాత భూమిపై పరిశోధనలు చేసేందుకు గ్రహశకలంపై 60 గ్రాముల పదార్థాన్ని సేకరించి 2023 నాటికి భూమికి తీసుకువస్తుంది. అప్పుడు టైం క్యాప్సూల్‌ను తెరిచి అందులోని ట్వీట్లు, ఫొటోలు, అంచనాలను నాసా శాస్త్రవేత్తలు బయటపెడతారట. ఎవరెవరు ఏ సందేశాలు ఉంచారు? ఏమేమి అంచనా వేశారు? వాటిలో ఏవి నిజమయ్యాయి? అన్నవి ప్రకటిస్తారట.