ఏడాదికి రూ.112 కోట్లు! | Can Nadella give Microsoft an edge it was lacking? | Sakshi
Sakshi News home page

ఏడాదికి రూ.112 కోట్లు!

Published Thu, Feb 6 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM

ఏడాదికి రూ.112 కోట్లు!

ఏడాదికి రూ.112 కోట్లు!

న్యూయార్క్: అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓగా పగ్గాలు చేపట్టిన  తెలుగు తేజం సత్య నాదెళ్ల... అదిరిపోయే వేతన ప్యాకేజీ అందుకోనున్నారు. జీతం, బోనస్, స్టాక్ ఆప్షన్స్ ఇతరత్రా ప్రోత్సాహకాలన్నీ కలిపితే ఏడాదికి ఆయనకు 1.8 కోట్ల డాలర్లు(దాదాపు రూ.112 కోట్లు) లభించనున్నాయి.

క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే సారథి సత్యతో మైక్రోసాఫ్ట్ కుదుర్చుకున్న కొత్త ఉద్యోగ ఒప్పందం ప్రకారం... జీతం ఏడాదికి 12 లక్షల డాలర్లు(రూ.7.5 కోట్లు) కావడం గమనార్హం. కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్(ఈఐపీ) ప్రకారం నాదెళ్లకు ప్యాకేజీని నిర్ణయించారు. 1992లో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగిగా చేరిన 47 ఏళ్ల సత్య... సర్వర్ అండ్ టూల్స్, క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజ్, ఆన్‌లైన్ సర్వీసెస్, అడ్వర్టైజింగ్ ప్లాట్‌ఫామ్ విభాగాల్లో  బాధ్యతలను నిర్వర్తించారు.

 1.32 కోట్ల డాలర్ల షేర్లు...
  వార్షిక ఈఐపీలో భాగంగా 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 1.32 కోట్ల డాలర్ల విలువైన షేర్లు సత్య అందుకోనున్నారు. ఆర్థిక సంవత్సరాన్ని జూలై 1 నుంచి జూన్ 30గా లెక్కిస్తారు.
      2014, 2015 సంవత్సరాల్లో సీఈఓగా అందుకునే వార్షిక వేతనానికి తోడు 0-300 శాతం వరకూ నగదు ప్రోత్సాహకం(అవార్డు)ను కూడా సత్యకు ఇస్తున్నట్లు ఆఫర్ లేఖలో మైక్రోసాఫ్ట్ పేర్కొంది. దీన్ని పనితీరు ఆధారంగా కంపెనీ బోర్డు నిర్ణయిస్తుంది. గరిష్టంగా చూస్తే ఈ మొత్తం 36 లక్షల డాలర్లుగా ఉండొచ్చు.

      మొత్తంమీద ప్యాకేజీ 1.8 కోట్ల డాలర్లగా లెక్కతేలుతోంది. సత్యకు ఆఫర్ చేసిన వేతన ప్యాకేజీ వివరాలను కంపెనీ అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ఎస్‌ఈసీకి కూడా తెలియజేసింది.
     సత్య సారథ్యంలో మైక్రోసాఫ్ట్ దీర్ఘకాలిక పనితీరు ఆధారంగా ఆయనకు లాంగ్‌టర్మ్ పర్ఫార్మెన్స్ స్టాక్ అవార్డ్స్ కూడా లభించనున్నాయి.

      39 ఏళ్ల కంపెనీ చరిత్రలో బిల్‌గేట్స్, స్టీవ్ బామర్‌ల తర్వాత మూడో సీఈఓగా బాధ్యతలు స్వీకచించిన సత్య... 2013 ఆర్థిక సంవత్సరంలో 6.75 లక్షల డాలర్ల జీతాన్ని అందుకున్నారు. ఇక 16 లక్షల డాలర్ల విలువైన నగదు బోనస్ లభించినట్లు సమాచారం.
 
 స్వాగతించిన అమెరికా మీడియా..
 మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల నియామకాన్ని అమెరికా మీడియా మొత్తం స్వాగతించింది. ఈ టెక్నోక్రాట్‌కు మున్ముందు ఎన్నో సవాళ్లు ఎదురుచూస్తున్నాయని కూడా తమ కథనాల్లో గుర్తుచేసాయి.
 కార్పొరేట్ కంప్యూటర్ సర్వర్లు, ఇతర బ్యాకెండ్ టెక్నాలజీ విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఈ టెక్నాలజీ నిపుణుడే తమకు తగిన సారథి అని మైక్రోసాఫ్ట్ తేల్చు కుంది. ఇంటాబయటా బోలెడంత మంది జాబితాను మదించి... చివరకు సత్య నాదెళ్లకు ఓటేసింది.      - వాల్‌స్ట్రీట్ జనరల్

 భారత్ అర్థిక వ్యవస్థ సృష్టిస్తున్న అవకాశాలతో ప్రవాసీయులు మాతృదేశంవైపు చూస్తున్న తరుణంలో అమెరికాలో ఒక భారతీయుడు(సత్య) మైక్రోసాఫ్ట్‌కి సారథిగా రావడం గొప్పవిషయమే.        - టైమ్ మ్యాగజీన్

 బయటి వ్యక్తికోసం తీవ్రంగా వేటసాగించినా.. కంపెనీలోని వ్యక్తివైపే మైక్రోసాఫ్ట్ మొగ్గుచూపింది. తమ కస్టమర్లు క్లౌడ్‌వైపు దృష్టిసారించడంలో విజయంసాధించిన సత్య నాదెళ్లను ఎంచుకుంది.           - వాషింగ్టన్ పోస్ట్
 
 ప్రపంచ దిగ్గజ కంపెనీలకు అధిపతులుగా ఉన్న భారతీయుల శక్తిసామర్థ్యాలు సత్య నాదెళ్ల ఘనతతో మరోసారి నిరూపితమయ్యాయి. 10 మంది భారతీయులు సారథ్యం వహిస్తున్న అంతర్జాతీయ కంపెనీల వ్యాపార విలువ దాదాపు 35,000 కోట్ల డాలర్లు కావడం గమనార్హం.

ఇది గతేడాది భారత్ ఎగుమతులకంటే కూడా ఎక్కువ కావడం విశేషం. ఐటీ రంగంతోపాటు విదేశాల్లో ఇతరత్రా కంపెనీలకు చాలా మంది భారతీయులు అధిపతులుగా ఉన్నప్పటికీ.. కనీసం 12 అతిపెద్ద సంస్థలకు మనోళ్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లుగా కొనసాగుతున్నారు. కాగా, గతంలో కూడా సిటీ గ్రూప్(విక్రం పండిట్), మోటరోలా(సంజయ్ ఝా) లకు మనోళ్లు సీఈఓలుగా చేశారు.
 
 భారతీయులు.. భారీ జీతాలు
 
 పేరు                               కంపెనీ(సీఈఓ)                          వార్షిక ప్యాకేజీ
 సత్య నాదెళ్ల                 మైక్రోసాఫ్ట్                              1.8 కోట్ల డాలర్లు
 సంజయ్ ఝా              గ్లోబల్ ఫౌండ్రీస్                    4.7 కోట్ల డాలర్లు (2013లో మోటొరోలాతో ఉన్నపుడు)
 ఇవాన్ మెండిస్              డియాజియో                          1.7 కోట్ల డాలర్లు(2012)
 ఇంద్రా నూయి              పెప్సీకో                                       1.26 కోట్ల డాలర్లు(2013)
 శాంతను నారాయణ్    అడోబ్ సిస్టమ్స్                           1.20 కోట్ల డాలర్లు (2012)
 అజయ్ బంగా            మాస్టర్ కార్డ్                         1.13 కోట్ల డాలర్లు (2013)
 పియూష్ గుప్తా         డీబీఎస్ గ్రూప్ హోల్డింగ్స్              93.31 లక్షల డాలర్లు (2012)
 అన్షు జైన్                   డాయిష్ బ్యాంక్(కో-సీఈఓ)            79.52 లక్షల డాలర్లు (2013)
 సంజయ్ మెహరోత్రా       శాన్‌డిస్క్                        66.66 లక్షల డాలర్లు (2012)
 రాకేశ్ కపూర్             రెకిట్ బెన్కిసర్                         47.01 లక్షల డాలర్లు (2012)
 
 టాప్ సెర్చ్... సత్య
 మైక్రోసాఫ్ట్ సారథిగా సత్య పేరు వెల్లడికావడంతో సైబర్ ప్రపంచంలో ఆయన పేరు మార్మోగిపోయింది. ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలోనూ హాట్‌టాపిక్ ఆయనే. కేవలం అరనిమిషంలోనే గూగుల్ సెర్చ్ బాక్స్‌లో ‘సత్య నాదెళ్ల’ పేరుతో 44 కోట్ల సెర్చ్ రిజల్ట్స్ ప్రత్యక్షం కావడం దీనికి నిదర్శనం. అంతేకాదు ఆయన పేరుతో 0.14 సెకండ్‌లో 1.28 కోట్ల వార్తా కథనాలు గూగుల్ న్యూస్‌లో పోస్ట్‌కావడం విశేషం.

 సైబర్ జగత్తులో ఇప్పటిదాకా నమోదైన అత్యధిక సెర్చ్‌ల రికార్డులో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా(65 కోట్లు), బిల్ గేట్స్(48 కోట్లు) తర్వాత మూడోవ్యక్తిగా సత్య నిలవడం గమనార్హం. ఇదే టాప్ సెర్చ్ జాబితాలో రతన్ టాటా(40 లక్షలు), పెప్సీకో చైర్‌పర్సన్ ఇంద్రా నూయి(10 లక్షల కంటే తక్కువ)... సత్యకంటే ఆమడ దూరంలో ఉన్నారు. సత్య నాదెళ్ల సీఈఓగా ఎంపికైన తర్వాత ఆయన పేరుమీద ఫేస్‌బుక్‌లో ఒక పేజ్ ఒపెన్ కావడం... దీనికి కొద్దిగంటల్లోనే 30 వేలకు పైచిలుకు ‘లైక్స్’ వెల్లువెత్తడం విశేషం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement