నోకియా కొత్త సీఈఓ రాజీవ్‌సూరి?
న్యూఢిల్లీ: నోకియా కొత్త సీఈఓగా భారత్‌కు చెందిన రాజీవ్ సూరి (46) నియమితులయ్యే అవకాశముంది. ప్రస్తుతం కంపెనీ టెలికం పరికరాల వ్యాపారానికి సారథిగా ఉన్న ఆయనను ఈ నెల 29న కొత్త సీఈఓగా ప్రకటించవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. నెట్‌వర్క్ ఎక్విప్‌మెంట్ బిజినెస్‌కు సంబంధించిన నూతన వ్యూహాన్ని కూడా నోకియా అదేరోజు వెల్లడించవచ్చని తెలుస్తోంది.
ఇక మైక్రోసాఫ్ట్ కనుసన్నల్లో...
హ్యాండ్‌సెట్ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్‌కు విక్రయించే కార్యక్రమాన్ని నోకియా శుక్రవారం పూర్తి చేసింది. పన్ను చెల్లింపుల వ్యవహారంలో వివాదం నెలకొన్న చెన్నై ప్లాంటు మాత్రం నోకియా ఆధీనంలోనే ఉంటుంది. నోకియా తమ హ్యాండ్‌సెట్ల వ్యాపారాన్ని 720 కోట్ల డాలర్లకు అమ్మేందుకు గత సెప్టెంబర్లో మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి విదితమే. ఒప్పందం పూర్తికావడంలో నెలరోజుల జాప్యం కావడంతో ఈ మొత్తం కూడా స్వల్పంగా పెరగనుంది. ఒప్పందం కార్యరూపం దాల్చడంపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
చెన్నై ప్లాంటులో మైక్రోసాఫ్ట్‌కు హ్యాండ్‌సెట్స్..
నోకియా ఆధీనంలోనే కొనసాగనున్న చెన్నై ప్లాంటులో హ్యాండ్‌సెట్లను తయారు చేసి మైక్రోసాఫ్ట్‌కు సరఫరా చేసేందుకు ఓ ఒప్పందం కుదిరింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న నోకియా హ్యాండ్‌సెట్లపై వారంటీ బాధ్యతను ఇకనుంచి మైక్రోసాఫ్ట్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఐదు వేల కోట్ల డాలర్లుగా (రూ. 3 లక్షల కోట్లు) ఉన్న చౌక సెల్‌ఫోన్ల మార్కెట్‌పై మైక్రోసాఫ్ట్ ఇక దృష్టి సారించనుంది. తద్వారా నోకియాకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది.
శామ్‌సంగ్, ఆపిల్‌లతో పోటీని తట్టుకోలేకపోవడంతో నోకియా మార్కెట్ వాటా గణనీయంగా తగ్గిపోవడం తెలిసిందే. మొబైల్స్‌కు నోకియా బ్రాండ్‌ను పదేళ్లపాటు కొనసాగిస్తామని, నోకియా బ్రాండ్ స్మార్ట్ డివైస్‌ల మార్కెటింగ్‌కు పరిమితకాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ‘నోకియాకు మంచి బ్రాండ్‌నేమ్ ఉంది. అనేక మోడళ్లను తయారు చేస్తోంది. ఈ అవకాశాన్ని మైక్రోసాఫ్ట్ వినియోగించుకుంటుంది. ఆశా మోడల్స్, స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తినీ మైక్రోసాఫ్ట్ కొనసాగించే అవకాశముంది’ అని రీసెర్చ్ సంస్థ ఐడీసీ సీనియర్ అనలిస్ట్ మానసి యాదవ్ చెప్పారు.