Handsets
-
హాట్ టాపిక్‌గా పుతిన్ ఆరోగ్యం.. ఇంజెక్షన్లతో నల్లగా మారిన చేతులు
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం దిగినప్పటి నుంచి పాశ్చాత్య దేశాలన్ని పుతిన్ ఆరోగ్యంపై దృష్టి సారించాయి. పుతిన్ ఆరోగ్యం విషమంగా ఉందని ఇక ఆయన ఎన్నోరోజులు బతకరు అంటూ పలు వార్తలు హల్చల్ చేశాయి. ఆ తర్వాత యూకే ఇంటెలిజెన్స్ పుతిన్‌కి క్యాన్సర్ అంటూ ఒక నివేదికలో పేర్కొంది. ఆ తర్వాత గతేడాది మార్చిలో ఆయనపై హత్యయత్నం జరిగిందని త్రుటిలో తప్పించుకున్నట్లు వార్తలు కూడ వచ్చాయి. ఇప్పడు మళ్లీ ఆయన ఆరోగ్యం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు గుప్పుమంటున్నాయి. పుతిన్ ఆరోగ్యం బాగోలేదంటూ ఫోటో ఒకటి సామాజిక మాధ్యమంలో వైరల్ అవ్వడంతో పుతిన్ శరీరం రంగుమారిందని, వింత వింత గుర్తులు ఉన్నాయంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. అంతేగాక రిటైర్డ్ బ్రిటీష్ ఆర్మీ అధికారి, హౌస్ లార్డ్స్ సభ్యుడు రిచర్డ్ డానాట్ ఒక మీడియా సమావేశంలో పుతిన్ ఆరోగ్యం గురించి మాట్లాడారు. పుతిన్ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడో తెలుసుకోవడం అత్యంత ముఖ్యం అని చెప్పారు. అతని చేతులు ఒక్కసారిగా నల్లగా మారిపోయి ఉన్నాయని, ఇలా ఏవైనా ఇంజెక్షన్ తీసుకున్నప్పుడూ శరీరం కమిలి ఇలా రంగు మారుతుందని తెలిపారు. ఇతర భాగాల నుంచి ఇంజెక్షన్ తీసుకోలేనప్పుడూ ఇలా జరుగుతుందని చెబుతున్నారు. నిపుణులు కూడా పుతిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు అనడానికి ఇదే సంకేతం అని తేల్చి చెప్పారు. పుతిన్ ఇటీవలె 70 ఏళ్ల వయసులో అడుగుపెట్టారు. వయసు రీత్యా సమస్యలు ఉండటం అత్యంత సహజం. గానీ ఈ రష్యా ఏ ముహర్తానా ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిందో అప్పటి నుంచి పుతిన్ ఆరోగ్యం పెద్ద హాట్‌టాపిగా మారిపోయింది. (చదవండి: పుతిన్ ప్లాన్ అట్టర్ ప్లాప్...71 వేల మంది రష్యా సైనికులు మృతి) -
5జీకి కస్టమర్లు సిద్ధంగా లేరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం యూజర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 5జీ సేవలు ఎట్టకేలకు భారత్‌లో ప్రారంభం అయ్యాయి. 50 కోట్ల స్మార్ట్‌ఫోన్ యూజర్లలో 10 శాతం మంది వద్ద ఇప్పటికే 5జీ హ్యాండ్సెట్స్ ఉన్నాయి. అయితే ఈ ఏడాది 5జీ సేవలకు మళ్లేందుకు కేవలం 5 శాతం మంది మాత్రమే సిద్ధంగా ఉన్నారని కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 318 జిల్లాల్లో చేపట్టిన ఈ సర్వేలో 29,000 పైచిలుకు మంది మొబైల్ యూజర్లు పాలుపంచుకున్నారు. వీరిలో 64 శాతం పురుషులు, 36 శాతం మహిళలు ఉన్నారు. ప్రథమ శ్రేణి నగరాల నుంచి 47 శాతం, ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలు 34 శాతం, మిగిలినది ఇతర పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు. అదనపు చెల్లింపులకు నో.. ప్రతి నెల 5జీ సేవల కోసం అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించేందుకు సిద్ధంగా లేమని 43 శాతం మంది తేల్చిచెప్పారు. ప్రస్తుత 3జీ/4జీ టారిఫ్‌లోనే 5జీ సేవలు ఉండాలని వారు స్పష్టం చేస్తున్నారు. 43 శాతం మంది మాత్రం కేవలం 0–10 శాతం ఎక్కువ చెల్లించేందుకు రెడీ అని వెల్లడించారు. 10–25 శాతం అధికంగా ఖర్చు చేయడానికి 10 శాతం మంది మాత్రమే ఆసక్తి చూపారు. అయితే 4జీ హ్యాండ్సెట్స్ వాడుతున్నప్పటికీ కాల్ నాణ్యత మెరుగుపడలేదు. ఇంటర్నెట్ వేగం పెద్దగా పెరగలేదు. ఈ నేపథ్యంలో 5జీని సపోర్ట్ చేసే గ్యాడ్జెట్ల కోసం అదనంగా ఖర్చు చేయాలా వద్దా అని వినియోగదార్లు ఆలోచిస్తున్నారు. పరిష్కారం అయ్యాకే.. సర్వేలో పాల్గొన్నవారిలో 20 శాతం మంది వద్ద 5జీ హ్యాండ్సెట్స్ ఉన్నాయి. ఈ ఏడాది 5జీ స్మార్ట్‌ఫోన్ కొంటామని 4 శాతం మంది చెప్పారు. వచ్చే ఏడాది కొనుగోలు చేస్తామని 20 శాతం మంది తెలిపారు. సమీప కాలంలో అప్‌గ్రేడ్‌కు ఆసక్తిగా లేమని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాల్ డ్రాప్/కనెక్ట్, నెట్వర్క్ అందుబాటులో లేకపోవడం, తక్కువ వేగం వంటి సమస్యలకు 5జీ ద్వారా పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్టు 39 శాతం మంది తెలిపారు. ఈ సమస్యలు పరిష్కారం అయ్యాకే 5జీకి మళ్లేందుకు సిద్ధమని 39 శాతం మంది స్పష్టం చేశారు. -
మహిళా భద్రతకు శక్తివంతమైన సాధనం!
న్యూఢిల్లీః మహిళల భద్రతకు భరోసాను కల్పిస్తూ కార్పన్ మొబైల్ మరో అడుగు ముందుకేసింది. పూర్తి భద్రతా సామర్థ్యం కలిగిన పరికరాన్నిఅందించేందుకు సిద్ధమైనట్లు ప్రముఖ దేశీయ మొబైల్ సంస్థ కార్బన్ ప్రకటించింది. మరో రెండు నెలల్లో మహిళల కోసం ప్రత్యేకంగా పనిచేసే మొబైల్ ఎస్ ఓఎస్ అనువర్తనాన్ని అందించనున్నట్లు వెల్లడించింది. వినియోగదారులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నపుడు, వారి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లకు అత్యవసర సందేశాలను పంపించేందుకు వీలుగా ఈ కొత్త సేఫ్టీ యాప్ పనిచేస్తుంది. మొబైల్ స్క్రీన్ పై ఒక్కసారి టాప్ చేస్తే చాలు.. కుటుంబ సభ్యులు, ఇతర అత్యవసర కాంటాక్ట్ నెంబర్లకు సమాచారం నిమిషాల్లో అందిపోతుంది. కాంటాక్ట్ నెంబర్ తో పాటుగా వారి లొకేషన్ ను కూడ ముందుగా షేర్ చేస్తే... అత్యవసర పరిస్థితుల్లో వారున్న ప్రదేశాన్ని సైతం గుర్తించేట్టుగా కార్బన్ మొబైల్ కొత్త ఫీచర్ ను అందిస్తోంది. తాజా సదుపాయంతో వినియోగదారులు అలర్ట్స్ మాత్రమే కాక అలారం మోగించే అవకాశాన్ని కూడ కల్పిస్తోంది. మొబైల్ స్క్నీన్ లాక్ ను అన్ లాక్ చేయకుండా మొబైల్ ను షేక్ చేస్తూ, పవర్ బటన్ ను నొక్కుతుంటే చాలు... అలర్ట్స్ తో పాటు, అలారం కూడ అందే సదుపాయం కార్బన్ కొత్త ఫీచర్ ద్వారా పరిచయం చేస్తోంది. 2017 జనవరి 1 నుంచి మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా పానిక్ బటన్ ఇన్ స్టాల్ చేయాలన్న ప్రభుత్వ సూచనను కార్బన్ అమల్లోకి తెచ్చింది. దీనితోపాటు అన్నిఫోన్లలో జనవరి 2018 నాటికి తప్పనిసరిగా ఇన్ బిల్ట్ జీపీఎస్ నేవిగేషన్ సిస్టమ్ ఉండాలని కూడ ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. ప్రభుత్వ సూచనలను హ్యండ్ సెట్ ఇండస్ట్రీ బాడీ ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ (ఐసీఏ) కూడ స్వాగతించింది. -
యాపిల్ ఐఫోన్ 6 హల్చల్
యాపిల్ ఐఫోన్ 6 హల్చల్ చేస్తోంది. శుక్రవారం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన యాపిల్ ఐఫోన్ 6 స్మార్ట్ఫోన్లను ముందుగా కొనుగోలు చేసిన జర్మనీకి చెందిన కస్టమర్లు ఆనందంతో మునిగి తేలారు. అత్యాధునిక ఫీచర్లను పొందుపర్చి 4.7 అంగుళాలు, 5.5 అంగుళాల స్క్రీన్‌తో ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ మోడల్స్‌ను యాపిల్ గతవారం ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం నుంచి అమెరికా, జర్మనీ తదితర దేశాల్లోని వీటి అమ్మకాలు ప్రారంభించింది. అక్టోబర్ 17న ఇవి భారత్ మార్కెట్లోకి అధికారికంగా రానున్నాయి. ఆన్‌లైన్‌లోనూ, బ్లాక్ మార్కెట్లోనూ ఈ ఫోన్ల ధర అక్షరాలా రూ.1లక్ష దాకా పలుకుతోంది. ఇక భారత్‌లో వీటి రాక కాస్త ఆలస్యం కానున్న నేపథ్యంలో ఈ ఫోన్లను దక్కించుకునేందుకు యాపిల్ అభిమానులు భారీ మొత్తం వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త ఐఫోన్లను అందరికన్నా ముందుగా దక్కించుకునేందుకు యాపిల్ అభిమానులు భారీ రేటు కూడా ఇచ్చేందుకు సిద్ధపడుతుంటే.. మరోవైపు ముందుగా చెప్పిన సమయానికి ఈ హ్యాండ్సెట్స్ అందుబాటులోకి రాకపోవచ్చన్న ఊహాగానాలూ వస్తున్నాయి. -
ఆన్లైన్లో ఐఫోన్ 6 హల్చల్..
రూ. 1 లక్ష పైగా పలుకుతున్న ఐఫోన్ 6 ప్లస్ న్యూఢిల్లీ: కొంగొత్త ఫీచర్లతో టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా ఆవిష్కరించిన ఐఫోన్ 6 స్మార్ట్ఫోన్లు.. ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. అమెరికా తదితర దేశాలతో పోలిస్తే భారత్‌లో వీటి రాక కాస్త ఆలస్యం కానున్న నేపథ్యంలో ఈ ఫోన్లను దక్కించుకునేందుకు యాపిల్ అభిమానులు భారీ మొత్తం వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ-బే వంటి ఆన్లైన్ స్టోర్స్‌లో 5.5 అంగుళాల ఐఫోన్ 6 ప్లస్ (16 జీబీ) అన్లాక్డ్ మోడల్ ఏకంగా రూ. 1.1 లక్ష పైచిలుకు పలుకుతోంది. ఇక 4.7 అంగుళాల ఐఫోన్ 6 (16 జీబీ) దాదాపు రూ. 75,000 పైగా పలుకుతోంది. ఈ ఫోన్ అమెరికా తదితర దేశాల్లో ఈ నెల 19న మార్కెట్లోకి రానుండగా.. అక్టోబర్ 17న భారత మార్కెట్లో అధికారికంగా రానున్నాయి. అయితే, ఈలోగానే ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాల నుంచి ఈ హ్యాండ్సెట్స్ని కొనుగోలు చేసి సెప్టెంబర్‌లోనే అందిస్తామని హామీలు ఇస్తున్నారు ఆన్లైన్ విక్రేతలు. నిర్దిష్టంగా భారత్‌లో రేటును నిర్ణయించనప్పటికీ.. ఐఫోన్ 6 (16జీబీ) మోడల్ రేటు రూ. 48,000-50,000 మధ్యలో, ఐఫోన్ 6 ప్లస్ (16జీబీ) మోడల్ ధర సుమారు రూ. 58,000-60,000 మేర ఉండొచ్చని అంచనా. 64 జీబీ, 128 జీబీ మోడల్స్ ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి. అయితే, దేశీయంగా కోల్‌కతా, న్యూఢిల్లీ వంటి ప్రాంతాల్లోని బ్లాక్‌మార్కెట్లలో వీటిని రూ. 5,000-10,000 ప్రీమియంతో ముందస్తుగా విక్రయిస్తున్నారు. ఈ నెలలోనే అందిస్తామన్న హామీతో ముంబైలోని కొన్ని మార్కెట్లలో 16జీబీ ఐఫోన్ 6ని దాదాపు రూ. 80,000-85,000 రేటుతో అమ్ముతున్నారు డీలర్లు. మొబైల్ పేమెంట్ వంటి కొంగొత్త ఫీచర్లు, పెద్ద స్క్రీన్‌తో మరింత నాజూకైన ఐఫోన్ 6ని యాపిల్ ఈ మధ్యే ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో దేశీ కొనుగోలుదారులు తక్కువ రేట్లకే అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న షియోమీ, మోటరోలా వంటి ఫోన్లవైపు మళ్లుతున్న నేపథ్యంలో ఐఫోన్6కి ఇంత క్రేజ్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఐఫోన్ 1 తర్వాత ఈ స్థాయిలో యాపిల్ ఫోన్‌కి డిమాండ్ రావడం ఇదే మొదటిసారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పండుగ సీజన్ కూడా వస్తుండటంతో.. దీన్ని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు యాపిల్ ఇటు జోరుగా డిజిటల్ మార్కెటింగ్ చేయడంతో పాటు అటు ఆన్‌లైన్‌లోనూ భారీగా విక్రయాలు చేపట్టనుంది. జాప్యానికి అవకాశం.. ఒకవైపు యాపిల్ అభిమానులు కొత్త ఐఫోన్లను అందరికన్నా ముందుగా దక్కించుకునేందుకు భారీ రేటు కూడా ఇచ్చేందుకు సిద్ధపడుతుంటే.. మరోవైపు ముందుగా చెప్పిన సమయానికి ఈ హ్యాండ్సెట్స్ అందుబాటులోకి రాకపోవచ్చన్న ఊహాగానాలూ వస్తున్నాయి. సరఫరాపరమైన సమస్యలే ఇందుకు కారణం కానున్నాయి. కంపెనీ వెబ్సైట్ ప్రకారం 4.7 అంగుళాల స్క్రీన్ వెర్షన్ అమెరికాలో ఈ నెల 19న అందుబాటులోకి రావొచ్చని, అయితే 5.5 అంగుళాల ‘ప్లస్’ వెర్షన్ రావడానికి మాత్రం దాదాపు నెల రోజులు దాకా సమయం పట్టొచ్చని తెలుస్తోంది. ఐఫోన్లకు సంబంధించి యాపిల్ భాగస్వామ్య సంస్థలు వెరిజోన్ వైర్లెస్, ఏటీ అండ్ టీ తదితర సంస్థలు సైతం దాదాపు ఆరు వారాల దాకా జాప్యం జరగొచ్చని తమ తమ వెబ్సైట్లలో ఉంచాయి. ఊహించిన దానికన్నా ఆర్డర్లు వెల్లువెత్తుతున్నా.. ప్రధానమైన డిస్ప్లే ప్యానెల్ పరిమాణం మారడం వల్ల తయారీ సంస్థలు ముందుగా అనుకున్న సమయానికి వాటిని తయారు చేసి అందించే పరిస్థితి లేకపోవడమే ఈ జాప్యానికి కారణం కానుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
నోకియా కొత్త సీఈఓ రాజీవ్‌సూరి?
న్యూఢిల్లీ: నోకియా కొత్త సీఈఓగా భారత్‌కు చెందిన రాజీవ్ సూరి (46) నియమితులయ్యే అవకాశముంది. ప్రస్తుతం కంపెనీ టెలికం పరికరాల వ్యాపారానికి సారథిగా ఉన్న ఆయనను ఈ నెల 29న కొత్త సీఈఓగా ప్రకటించవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. నెట్వర్క్ ఎక్విప్మెంట్ బిజినెస్‌కు సంబంధించిన నూతన వ్యూహాన్ని కూడా నోకియా అదేరోజు వెల్లడించవచ్చని తెలుస్తోంది. ఇక మైక్రోసాఫ్ట్ కనుసన్నల్లో... హ్యాండ్సెట్ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్‌కు విక్రయించే కార్యక్రమాన్ని నోకియా శుక్రవారం పూర్తి చేసింది. పన్ను చెల్లింపుల వ్యవహారంలో వివాదం నెలకొన్న చెన్నై ప్లాంటు మాత్రం నోకియా ఆధీనంలోనే ఉంటుంది. నోకియా తమ హ్యాండ్సెట్ల వ్యాపారాన్ని 720 కోట్ల డాలర్లకు అమ్మేందుకు గత సెప్టెంబర్‌లో మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి విదితమే. ఒప్పందం పూర్తికావడంలో నెలరోజుల జాప్యం కావడంతో ఈ మొత్తం కూడా స్వల్పంగా పెరగనుంది. ఒప్పందం కార్యరూపం దాల్చడంపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. చెన్నై ప్లాంటులో మైక్రోసాఫ్ట్‌కు హ్యాండ్సెట్స్.. నోకియా ఆధీనంలోనే కొనసాగనున్న చెన్నై ప్లాంటులో హ్యాండ్సెట్లను తయారు చేసి మైక్రోసాఫ్ట్‌కు సరఫరా చేసేందుకు ఓ ఒప్పందం కుదిరింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న నోకియా హ్యాండ్సెట్లపై వారంటీ బాధ్యతను ఇకనుంచి మైక్రోసాఫ్ట్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఐదు వేల కోట్ల డాలర్లుగా (రూ. 3 లక్షల కోట్లు) ఉన్న చౌక సెల్ఫోన్ల మార్కెట్‌పై మైక్రోసాఫ్ట్ ఇక దృష్టి సారించనుంది. తద్వారా నోకియాకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. శామ్సంగ్, ఆపిల్లతో పోటీని తట్టుకోలేకపోవడంతో నోకియా మార్కెట్ వాటా గణనీయంగా తగ్గిపోవడం తెలిసిందే. మొబైల్స్‌కు నోకియా బ్రాండ్‌ను పదేళ్లపాటు కొనసాగిస్తామని, నోకియా బ్రాండ్ స్మార్ట్ డివైస్ల మార్కెటింగ్‌కు పరిమితకాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ‘నోకియాకు మంచి బ్రాండ్‌నేమ్ ఉంది. అనేక మోడళ్లను తయారు చేస్తోంది. ఈ అవకాశాన్ని మైక్రోసాఫ్ట్ వినియోగించుకుంటుంది. ఆశా మోడల్స్, స్మార్ట్ఫోన్ల ఉత్పత్తినీ మైక్రోసాఫ్ట్ కొనసాగించే అవకాశముంది’ అని రీసెర్చ్ సంస్థ ఐడీసీ సీనియర్ అనలిస్ట్ మానసి యాదవ్ చెప్పారు.