ఆన్‌లైన్లో ఐఫోన్ 6 హల్‌చల్.. | New Apple iPhone 6 Plus pre-order shipments to be delayed by a month | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్లో ఐఫోన్ 6 హల్‌చల్..

Published Sun, Sep 14 2014 1:02 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

ఆన్‌లైన్లో ఐఫోన్ 6 హల్‌చల్.. - Sakshi

ఆన్‌లైన్లో ఐఫోన్ 6 హల్‌చల్..

రూ. 1 లక్ష పైగా పలుకుతున్న ఐఫోన్ 6 ప్లస్
 
న్యూఢిల్లీ: కొంగొత్త ఫీచర్లతో టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా ఆవిష్కరించిన ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్లు.. ఆన్‌లైన్లో హల్‌చల్ చేస్తున్నాయి. అమెరికా తదితర దేశాలతో పోలిస్తే భారత్‌లో వీటి రాక కాస్త ఆలస్యం కానున్న నేపథ్యంలో ఈ ఫోన్లను దక్కించుకునేందుకు యాపిల్ అభిమానులు భారీ మొత్తం వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ-బే వంటి ఆన్‌లైన్ స్టోర్స్‌లో 5.5 అంగుళాల ఐఫోన్ 6 ప్లస్ (16 జీబీ) అన్‌లాక్డ్ మోడల్ ఏకంగా రూ. 1.1 లక్ష పైచిలుకు పలుకుతోంది.  ఇక 4.7 అంగుళాల ఐఫోన్ 6 (16 జీబీ) దాదాపు రూ. 75,000 పైగా పలుకుతోంది. ఈ ఫోన్ అమెరికా తదితర దేశాల్లో ఈ నెల 19న మార్కెట్లోకి రానుండగా.. అక్టోబర్ 17న భారత మార్కెట్లో అధికారికంగా రానున్నాయి.
 
అయితే, ఈలోగానే ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాల నుంచి ఈ హ్యాండ్‌సెట్స్‌ని కొనుగోలు చేసి సెప్టెంబర్‌లోనే అందిస్తామని హామీలు ఇస్తున్నారు ఆన్‌లైన్ విక్రేతలు. నిర్దిష్టంగా భారత్‌లో రేటును నిర్ణయించనప్పటికీ.. ఐఫోన్ 6 (16జీబీ) మోడల్ రేటు రూ. 48,000-50,000 మధ్యలో, ఐఫోన్ 6 ప్లస్ (16జీబీ) మోడల్ ధర సుమారు రూ. 58,000-60,000 మేర ఉండొచ్చని అంచనా. 64 జీబీ, 128 జీబీ మోడల్స్ ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి. అయితే, దేశీయంగా కోల్‌కతా, న్యూఢిల్లీ వంటి ప్రాంతాల్లోని బ్లాక్‌మార్కెట్లలో వీటిని రూ. 5,000-10,000 ప్రీమియంతో ముందస్తుగా విక్రయిస్తున్నారు. ఈ నెలలోనే అందిస్తామన్న హామీతో ముంబైలోని కొన్ని మార్కెట్లలో 16జీబీ ఐఫోన్ 6ని దాదాపు రూ. 80,000-85,000 రేటుతో అమ్ముతున్నారు డీలర్లు.
 
మొబైల్ పేమెంట్ వంటి కొంగొత్త ఫీచర్లు, పెద్ద స్క్రీన్‌తో మరింత నాజూకైన ఐఫోన్ 6ని యాపిల్ ఈ మధ్యే ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో దేశీ కొనుగోలుదారులు తక్కువ రేట్లకే అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న షియోమీ, మోటరోలా వంటి ఫోన్లవైపు మళ్లుతున్న నేపథ్యంలో ఐఫోన్6కి ఇంత క్రేజ్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఐఫోన్ 1 తర్వాత ఈ స్థాయిలో యాపిల్ ఫోన్‌కి డిమాండ్ రావడం ఇదే మొదటిసారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పండుగ సీజన్ కూడా వస్తుండటంతో..  దీన్ని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు యాపిల్ ఇటు జోరుగా డిజిటల్ మార్కెటింగ్ చేయడంతో పాటు అటు ఆన్‌లైన్లోనూ భారీగా విక్రయాలు చేపట్టనుంది.
 
జాప్యానికి అవకాశం..
ఒకవైపు యాపిల్ అభిమానులు కొత్త ఐఫోన్‌లను అందరికన్నా ముందుగా దక్కించుకునేందుకు భారీ రేటు కూడా ఇచ్చేందుకు సిద్ధపడుతుంటే.. మరోవైపు ముందుగా చెప్పిన సమయానికి ఈ హ్యాండ్‌సెట్స్ అందుబాటులోకి రాకపోవచ్చన్న ఊహాగానాలూ వస్తున్నాయి. సరఫరాపరమైన సమస్యలే ఇందుకు కారణం కానున్నాయి. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం 4.7 అంగుళాల స్క్రీన్ వెర్షన్ అమెరికాలో ఈ నెల 19న అందుబాటులోకి రావొచ్చని, అయితే 5.5 అంగుళాల ‘ప్లస్’ వెర్షన్ రావడానికి మాత్రం దాదాపు నెల రోజులు దాకా సమయం పట్టొచ్చని తెలుస్తోంది.
 
ఐఫోన్లకు సంబంధించి యాపిల్ భాగస్వామ్య సంస్థలు వెరిజోన్ వైర్‌లెస్, ఏటీ అండ్ టీ తదితర సంస్థలు సైతం దాదాపు ఆరు వారాల దాకా జాప్యం జరగొచ్చని తమ తమ వెబ్‌సైట్లలో ఉంచాయి. ఊహించిన దానికన్నా ఆర్డర్లు వెల్లువెత్తుతున్నా.. ప్రధానమైన డిస్‌ప్లే ప్యానెల్ పరిమాణం మారడం వల్ల తయారీ సంస్థలు ముందుగా అనుకున్న సమయానికి వాటిని తయారు చేసి అందించే పరిస్థితి లేకపోవడమే ఈ జాప్యానికి కారణం కానుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement