పేద విద్యార్థుల కోసం ‘స్మార్ట్‌ఫోన్‌ లైబ్రరీ’ | Smartphone Library For Poor Students | Sakshi
Sakshi News home page

పేద విద్యార్థుల కోసం ‘స్మార్ట్‌ఫోన్‌ లైబ్రరీ’

Published Wed, Sep 23 2020 4:32 AM | Last Updated on Wed, Sep 23 2020 8:09 AM

Smartphone Library For Poor Students - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ తరగతులకు అవసరమైన స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు లేని పేద, దిగువ మధ్యతరగతి విద్యార్థుల కోసం ‘స్మార్ట్‌ఫోన్‌ లైబ్రరీ’అందుబాటులోకి రానుంది. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మగ్దూంపూర్‌ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ‘యూ అండ్‌ మీ’, స్ఫూర్తి సంస్థల ద్వారా లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ప్రస్తుత కరోనా కాలంలో స్మార్ట్‌ఫోన్లు కొనే ఆర్థిక పరిస్థితులు లేని విద్యార్థులకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకోసం దాతల సాయం తీసుకోనున్నారు. తెలిసిన వారు, స్నేహితుల నుంచి పనిచేసే స్థితిలో ఉన్న మొబైల్స్, ట్యాబ్స్, కంప్యూటర్లను సేకరించి గ్రామాల్లోని పేద పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సంస్థలు నిర్ణయించాయి. ఈ విధంగా సేకరించిన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను గ్రామాల్లోని స్కూళ్లు లేదా పంచాయతీ కార్యాలయాల్లో ప్రిన్సిపాల్‌ లేదా సర్పంచ్‌ల పర్యవేక్షణలో ఉంచనున్నాయి. డిజిటల్‌ పాఠాల హడావుడి ముగిశాక ఈ ఫోన్లు, ఇతర పరికరాలను మళ్లీ సొంతదారులకు అందజేసేందుకు చర్యలు చేపడుతున్నాయి. 

ఇవ్వగలిగిన వారు ముందుకు రావాలి... 
స్మార్ట్‌ఫోన్‌ లైబ్రరీ కార్యక్రమాన్ని బీవీ రావు, ఇతర మిత్రులతో కలసి చేపడుతున్నాం. ఈ విధంగా సేకరించిన పది సెల్‌ఫోన్లను మొదటగా బుధవారం నుంచి మగ్దూంపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులోకి తెస్తున్నాం. ఆ గ్రామంలో సెల్‌ఫోన్లు లేదా ఇతర సౌకర్యాలు లేని విద్యార్థులు 15 మంది ఉన్నట్టుగా గుర్తించాం. ఈ సౌకర్యాన్ని ఆ విద్యార్థులు ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేశాం. ఇదేవిధంగా మిగతావారు కూడా పనిచేసే పాత ఫోన్లను తాము చదువుకున్న లేదా తమ గ్రామంలోని పాఠశాల, పంచాయతీ కార్యాలయంలో అందజేస్తే పేద విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. తమ వస్తువులను అందించే విషయంలో ఇబ్బందులు ఎదురైన వారు ‘యూ అండ్‌ మీ’వెబ్‌సైట్‌ను సంప్రదిస్తే సాయం చేసే ఏర్పాట్లు చేశాం. వారు ఏ గ్రామంలో, ఏ స్కూల్లో, ఎక్కడ వాటిని అందజేయమంటే అక్కడికి చేర్చే బాధ్యతను జిల్లాల్లోని సమన్వయకర్తలు తీసుకుంటారు. – సైకాలజిస్ట్‌ డాక్టర్‌ వీరేందర్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement