ఐఫోన్ 6లో ఏమున్నాయి? | salient features of iPhone 6 | Sakshi
Sakshi News home page

ఐఫోన్ 6లో ఏమున్నాయి?

Published Wed, Sep 24 2014 10:49 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

salient features of iPhone 6

చుక్కల్లో చంద్రుడు ఎలాగో స్మార్ట్‌ఫోన్లలో ఐఫోన్ అలా అనడం అతిశయోక్తి కాదేమో. అందుకే కొత్త మోడల్ ఐఫోన్ విడుదలైన ప్రతిసారి సందడి సందడిగా ఉంటుంది. కొత్త కొత్త రికార్డులు పుట్టుకొస్తూంటాయి. తాజాగా ఐఫోన్ 6, 6 ప్లస్, ఐఓఎస్ 8లు కూడా దీనికి భిన్నమేమీ కాదు. విడుదలైన తరువాత తొలి వారాంతంలో ఏకంగా కోటి ఐఫోన్లను విక్రయించి ఆపిల్ మరో రికార్డు సృష్టించింది. ఇంతకీ ఈ తాజా ఐఫోన్లలో ఉన్న విశేషాలేమిటి? అర లక్ష పోసి కొంటే వచ్చే ప్రయోజనాలేమిటి?
 
ముందుగా ఆపిల్ తాజా ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 8 గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఆపిల్ అభిమానులు ఈ కొత్త ఓఎస్‌ను చూసి పెదవి విరిచేశారు. అయితే కొంచెం తరచి చూస్తేగానీ దీంట్లోని కొత్త ఫీచర్లేమిటన్నది స్పష్టం కాదు. ఉదాహరణకు... పాతతరం ఐఫోన్లలో ఈమెయిల్ మల్టీటాస్కింగ్ సౌకర్యం అస్సలు లేదు. స్క్రీన్‌పై ఉన్న మెయిల్‌ను క్లోజ్ చేస్తేగానీ రెండోదాన్ని ఓపెన్ చేయడం సాధ్యమయ్యేది కాదు. ఐఫోన్ 6లో ఈ ఇబ్బంది లేదు. మెయిల్‌ను ఒకసారి కిందివైపు స్వైప్ చేస్తే చాలు... నేరుగా ఇన్‌బాక్స్‌లోకి వెళ్లవచ్చు. దీంతోపాటు మెయిళ్లను ట్యాబ్‌ల మాదిరిగా ఓపెన్ చేసి బ్రౌజ్ చేయవచ్చు కూడా.
 
థర్డ్ పార్టీ కీబోర్డు

ఆపిల్ ఉత్పత్తులు అన్నింటిలో ప్రొప్రయిటరీ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లనే వాడుతూంటారు. ఇతర కంపెనీల ఉత్పత్తులను వాడుకునే అవకాశం దాదాపుగా ఉండదు. తాజ ఐఫోన్ దీనికి మినహాయింపు. ప్రత్యేకంగా రూపొందించిన ఐఫోన్ కీబోర్డు స్థానంలో ఇతర కంపెనీల కీబోర్డులు కూడా వాడుకునేందుకు దీంట్లో అవకాశం కల్పించారు.సెట్టింగ్స్‌లోని జనరల్ ట్యాబ్‌లో ఉండే కీబోర్డు ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన కీబోర్డును ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అయితే కొత్త కీబోర్డుతో వాయిస్ టు టెక్స్ట్ ఫీచర్ పనిచేయదు. టచ్ ఐడీ ఫీచర్‌లోనూ ఇతర కంపెనీల ఉత్పత్తులను వాడుకునేందుకు అవకాశం కల్పించడం మరో విశేషం.
 
నోటిఫికేషన్లతో గమ్మత్తులు..

కొత్త మెసేజీలు, అలర్ట్‌ల వివరాలు తెలుసుకునేందకు పనికొచ్చే నోటిఫికేషన్ ఏరియా ఇప్పుడు గమ్మత్తులకు కేంద్రమైంది. ఆయా నోటిఫికేషన్లు ఎక్కడి నుంచి (మెసేజ్, వాట్స్ యాప్, మెయిల్ వంటివి) వచ్చినప్పటికీ ఆయా అప్లికేషన్లలోకి వెళ్లే అవసరం లేకుండా నేరుగా వాటికి సమాధానమివ్వడం, డిలీట్ చేయడం, అలారం వంటి వాటిని ఆఫ్ చేయడం చేసేయవచ్చు. వీటితోపాటు వాయిస్ అసిస్టెంట్ సిరిలోనూ కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి.

ఐఫోన్ బ్యాటరీ వినియోగంపై ఒక కన్నేసి ఉంచేందుకు ఏర్పాట్లు ఉండటం ఐఫోన్ 6లో కనిపించే ప్రత్యేకమైన ఫీచర్. దీన్ని ఉపయోగించుకునేందుకు సెట్టింగ్స్‌లోని జనరల్ ఆప్షన్‌లోకి వెళ్లండి. యూసేజ్, బ్యాటరీ అని ఉన్న చోట ట్యాప్‌చేస్తే ఏఏ అప్లికేషన్లు ఎంత మేరకు బ్యాటరీని వాడుతున్నాయో తెలుస్తుంది. అంతేకాదు... ఆయా అప్లికేషన్లు ఎందుకు అంత మేరకు బ్యాటరీని ఉపయోగించాయో కూడా వివరించడం (సిగ్నల్ సామర్థ్యం తక్కువగా ఉందని... చాలాసమయం పాటు ఆన్‌లో ఉన్నట్లు... ) విశేషం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement