న్యూఢిల్లీ: దేశీ మొబైల్స్ మార్కెట్లో ఐఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్ వాటా గణనీయంగా పడిపోయింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 55 శాతం మేర క్షీణించినట్లు మార్కెట్ రీసెర్చ్ సంస్థల నివేదికల్లో వెల్లడైంది. ఐఫోన్లు ఇప్పటికే ఖరీదైనవి కాగా.. కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్ (సీబీయూ)పై దిగుమతి సుంకం 20 శాతం పెరుగుదలతో, వీటి రేటు మరింతగా పెరిగిపోయిందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ఒక నివేదికలో పేర్కొంది. దీంతో ఐఫోన్ 8, ఎక్స్ సిరీస్‌ల దిగుమతులు తగ్గాయని తెలిపింది.
మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రీమియం ఫోన్స్ విభాగం వాటా 4 శాతం ఉంటుంది. ఇందులో యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్ సంస్థల వాటా 95 శాతం మేర ఉంది. సూపర్ ప్రీమియం సెగ్మెంట్‌లో (రూ. 50 వేల పైగా ఖరీదు చేసే ఫోన్స్) యాపిల్ వాటా 82 శాతం నుంచి 25 శాతానికి పడిపోయినట్లు సైబర్‌మీడియా రీసెర్చ్ తెలిపింది.
సుమారు 16 శాతం వృద్ధితో ఈ విభాగంలో సగభాగం వాటాను శాంసంగ్ దక్కించుకున్నట్లు వివరించింది. క్యాష్‌బ్యాక్, ఎక్సే్చంజ్, అప్‌గ్రేడ్, బండిల్డ్ డేటా స్కీమ్ మొదలైన ఆఫర్లు శాంసంగ్ ఎస్9 అమ్మకాలు భారీగా పెరగడానికి ఉపయోగపడినట్లు తెలిపింది. గతేడాది జూలై–సెప్టెంబర్ నుంచి ప్రీమియం సెగ్మెంట్‌లో వన్‌ప్లస్ స్థిరంగా రెండో స్థానంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment