యాపిల్ , శాంసంగ్ రారాజు ఎవరు?
ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో దూసుకుపోతున్న శాంసంగ్ కంపెనీ.. మరో దిగ్గజం యాపిల్‌కు చెక్ పెట్టింది. ప్రపంచ మొబైల్ టెక్నాలజీలో దిగ్గజాలైన యాపిల్, శాంసంగ్ మధ్య పోటీలో శాంసంగ్ భారత్‌లో రారాజుగా నిలిచింది. స్మార్ట్ ఫోన్ సెగ్మంట్‌లో నెంబర్ 1 స్థానం కోసం హోరాహోరీగా జరిగిన పోటీలో శాంసంగ్ పైచేయి సాధిచింది. ఇటీవల యాపిల్ సంస్థ ప్రకటించిన నిరాశాజనక ఫలితాలు, శాంసంగ్ ప్రకటించిన బంపర్ ఫలితాల నేపథ్యంలో మార్కెట్ ఎనలిస్టులు ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
శాంసంగ్, యాపిల్ రెండూ టెక్నాలజీ దిగ్గజాలే.. రెండూ దేనికదే సాటి. అయితే ఈ మధ్య కాలంలో శాంసంగ్ బాగా పుంజుకుని పోటీలో ముందంజ వేసింది. జనవరి- మార్చి త్రైమాసిక ఫలితాల్లో 35 నుంచి 62 శాతం శాంసంగ్ వృద్ధిని నమోదు చేయగా.. యాపిల్ 55 నుంచి 37 శాతానికి పడిపోయింది. శాంసంగ్ భారతదేశంలో ప్రీమియం సెగ్మెంట్లో నంబర్ 1 స్థానానికి ఎగబాకిందని సీఎంఆర్ వ్యాఖ్యానించింది. గత ఏడాదితో పోలిస్తే శాంసంగ్ మార్కెట్ గణనీయంగా విస్తరించిందని మార్కెట్ పరిశోధన కంపెనీ జీఎఫ్కె పేర్కొంది. జనవరి మార్చి త్రైమాసికంలో యాపిల్ మార్కెట్ షేర్ 41 శాతంగా ఉంటే శాంసంగ్ మార్కెట్ షేర్ 50 శాతంగా నమోదైందని తెలిపింది.
మరోవైపు భారతదేశంలో ఐఫోన్ అమ్మకాలు ఆదాయంలో 56 శాతం క్షీణించాయి. బుధవారం వెల్లడించిన త్రైమాసిక అమ్మకాల్లో 13 సంవత్సరాలలో తొలిసారి తాము భారీగా నష్టపోయినట్టు కంపెనీ నివేదించింది. ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ భారతదేశంలో తమ వ్యాపారం పై ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా గత నెలలో లాంచ్ చేసిన బ్లాక్‌బస్టర్ మోడల్ గెలాక్సీ ఎస్ 7 అందించిన సక్సెస్ , గెలాక్సీ ఎస్ 6 ఎస్ 5 ధరల తగ్గింపు శాంసంగ్ హవా కొనసాగడానికి దోహదపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.