యాపిల్ కు బ్యాడ్ న్యూస్
సియోల్ : స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో కొరియా సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ మరోసారి తన సత్తాను చాటుకుంది. నువ్వా నేనా అన్నట్టుగా తలపడి యాపిల్ వెనక్కి నెట్టి అగ్రభాగంలో నిలిచిన శాంసంగ్ తన హవాను కొనసాగిస్తోంది. ప్రధాన ఉత్పత్తుల అమ్మకాల్లో గణనీయమైన ఆదాయ అభివృద్ధిని నమోదు చేసింది. గురువారం విడుదల చేసిన రెండవ త్రైమాసిక ఫలితాల్లో 18 శాతం వృద్ధిని సాధించింది. ఇయర్ ఆన్ ఇయర్ ఆపరేటింగ్ లాభాల్లో 8.14 ట్రిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది.
ఫ్టాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ అమ్మకాల్లో గెలాక్సీ ఎస్ 7, గాలక్సీ తో ఎస్ 7 ఎడ్జ్ బలమైన వృద్ధిని నమోదు చేసింది. టాబ్లెట్ పీసీల అమ్మకాలు సుమారు ఆరు మిలియన్ యూనిట్లుగా నమోదైంది. శాంసంగ్ ప్రకటన ప్రకారం మొత్తం అమ్మకాల్లో 80 శాతం వృధ్దిని , స్మార్ట్ ఫోన్ విక్రయాల్లో 90మిలియన్ల యూనిట్ల అమ్మకాలతో టాప్ ప్లేస్ లో నిలిచింది. 72 మిలియన్ల ఫోన్లను విక్రయిస్తుందనే అంచనాలను అధిగమించి యాపిల్ కు మరోసారి సవాల్ విసిరింది. ఇదే త్రైమాసికంలో యాపిల్ ఐ ఫోన్ అమ్మకాలతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు.
థర్డ్ క్వార్టర్ లో తాము విడుదల చేసే అతిపెద్ద స్ర్కీన్ ఫ్లాగ్ షిప్ హ్యాండ్ సెట్ ఈ స్థాయి అమ్మకాలను నిలబెట్టుకోవడంలో తోడ్పడుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఈ ఏడాది గెలాక్సీ ఎ, జె సిరీస్ రిలీజ్ పై దృష్టి పెట్టనున్నట్టు పేర్కొంది. ప్రత్యేకంగా చైనా మార్కెట్ లో గెలాక్సీ సీ ని పరిచయం చేయనున్నట్టు వివరించింది.
కాగా గతవారం యాపిల్ ప్రకటించిన ఫలితాల్లో 15 శాతం క్షీణతను నమోదు చేసింది. యాపిల్ ఐ ఫోన్ అమ్మకాల్లో ఎనలిస్టుల అంచనాలను అధిగమించినప్పటికీ శాంసంగ్ అమ్మకాలతో పోలిస్తే.. (40.4 మిలియన్ల అమ్మకాలతో) యాపిల్ వెలవెలబోయింది. ఇది నిజంగా యాపిల్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మరోవైపు యాపిల్ రెండవ అతిపెద్ద మార్కెట్ చైనా నిషేధంతో యాపిల్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఈ పరిణామం ఐ ఫోన్ అమ్మకాలపై భారీ ప్రభావాన్ని చూపించింది.