రిటైల్‌లో రూ.3,350 కోట్లు
హెచ్1 2016లో రికార్డు స్థాయిలో పీఈ నిధుల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: దేశీయ చిల్లర వర్తకం (రిటైల్ రంగం)లో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. 2008 నుంచి ఇప్పటివరకు ఏనాడు రాని స్థాయిలో 2016 హెచ్1లో రికార్డు స్థాయిలో పెట్టుబడులొచ్చాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. 2015 హెచ్1లో రిటైల్ రంగంలో రూ.250 కోట్ల పీఈ పెట్టుబడులు రాగా.. ఈ ఏడాది హెచ్1లో రూ.3,350 కోట్లు వచ్చాయని పేర్కొంది.
రిటైల్ రంగంలో లీజు కార్యకలాపాలు పెరగడం, రీట్స్ వంటి పెట్టుబడి విధానాల్లో ప్రభుత్వం సడలింపునివ్వటం వంటివి ఈ వృద్ధికి కారణమని నివేదిక వెల్లడించింది. గతేడాది కాలంగా కస్టమర్ల జీవన వృద్ధి కూడా 10 శాతం పెరిగిందని, ఈ-కామర్స్ రంగం అభివృద్ధి కూడా పీఈ పెట్టుబడులకు కలిసొచ్చాయని సంస్థ ఎండీ అన్షుల్ జైన్ పేర్కొన్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలు హైదరాబాద్, బెంగళూరుల్లో గిడ్డంగుల ఏర్పాటుకు ముందుకొచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
దేశంలోని 8 ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, హైదరాబాద్, పుణె, కోల్‌కత్తా, ముంబైల్లో 2015 హెచ్1లో 0.2 మిలియన్ చ.అ.ల్లో మాల్స్ రాగా.. ఈ ఏడాది హెచ్1లో 4.8 మిలియన్ చ.అ.ల్లో కొత్త మాల్స్ వచ్చాయి. కొత్త మాల్స్ సరఫరాలో 64 శాతంతో ఢిల్లీ ప్రథమ స్థానంలో నిలిచింది. అయితే మాల్ వెకన్సీలో మాత్రం 33 శాతంతో అహ్మదాబాద్ తొలి స్థానంలో నిలవగా.. ఢిల్లీ-ఎన్‌సీఆర్, పుణెల్లో 20 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ముంబైలో 16 శాతం, బెంగళూరులో 12 శాతం వెకన్సీ ఉన్నాయి.
స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి.
realty@sakshi.com