PE funds
-
2020: ఎఫ్‌పీఐల పెట్టుబడుల స్పీడ్
ముంబై, సాక్షి: ఈ కేలండర్ ఏడాది(2020)లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) నుంచి దేశీ క్యాపిటల్ మార్కెట్లలోకి భారీగా పెట్టుబడులు తరలివచ్చాయి. ప్రధానంగా ఈక్విటీలలో ఇప్పటివరకూ 22.6 బిలియన్ డాలర్లు ప్రవహించాయి. ఇవి 2019లో నమోదైన 14.23 బిలియన్ డాలర్లతో పోలిస్తే 58 శాతం అధికంకావడం విశేషం! తద్వారా వర్ధమాన మార్కెట్లలో అత్యధిక ఎఫ్‌పీఐల పెట్టుబడులను ఆకట్టుకున్న దేశంగా చైనా తదుపరి భారత్ నిలిచింది. ఇప్పటివరకూ చైనాకు 104 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తరలి వెళ్లాయి. అయితే 2019లో చైనా ఆకట్టుకున్న 132.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి 21 శాతానికిపైగా తక్కువకావడం గమనార్హం! కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ రూపొందించిన గణాంకాలివి. కాగా.. 2019లో 4.4 కోట్ల బిలియన్ డాలర్లను ఆకట్టుకున్న రష్యా 2020లో మరింత అధికంగా 12.25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టింది. తద్వారా మూడో ర్యాంకులో నిలిచింది. చదవండి: (2021: ముకేశ్ ఏం చేయనున్నారు?) ఏప్రిల్ నుంచీ జోరు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ రెండో వారంవరకూ చూస్తే దేశీ ఈక్విటీలలోకి రూ. 2 లక్షల కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు ప్రవహించాయి. వీటిలో ఫైనాన్షియల్ సర్వీసుల రంగం రూ. 63,000 కోట్లను ఆకట్టుకోగా.. రూ. 47,000 కోట్ల పెట్టుబడులతో బ్యాంకింగ్ అగ్రభాగాన నిలిచింది. కోవిడ్-19 కారణంగా నిజానికి ఏప్రిల్, మే నెలల్లో ఎఫ్‌పీఐలు నికర అమ్మకందారులుగా నిలిచారు. అయితే నవంబర్‌లో గత 12 ఏళ్లలోలేని విధంగా 8.1 బిలియన్ డాలర్లను ఎఫ్‌పీఐలు ఇన్వెస్ట్ చేశారు. ఇదే నెలలో భారత్ తదుపరి బ్రెజిల్(6.2 బిలియన్ డాలర్లు), దక్షిణ కొరియా(5.2 బిలియన్ డాలర్లు), తైవాన్(4.5 బిలియన్ డాలర్లు) జాబితాలో చేరాయి. ఇక డిసెంబర్‌లోనూ ఇప్పటివరకూ దేశీ ఈక్విటీలలోకి 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించడం ప్రస్తావించదగ్గ అంశం! 80 శాతం జూమ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ కల్లోలంతో మార్చిలో స్టాక్ మార్కెట్లు పతనమైన సంగతి తెలిసిందే. తదుపరి పలు దేశాల కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా భారీ సహాయక ప్యాకేజీలను అమలు చేయడంతో విదేశీ పెట్టుబడులు ఊపందుకున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ 75 శాతానికిపైగా ర్యాలీ చేసి సరికొత్త గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్ 47,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. నిఫ్టీ 14,000 పాయింట్లవైపు చూస్తోంది. ఈ బాటలో ఎన్ఎస్ఈలో బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 81 శాతం దూసుకెళ్లి 31,000 సమీపానికి చేరింది. ఫలితంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ 80 శాతం స్థాయిలో ఎగశాయి. చదవండి: (2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!) చైనా వెనకడుగు ఈ ఏడాది(2020)లో చైనా, హాంకాంగ్‌ల నుంచి ప్రయివేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ నిధులు భారీగా క్షీణించాయి. ఈ రెండు ప్రాంతాల నుంచి దేశానికి తరలివచ్చిన పెట్టుబడులు 2019తో పోలిస్తే 72 శాతం పడిపోయాయి. 95.2 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాదిలో 340 కోట్ల డాలర్ల పెట్టుబడులు లభించాయి. వెంచర్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం మెయిన్‌ల్యాండ్ చైనా నుంచి 64 శాతం తక్కువగా 37.7 కోట్ల డాలర్లు, హాంకాంగ్ నుంచి 75 శాతం తక్కువగా 57.5 కోట్ల డాలర్ల పెట్టుబడులు తరలి వచ్చాయి. కాగా.. చైనీస్ సంస్థలు దేశీయంగా ఇన్వెస్ట్ చేసేందుకు దాఖలు చేసిన 150 అప్లకేషన్లు పెండింగ్‌లో ఉన్నట్లు ఖైటాన్ అండ్ కో తెలియజేసింది. పెట్టుబడులు తగ్గడానికి ప్రధానంగా ప్రెస్ నోట్3 నిబంధనలు కారణమైనట్లు లా సంస్థ ఖైటాన్ అభిప్రాయపడింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ఏప్రిల్‌లో ప్రభుత్వం పీఎన్3ను ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. ఈ నిబంధనల ప్రకారం భారత్‌తో సరిహద్దు కలిగిన విదేశీ సంస్థలు ప్రభుత్వ అనుమతితోనే ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుందని తెలియజేసింది. -
ఆర్ఐఎల్తో జనరల్ అట్లాంటిక్ డీల్
అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌లో వాటా కొనుగోలుకి తాజాగా పీఈ దిగ్గజం జనరల్ అట్లాంటిక్ పార్టనర్స్ ముందుకు వచ్చినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది. రిలయన్స్ రిటైల్‌లో 0.84 శాతం వాటాను జనరల్ అట్లాంటిక్ కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 3,675 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. దీంతో దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ గ్రూప్‌లోని రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.28 లక్షల కోట్లకు చేరినట్లు పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. రిలయన్స్ రిటైల్‌లో 15 శాతం వాటా విక్రయం ద్వారా ఆర్ఐఎల్ రూ. 60,000-63,000 కోట్ల మధ్య సమకూర్చుకోవాలని యోచిస్తున్నట్లు తెలియజేశాయి. మూడో కంపెనీ ఇప్పటికే రిలయన్స్ రిటైల్‌లో పీఈ దిగ్గజాలు సిల్వర్ లేక్ పార్టనర్స్, కేకేఆర్ అండ్ కో వాటాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సిల్వర్ లేక్ 1.75 శాతం వాటాను సొంతం చేసుకోగా.. కేకేఆర్ 1.28 శాతం వాటాను కైవసం చేసుకుంది. ఇందుకు 1.8 బిలియన్ డాలర్లను వెచ్చించాయి. కాగా.. ఆర్ఐఎల్కు డిజిటల్ అనుబంధ విభాగమైన రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో సైతం జనరల్ అట్లాంటిక్ రూ. 6,598 కోట్లను ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రిలయన్స్ రిటైల్లోనూ వాటా కొనుగోలు చేయడంతో ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. జనరల్ అట్లాంటిక్‌తో అనుబంధం కొనసాగడం ద్వారా వ్యాపార సంస్థలతోపాటు.. వినియోగదారులకూ మరింత లబ్దిని చేకూర్చగలమని పేర్కొన్నారు. ఇదేవిధంగా ముకేశ్ ప్రణాళికలతో దేశ రిటైల్ రంగం సానుకూల మార్పులకు లోనుకానున్నట్లు జనరల్ అట్లాంటిక్ సీఈవో బిల్ ఫోర్డ్ పేర్కొన్నారు. జియో ప్లాట్‌ఫామ్స్ ద్వారా డిజిటల్ ఇండియాకు ఆర్ఐఎల్ సహకరిస్తున్నట్లు తెలియజేశారు. జనరల్ అట్లాంటిక్ నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన విదేశీ పీఈ దిగ్గజం జనరల్ అట్లాంటిక్.. టెక్నాలజీ, కన్జూమర్, ఫైనాన్షియల్ సర్వీసులు, హెల్త్‌కేర్ రంగాలలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. 2020 మార్చికల్లా 34 బిలియన్ డాలర్ల విలువైన నిర్వహణలోని ఆస్తులను(ఏయూఎం) కలిగి ఉంది. దేశీయంగా 3 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. నోబ్రోకర్, అన్అకాడమీ, బైజూస్, బిల్‌డెస్క్, ఎన్ఎస్ఈ తదితరాలలో పెట్టుబడులను కలిగి ఉంది. ఇన్వెస్ట్ చేసిన విదేశీ కంపెనీలలో అలీబాబా, బైట్‌డ్యాన్స్, ఫేస్బుక్, స్నాప్‌చాట్, ఉబర్ తదితరాలున్నాయి. -
రిటైల్‌లో రూ.3,350 కోట్లు
హెచ్1 2016లో రికార్డు స్థాయిలో పీఈ నిధుల వెల్లువ సాక్షి, హైదరాబాద్: దేశీయ చిల్లర వర్తకం (రిటైల్ రంగం)లో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. 2008 నుంచి ఇప్పటివరకు ఏనాడు రాని స్థాయిలో 2016 హెచ్1లో రికార్డు స్థాయిలో పెట్టుబడులొచ్చాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. 2015 హెచ్1లో రిటైల్ రంగంలో రూ.250 కోట్ల పీఈ పెట్టుబడులు రాగా.. ఈ ఏడాది హెచ్1లో రూ.3,350 కోట్లు వచ్చాయని పేర్కొంది. రిటైల్ రంగంలో లీజు కార్యకలాపాలు పెరగడం, రీట్స్ వంటి పెట్టుబడి విధానాల్లో ప్రభుత్వం సడలింపునివ్వటం వంటివి ఈ వృద్ధికి కారణమని నివేదిక వెల్లడించింది. గతేడాది కాలంగా కస్టమర్ల జీవన వృద్ధి కూడా 10 శాతం పెరిగిందని, ఈ-కామర్స్ రంగం అభివృద్ధి కూడా పీఈ పెట్టుబడులకు కలిసొచ్చాయని సంస్థ ఎండీ అన్షుల్ జైన్ పేర్కొన్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలు హైదరాబాద్, బెంగళూరుల్లో గిడ్డంగుల ఏర్పాటుకు ముందుకొచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలోని 8 ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ-ఎన్సీఆర్, హైదరాబాద్, పుణె, కోల్కత్తా, ముంబైల్లో 2015 హెచ్1లో 0.2 మిలియన్ చ.అ.ల్లో మాల్స్ రాగా.. ఈ ఏడాది హెచ్1లో 4.8 మిలియన్ చ.అ.ల్లో కొత్త మాల్స్ వచ్చాయి. కొత్త మాల్స్ సరఫరాలో 64 శాతంతో ఢిల్లీ ప్రథమ స్థానంలో నిలిచింది. అయితే మాల్ వెకన్సీలో మాత్రం 33 శాతంతో అహ్మదాబాద్ తొలి స్థానంలో నిలవగా.. ఢిల్లీ-ఎన్సీఆర్, పుణెల్లో 20 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ముంబైలో 16 శాతం, బెంగళూరులో 12 శాతం వెకన్సీ ఉన్నాయి. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com