అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌లో వాటా కొనుగోలుకి తాజాగా పీఈ దిగ్గజం జనరల్ అట్లాంటిక్ పార్టనర్స్ ముందుకు వచ్చినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది. రిలయన్స్ రిటైల్‌లో 0.84 శాతం వాటాను జనరల్ అట్లాంటిక్ కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 3,675 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. దీంతో దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ గ్రూప్‌లోని రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.28 లక్షల కోట్లకు చేరినట్లు పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. రిలయన్స్ రిటైల్‌లో 15 శాతం వాటా విక్రయం ద్వారా ఆర్‌ఐఎల్ రూ. 60,000-63,000 కోట్ల మధ్య సమకూర్చుకోవాలని యోచిస్తున్నట్లు తెలియజేశాయి.
మూడో కంపెనీ
ఇప్పటికే రిలయన్స్ రిటైల్‌లో పీఈ దిగ్గజాలు సిల్వర్ లేక్ పార్టనర్స్, కేకేఆర్ అండ్ కో వాటాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సిల్వర్ లేక్ 1.75 శాతం వాటాను సొంతం చేసుకోగా.. కేకేఆర్ 1.28 శాతం వాటాను కైవసం చేసుకుంది. ఇందుకు 1.8 బిలియన్ డాలర్లను వెచ్చించాయి. కాగా.. ఆర్‌ఐఎల్‌కు డిజిటల్ అనుబంధ విభాగమైన రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో సైతం జనరల్ అట్లాంటిక్ రూ. 6,598 కోట్లను ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రిలయన్స్ రిటైల్‌లోనూ వాటా కొనుగోలు చేయడంతో ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. జనరల్ అట్లాంటిక్‌తో అనుబంధం కొనసాగడం ద్వారా వ్యాపార సంస్థలతోపాటు.. వినియోగదారులకూ మరింత లబ్దిని చేకూర్చగలమని పేర్కొన్నారు. ఇదేవిధంగా ముకేశ్ ప్రణాళికలతో దేశ రిటైల్ రంగం సానుకూల మార్పులకు లోనుకానున్నట్లు జనరల్ అట్లాంటిక్ సీఈవో బిల్ ఫోర్డ్ పేర్కొన్నారు. జియో ప్లాట్‌ఫామ్స్ ద్వారా డిజిటల్ ఇండియాకు ఆర్‌ఐఎల్ సహకరిస్తున్నట్లు తెలియజేశారు.
జనరల్ అట్లాంటిక్
నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన విదేశీ పీఈ దిగ్గజం జనరల్ అట్లాంటిక్.. టెక్నాలజీ, కన్జూమర్, ఫైనాన్షియల్ సర్వీసులు, హెల్త్‌కేర్ రంగాలలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. 2020 మార్చికల్లా 34 బిలియన్ డాలర్ల విలువైన నిర్వహణలోని ఆస్తులను(ఏయూఎం) కలిగి ఉంది. దేశీయంగా 3 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. నోబ్రోకర్, అన్‌అకాడమీ, బైజూస్, బిల్‌డెస్క్, ఎన్‌ఎస్‌ఈ తదితరాలలో పెట్టుబడులను కలిగి ఉంది. ఇన్వెస్ట్ చేసిన విదేశీ కంపెనీలలో అలీబాబా, బైట్‌డ్యాన్స్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, ఉబర్ తదితరాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment