
కల్యాణ్ జువెల్లర్స్‌లో 1,200 కోట్ల పీఈ పెట్టుబడి
ముంబై: కేరళకు చెందిన ఆభరణాల రిటైల్ చైన్ కల్యాణ్ జువెల్లర్స్.. భారీమొత్తంలో ప్రైవేటు ఈక్విటీ(పీఈ) పెట్టుబడిని ఆకర్షించింది. తమ కంపెనీలో అంతర్జాతీయ పీఈ సంస్థ వార్‌బర్గ్ పింకస్ రూ.1,200 కోట్ల మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసినట్లు కళ్యాణ్ జువెల్లర్స్ సోమవారం తెలిపింది. ఈ డీల్ ద్వారా వార్‌బర్గ్‌కు 15 శాతం వాటా లభించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు కల్యాణ్ జువెల్లర్స్ ఈడీ రమేష్ కల్యాణరామన్ చెప్పారు.
అయితే, వార్‌బర్గ్‌కు ఎంత వాటాను ఇచ్చిందీ చెప్పేందుకు నిరాకరించారు. కాగా, ఒక భారతీయ జువెలరీ తయారీ, పంపిణీ సంస్థలో ఇదే అతిపెద్ద పీఈ పెట్టుబడి అని కల్యాణ్ జువెల్లర్స్ అంటోంది. ఈ నిధులను నెట్‌వర్క్ విస్తరణకు వినియోగించనున్నట్లు పేర్కొంది. తమ సంస్థ వృద్ధిలో పాలుపంచుకోవడానికి వార్‌బర్గ్ పింకస్‌ను సాదరంగా ఆహ్వానిస్తున్నామని కల్యాణ్ జువెల్లర్స్ సీఎండీ టీఎస్ కల్యాణరామన్ పేర్కొన్నారు. 2 దశాబ్దాలుగా ఆభరణాల విక్రయ రంగంలో ఉన్న కల్యాణ్ జువెల్లర్స్‌కు ప్రస్తుతం దక్షిణ భారత్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ పరిసరాలు(ఎన్‌సీఆర్), పంజాబ్‌లలో 55 అవుట్‌లెట్లు... యూఏఈలో 6 అవుట్‌లెట్లు ఉన్నాయి. 2016 కల్లా మొత్తం అవుట్‌లెట్లను 100కు చేర్చాలనేది సంస్థ లక్ష్యం.. వచ్చే 6 నెలల్లో 28 కొత్త విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.