న్యూఢిల్లీ: ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) దిగ్గజం కార్లయిల్ గ్రూప్.. ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. 10 శాతం వాటా కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మార్పిడికి వీలయ్యే డిబెంచర్ల మార్గంలో పెట్టుబడులు చేపట్టనున్నట్లు తెలియజేశాయి. పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ 2023 మార్చివరకూ 26 శాతం వాటాను కొనసాగించనున్న నేపథ్యంలో మార్పిడికి వీలయ్యే రుణ సెక్యూరిటీల జారీపై యూఎస్ పీఈ దిగ్గజం కార్లయిల్ కన్నేసినట్లు తెలుస్తోంది.
ఎఫ్‌డీఐ మార్గంలో
విదేశీ పోర్ట్‌ఫోలియో(ఎఫ్‌పీఐ) విధానంలో కాకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) మార్గంలో ఇన్వెస్ట్ చేసేందుకు కార్లయిల్ గ్రూప్ ప్రణాళికలు వేసినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. అయితే విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) ప్రకారం ఎఫ్‌డీఐగా అర్హత సాధించాలంటే కనీసం 10 శాతం వాటాను కొనుగోలు చేయవలసి ఉంటుంది. వచ్చే నెల(జూలై) మధ్యలో యస్ బ్యాంక్ బోర్డు సమావేశంకానుంది. ఈ సమావేశంలో నిధుల సమీకరణ అంశాన్ని బోర్డు చేపట్టనున్నట్లు అంచనా. నిబంధనల ప్రకారం ఏదైనా ఒక బ్యాంకులో 4.9 శాతానికి మించి వాటాను సొంతం చేసుకోవాలంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. దీనికితోడు బ్యాంకులో వ్యక్తిగత వాటా విషయంలో 10 శాతం, ఫైనాన్షియల్ సంస్థలైతే 15 శాతంవరకూ పెట్టుబడులపై ఆర్‌బీఐ పరిమితులు విధించింది.
చర్చల దశలో
యస్ బ్యాంకులో 50–60 కోట్ల డాలర్లు(రూ. 3,750–4,500 కోట్లు) వరకూ ఇన్వెస్ట్ చేసేందుకు కార్లయిల్ ఆసక్తిగా ఉన్నట్లు గతంలోనే వార్తలు వెలువడ్డాయి. మరోపక్క బ్యాలన్స్‌షీట్ పటిష్టతకు పీఈ ఇన్వెస్టర్ల నుంచి 1–1.5 బిలియన్ డాలర్లు(రూ. 7,800–11,700 కోట్లు) సమీకరించేందుకు యస్ బ్యాంక్ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కార్లయిల్ వాటా కొనుగోలు వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్‌లోగల మొత్తం వాటాను విక్రయించేందుకు కార్లయిల్ గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 2021 డిసెంబర్‌కల్లా ఎస్‌బీఐ కార్డ్స్‌లో కార్లయిల్ గ్రూప్ సంస్థ సీఏ రోవర్ హోల్డింగ్స్ 3.09 శాతం వాటాను కలిగి ఉంది.
యస్ బ్యాంక్‌లో కార్లయిల్ గ్రూప్
Published Sat, Jun 18 2022 6:17 AM | Last Updated on Sat, Jun 18 2022 6:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment