
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ రియల్టీ మార్కెట్లో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడుల హవా కొనసాగుతోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్థిరాస్తి రంగం రూ.16,500 కోట్ల పీఈ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆకర్షించిందని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక తెలిపింది. గతేడాది క్యూ1తో పోలిస్తే 15 శాతం వృద్ధిని నమోదు చేసిందని పేర్కొంది.
నివాస విభాగానిదే పైచేయి..
నివాస సముదాయాల్లోకి పీఈ పెట్టుబడులు ఎక్కువ చేరాయి. మొత్తం పీఈ పెట్టుబడుల్లో రూ.8,500 కోట్లు ఒక్క రెసిడెన్షియల్ సెక్టార్‌లోకే వచ్చాయి. ఆ తర్వాత ఆఫీసు విభాగంలోకి రూ.6,100 కోట్లు, ఆతిథ్య రంగంలోకి రూ.1,200 కోట్లు, రిటైల్‌లోకి రూ.250 కోట్లు, మిక్స్‌డ్ యూజ్ విభాగంలోకి రూ.110 కోట్లు, ఇండస్ట్రియల్ విభాగంలోకి రూ.350 కోట్ల పీఈ పెట్టుబడులు వచ్చాయి.
ముంబైలోనే ఎక్కువ డీల్స్..
అత్యధిక పీఈ పెట్టుబడులను ఆకర్షించిన నగరాల్లో ముంబై ప్రథమ స్థానంలో నిలిస్తే... ఆ తర్వాత ఢిల్లీ–ఎన్‌సీఆర్, హైదరాబాద్ నగరాలు నిలిచాయి. నివాస సముదాయంలో జరిగిన మొత్తం పీఈ డీల్స్‌లో 19 శాతం ఒక్క ముంబై నగరంలోనే కేంద్రీకృతమయ్యాయి.
ముంబై రూ.6,300 కోట్ల పీఈ పెట్టుబడులను ఆకర్షించి తొలి స్థానంలో నిలిచింది. ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్‌కు చెందిన రెండు ఆఫీసు ప్రాజెక్ట్‌ల్లో బ్లాక్‌స్టోన్ వాటాను కొనుగోలు చేయడం అతిపెద్ద డీల్‌గా నిలిచింది.