రాబోయే దశాబ్దాల్లో సామాన్యుల జీవన ప్రమాణాలు పైపైకి.
గత పదేళ్లలో ప్రభుత్వ సంస్కరణల చలవే ఇది...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశ ప్రజల తలసరి ఆదాయం వచ్చే ఐదేళ్లలో రెట్టింపు కానుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రాబోయే దశాబ్దాల్లో ప్రజల జీవన ప్రమాణాలు భారీగా మెరుగుపడనున్నాయని, ఇదంతా గత పదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణల చలవేనని ఆమె చెప్పారు. శుక్రవారమిక్కడ జరిగిన కౌటిల్య ఆర్థిక సదస్సు మూడో ఎడిషన్‌లో మాట్లాడుతూ ఆమె ఈ విషయాలను వెల్లడించారు.
గడిచిన దశాబ్ద కాలంగా భారత్ ఆర్థిక వ్యవస్థ పరుగులతో ఐదేళ్ల కాలంలోనే అతిపెద్ద ప్రపంచ ఎకానమీల్లో 10వ స్థానం నుంచి ఏకంగా 5వ స్థానానికి ఎగబాకిందన్నారు. ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) గణాంకాల ప్రకారం దేశంలో తలసరి ఆదాయం 2,730 డాలర్లను చేరుకోవడానికి 75 ఏళ్లు పట్టింది. దీనికి మరో 2,000 డాలర్లు జతయ్యేందుకు కేవలం ఐదేళ్లే పడుతుంది. రానున్న కొన్ని దశాబ్దాల్లో సామాన్యుని జీవన ప్రమాణాలు దూసుకెళ్లనున్నాయి. భారతీయుల జీవితాల్లో ఇదొక మరపురాని కాలంగా నిలిచిపోతుంది’ అని సీతారామన్ పేర్కొన్నారు. పలు దేశాల్లో ఉద్రిక్తతలతో పరిస్థితులు దిగజారుతూ, ప్రపంచ శాంతికి విఘాతం కలుగుతున్నప్పటికీ, 140 కోట్ల మంది జనాభా గల మన దేశంలో ఆర్థిక అసమానతలను తగ్గిస్తూనే తలసరి ఆదాయాన్ని కొన్నేళ్లలోనే రెట్టింపు చేసే ప్రయత్నాల్లో భారత్ ఉందని ఆమె పేర్కొన్నారు.
నవ భారత శకం...
2047 నాటికి 100 ఏళ్ల స్వాతంత్య్ర మైలురాయిని దాటనున్న నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరడం ద్వారా నవ భారత శకం ఆవిష్కృతమవుతుందని సీతారామన్ పేర్కొన్నారు. వికసిత భారత్‌లో అభివృద్ధి ఫలాలు ఒక్క భారతీయులకు మాత్రమే కాకుండా మిగతా ప్రపంచానికి కూడా విరజిమ్ముతాయని చెప్పారు. మొండి బకాయిలను తగ్గించడం, వాటికి ప్రొవిజనింగ్ పెంపు, లాభదాయకతను మెరుగుపరచడం వంటి స్థిరమైన విధానాలపై దృష్టి సారించడం ద్వారా దేశ బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేశామని, దీనివల్ల ఫైనాన్షియల్ వ్యవస్థ అత్యంత పటిష్టంగా మారిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment