సమీప భవిష్యత్తులో దేశ ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరగబోతున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మాలాసీతారామన్ తెలిపారు. ప్రజల తలసరి ఆదాయం కొన్ని సంవత్సరాల్లోనే రెట్టింపు అవుతుందని అంచనా వేశారు. శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైన ‘కౌటిల్య ఆర్థిక సదస్సు’ మూడో ఎడిషన్‌లో మంత్రి పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘సమీప భవిష్యత్తులో సామాన్య మానవుల జీవన ప్రమాణాలు భారీగా పెరగబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ‘గిని ఇండెక్స్’(ఆర్థిక సమానత్వాన్ని కొలిచే సూచిక. ఇది 0-1 మధ్య ఉంటుంది. 0-పూర్తి ఆర్థిక సమానత్వం, 1-అధికంగా ఉన్న ఆర్థిక అసమానత్వం) 0.283 నుంచి 0.266కు క్షీణించింది. పట్టణ ప్రాంతాల్లో ఇది 0.363 నుంచి 0.314కి చేరింది. కొవిడ్ పరిణామాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంది. 140 కోట్ల జనాభా తలసరి ఆదాయాన్ని కొన్ని సంవత్సరాల్లోనే రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గడిచిన ఐదేళ్ల వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో పదో స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకున్నాం. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2730 డాలర్ల (రూ.2.2 లక్షలు) తలసరి ఆదాయాన్ని చేరుకోవడానికి 75 ఏళ్లు పట్టింది. మరో 2,000 డాలర్లు(రూ.1.6 లక్షలు) అదనంగా సంపాదించేందుకు మాత్రం ఐదు ఏళ్లు సరిపోతుంది’ అన్నారు.
ఇదీ చదవండి: భారత్‌లో యాపిల్ నాలుగు స్టోర్లు..? ఎక్కడంటే..
Comments
Please login to add a commentAdd a comment