రాయదుర్గం (హైదరాబాద్): తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శంగా మారిందని, సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య మోడల్ ఎంతో గుర్తింపు సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు పారిశ్రామిక ప్రగతితో పాటు ఆర్థిక, సామాజిక ప్రగతిని సమాంతరంగా ముందుకు తీసుకెళుతోందని పే ర్కొన్నారు.
ఐటీ రంగం నుంచి మొదలుకుని వ్యవసాయం రంగం దాకా అన్ని రంగాల్లోనూ తెలంగాణ తన ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా పేద, మధ్య తరగతి, ధనిక వర్గాలు అనే వ్యత్యాసం లేకుండా అందరి ప్రగతికీ ప్రభుత్వం పాటుపడుతోందని అన్నారు. మంగళవారం హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీ హబ్ ప్రాంగణంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో కేటీఆర్ మాట్లాడారు.
భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణ రాష్ట్రంలో ఉందని, ప్రస్తుతం మూడు లక్షల 17 వేల రూపాయల తలసరి ఆదాయం కలిగి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి చెప్పారు. రాష్ట్ర జీఎస్‌డీపీ 2014లో రూ.5 లక్షల కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.13.27 లక్షల కోట్లకు చేరిందన్నారు. 2014లో జరిగిన సమావేశంలో ఇన్నోవేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పామని, ఆ మాట మేరకు ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద టీ హబ్, టీవర్క్స్ ఏర్పాటు చేశామని తెలిపారు.
వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్..: ప్రపంచ దేశాలతో పోటీ పడి పెట్టుబడులు రప్పించాలంటే భారీ ఎత్తున మౌలిక వసతుల కల్పన చేపట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తగిన ప్రణాళికలు రూపొందించిందని కేటీఆర్ చెప్పారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుతో పాటు ప్రపంచంలోనే ఏకైక అతిపెద్ద ఫార్మా క్లస్టర్.. హైదరాబాద్ ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ పార్కును సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేశామని, ప్రపంచంలోనే అతిపెద్ద స్టెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ తయారీ యూనిట్ కూడా తెలంగాణలోనే ఉందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్‌గా మారిందన్నారు. వచ్చే సంవత్సరం నాటికి ప్రపంచంలో సగానికి పైగా వ్యాక్సిన్లు హైద రాబాద్ నగరంలోనే తయారు అవుతాయన్నారు.
పారిశ్రామిక ప్రగతితో ఆర్థిక వ్యవస్థ బలోపేతం
రాష్ట్రంలో సాధించిన పారిశ్రామిక ప్రగతి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, రియల్ ఎస్టేట్ వంటి ఇతర రంగాల బలోపేతానికి దోహదం చేసిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోని చిన్న రాష్ట్రం ప్ర పంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (కాళేశ్వరం)ను నిర్మించిందన్నారు.
అన్ని రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోందని చెప్పా రు. రాష్ట్ర ప్రజలు 2014లో ఉన్న పరిస్థితులు, ప్రస్తు తం ఉన్న రాష్ట్ర ప్రగతిని బేరీజు వేసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, పారిశ్రామిక రంగానికి చెందినవారు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment