విశ్లేషణ
1970ల వరకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 1.9 శాతానికి తగ్గిపోయింది. కానీ అనంతరం స్థిరమైన పనితీరు నమోదవుతూ వచ్చింది. ఇప్పుడది 3.5 శాతం. ప్రపంచ సగటు కంటే దేశ ఆర్థిక వ్యవస్థ రెండింతలు వృద్ధి చెందుతోంది. అన్నింటిమీదా నియంత్రణలున్న వామపక్ష విధానాల నుండి దూరం జరిగి కొత్త ఆర్థిక విధానం ప్రారంభం కావడమే దీనికి కారణం. భారతీయులు ఉత్సాహవంతులైన షేర్ మార్కెట్ పెట్టుబడిదారులుగా మారారు. ఈ విజయగాథకు వ్యతిరేక కథనం కూడా ఉంది. ఆదాయపు నిచ్చెన దిగువ ఉన్నవారికి మంచి వేతనాలతో కూడిన పని ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ 7–ప్లస్ శాతానికి చేరుకోగలుగుతుంది. అప్పుడే నిజంగా అధిక వృద్ధి సాధించిన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలుస్తుంది.
అప్పుడు అలా కనిపించక పోయివుండొచ్చు, కానీ 50 ఏళ్ల క్రితం భారతదేశం పెద్ద మలుపును చేరుకుంది. ఆర్థిక సంక్షోభం, రాజకీయ ఉపద్రవం ఏర్పడ్డాయి. ఒక సంవత్సరం తర్వాత దాని నిర్ణయాత్మక చర్య ఏమిటంటే, ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడం. కాకపోతే రెండేళ్ల లోపే అది తారుమారైపోయింది. దేశాన్ని ప్రభావితం చేసిన ఒక ముఖ్య ఘటనను ఆ సమయంలో ఎవరూ గుర్తించలేదు. అదేమిటంటే, ఇందిరా గాంధీ హయాంలో అమలైన సంపూర్ణ వామపక్ష దశ నుండి దూరం జరుగుతూ ఆర్థిక విధానంలో కొత్త దిశ ప్రారంభం కావడమే. అంతవరకు ఆర్థిక వ్యవస్థగా భారత దీర్ఘకాలిక పనితీరు నామమాత్రంగానే ఉండింది. కాలక్రమేణా కొత్త ‘భారత విజయ గాథ’ పుట్టుకొచ్చింది.
1970ల మధ్యకాలం వరకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కంటే భారత్ చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. వరుస యుద్ధాలు, దిగుబడిలేని పంటలు, క్షామం, వేదనాభరితమైన రూపాయి క్షీణతతో పాటు రెండు చమురు షాక్‌ల రూపంలో దాదాపు 15 ఏళ్ల సంక్షో భాలను ఎదుర్కొన్న తర్వాత మార్పు మొదలైంది. నెహ్రూ హయాంలోని ప్రారంభ ఆశావాదం తర్వాత జరిగిన ఈ సంఘటనలు చాలా వరకు జాతి తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేశాయి.
ఆర్థిక వ్యవస్థ స్థిరీకరించబడిన తర్వాత, అర్ధ శతాబ్దపు స్థిరమైన పనితీరు నమోదైంది. తక్కువ ఆదాయం, మధ్య ఆదాయం కలిగిన దేశాలతో పాటు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా మన వృద్ధి రేటు అధిగమించింది. పర్యవసానంగా దేశం మునుపెన్నడూ ఆస్వాదించని అంతర్జాతీయ స్థాయిని నేడు కలిగి ఉంది. అయినప్పటికీ, కొన సాగుతున్న పేలవమైన సామాజిక ఆర్థిక కొలమానాలు, పెరుగుతున్న అసమానత కారణంగా మన వృద్ధి రేటు ‘ఆశాజనకమైన’ రికార్డుగా అయితే లేదు.
ఆర్థిక పరివర్తనకు ముందు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా క్షీణిస్తూ ఉండేది. 1960లో 2.7 శాతం నుండి 1975లో 1.9 శాతానికి మన వృద్ధి క్షీణత మందగించింది. 2013లో కూడా, ప్రపంచ జీడీపీలో భారత్ వాటా 1960 నాటి కంటే కొంచెం తక్కువగా ఉంది. ఇప్పుడు 2024లో ఇది 3.5 శాతం. పైగా ఆర్థిక వ్యవస్థ ప్రపంచ సగటు కంటే రెండింతలు వృద్ధి చెందుతున్నందున, ప్రపంచ వృద్ధికి భారత్ మూడవ అతిపెద్ద దోహదకారిగా ఉంటోంది.
తలసరి ఆదాయం కూడా అదేవిధంగా మెరుగుపడింది. 1960లో ప్రపంచ సగటులో 8.4 శాతంగా ఉన్న దేశ తలసరి ఆదాయం 1974లో 6.4 శాతానికి తగ్గింది. 2011లో ఈ సంఖ్యలు 13.5 శాతా నికి, 2023లో 18.1 శాతానికి మెరుగుపడ్డాయి. దాదాపు ఐదు దశాబ్దాల కాలంలో మూడు రెట్ల పెరుగుదల! అయినప్పటికీ చాలా దేశాల్లోని ప్రజలు మనకంటే మెరుగైన జీవన ప్రమాణాలను అనుభవిస్తున్నారు. ఆఫ్రికా బయటి దేశాల్లో, మన పొరుగు దక్షిణాసియా దేశాల్లో తలసరి ఆదాయం ఇంత తక్కువగా ఉన్నవి పెద్దగా లేవు. అంటే, మనం ప్రయాణించవలసింది ఇంకా ఎంతో ఉంది.
భారతదేశ కథను మార్చేది దాని జనాభా పరిమాణమే. తలసరి ఆదాయం తక్కువగా ఉంది. కానీ 140 కోట్లసార్లు గుణిస్తే అది భారత ఆర్థిక వ్యవస్థను ఐదవ అతిపెద్దదిగా చేస్తుంది. ఇప్పటికే, భారత్ మొబైల్ ఫోన్లు, మోటార్ సైకిళ్లు, స్కూటర్లకు రెండవ అతిపెద్ద మార్కెట్. విమానయానం, కార్లకు మూడవ లేదా నాల్గవ అతిపెద్ద మార్కెట్. ఈ ఉత్పత్తులు, సేవా మార్కెట్లలో వృద్ధికి, పెరుగు తున్న మధ్యతరగతి కారణమవుతోంది. ఇది ‘డాలర్–బిలియనీర్ల’ పెరుగుదలకు దారితీసింది (200 బిలియనీర్లు. ప్రపంచంలో మూడో స్థానం). మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా భారత స్టాక్ మార్కెట్ నాల్గవ స్థానంలో ఉంది.
1970ల మధ్యకాలం వరకు, దాదాపు సగం మంది దారిద్య్ర రేఖకు దిగువన నివసించారు. నేడు, అధికారికంగా 10 శాతం కంటే తక్కువ మంది పేదలు ఉన్నారు. భారత్‌ను ఇప్పుడు పేద ప్రజల దేశంగా కాకుండా అభివృద్ధి చెందుతున్న శక్తిగా అంతర్జాతీయంగా ప్రస్తావిస్తున్నారు. అయినప్పటికీ, వియత్నాం వంటి దేశాలు ‘అధిక అభివృద్ధి’ హోదాను పొందగా, భారత్ తన మానవాభివృద్ధిలో ‘మధ్యస్థ అభివృద్ధి’ దేశంగా మాత్రమే కొనసాగుతోంది. మరో దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలం వరకు ‘అధిక అభివృద్ధి’ విభాగంలో చేరే అవకాశం లేదు. దీనికి మించి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో కూడిన ‘అత్యున్నత అభివృద్ధి’ విభాగం ఉంది. ఇందులోకి చేరాలన్నది ప్రస్తుతం దేశ ఆకాంక్ష.
దేశంలో పాఠశాల విద్య సగటు సంవత్సరాలు 2010లో ఉన్న 4.4 ఏళ్ల నుండి ఇప్పుడు 6.57 ఏళ్లకు మెరుగైనాయి. 1,000 జనాభాకు ఒక వైద్యుడు ఉంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన నిష్పత్తి కంటే ఇది ఎక్కువ. దేశ ప్రజల ఆయుర్దాయం 70 సంవత్సరాల పరిమితిని కూడా దాటేసింది. అధిక ఆదాయాలు వైవిధ్యమైన, సమృద్ధికరమైన ఆహారంలో ప్రతిబింబిస్తాయి. పాల వినియోగం 10 రెట్లు పెరిగింది. చేపల వినియోగం కూడా అలాగే ఉంది. గుడ్ల వినియోగం 20 రెట్లు పెరిగింది.
వీటన్నింటి కంటే ముఖ్యమైనది మనస్తత్వంలో మార్పు. 1970ల మధ్య వరకూ భారత్ సామ్యవాద భావజాలానికి కట్టుబడి ఉంది. అనేక పరిశ్రమలను పెద్ద ఎత్తున జాతీయం చేయడమే కాకుండా, కాగితం నుండి ఉక్కు వరకు, చక్కెర నుండి సిమెంట్ వరకు, ఆఖరికి స్నానం సబ్బుల నుండి కార్ల వరకు ప్రతిదానిపై ధర, ఉత్పత్తి నియంత్రణ ఉండేది! దీని అనివార్య ఫలితం ఏమిటంటే కొరత, బ్లాక్ మార్కెట్లు. పారిశ్రామిక వివాదాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికసంఘాల పక్షం వహించడం పరిపాటిగా ఉండేది. కానీ పరిస్థితులు మారాయి. కమ్యూనిస్ట్ పార్టీలు ఐసీయూలో ఉన్నాయి. పైగా వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వాలు ఇప్పుడు కార్మిక చట్టాలను మార్చాలనుకుంటున్నాయి. పన్ను రేట్లు సహేతుకంగా మారాయి.
భారతీయులు ఇప్పుడు ఉత్సాహవంతులైన షేర్ మార్కెట్ పెట్టుబడిదారులుగా మారారు. 1974లో షేర్ల అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ విలువ రూ. 12 కోట్లు (నేటి డబ్బులో దాదాపు రూ. 350 కోట్లు). దీనితో పోల్చితే, గత రెండేళ్లలో అనేక కంపెనీలు రూ. 15,000 –21,000 కోట్ల విలువైన పబ్లిక్ ఇష్యూలు జారీ చేశాయి (ఎల్‌ఐసీ, అదానీ, వోడాఫోన్ మొదలైనవి). ఒక దశాబ్దం క్రితం వరకు, మ్యూచు వల్ ఫండ్ కంపెనీలు బ్యాంకు డిపాజిట్లలో ఎనిమిదో వంతు కంటే తక్కువ మొత్తాలను నిర్వహించాయి; ఆ షేర్ రెండింతలు పెరిగి ఇప్పుడు పావు వంతు కంటే ఎక్కువకు చేరుకుంది. వచ్చే ఐదేళ్లలో భారతదేశం తన జీడీపీకి గత పదేళ్లలో చేసిన దానికంటే, మరింత ఎక్కువ జోడిస్తుంది.
భారత్ సాధించిన ఈ విజయగాథకు వ్యతిరేక కథనం కూడా తక్కువేమీ లేదు. ఏడేళ్ల క్రితంతో పోలిస్తే వినియోగ సరుకుల ఉత్పత్తి ఏమాత్రం పెరగలేదు. నిల్వ ఉండని సరుకుల ఉత్పత్తి వార్షిక సగటు కేవలం 2.8 శాతమే పెరిగింది. దీనివల్ల స్పష్టంగానే, వినియోగ దారులు ఆర్థికంగా ఒత్తిడికి గురవుతారు. ఆదాయ నిచ్చెన దిగువ ఉన్నవారికి మంచి వేతనాలతో కూడిన పని లేకపోవడాన్ని ఇది సూచిస్తుంది. ఇది మారినప్పుడు మాత్రమే ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7–ప్లస్ శాతానికి చేరుకోగలుగుతుంది. అప్పుడే నిజంగా అధికంగా వృద్ధి సాధించిన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా గుర్తించబడుతుంది.
టి.ఎన్. నైనన్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment