నిర్మొహమాట గుణ సంపన్నులు! | Sakshi Guest Column On Indians Time | Sakshi
Sakshi News home page

నిర్మొహమాట గుణ సంపన్నులు!

Published Mon, Jan 1 2024 4:44 AM | Last Updated on Mon, Jan 1 2024 4:44 AM

Sakshi Guest Column On Indians Time

నిజం అని తాము నమ్మిన దానిని భారతీయులు ఒక అద్భుతమైన విధానంలో వ్యక్తపరుస్తారు. ఏమాత్రం సంకోచం లేకుండా అనువుకాని వేళనైనా చొరవ చేసుకుని వచ్చి తటాలున పేలుతారు. అలా మాట్లాడ్డం వల్ల ఎవర్నయినా తక్కువ చేస్తున్నామా అనే ఆలోచనా వారిలో కనిపించదు. పైపూతలేం ఉండవు. అది కొన్నిసార్లు బాధాకరంగా ఉన్నప్పటికీ దాదాపుగా అదే ఎల్లప్పుడూ ఒక బాధా నివారిణిగా పనికొస్తుంది. కేవలం మన దేశంలో మాత్రమే ముక్కూమొహం తెలియనివారు కూడా రాత్రి పొద్దు పోయాక ఫోన్‌ చేసి, వాళ్ల మనసులో ఉన్నదానిని మీ ముఖానికేసి కొడతారు. అటువంటి ప్రవర్తనతో అందరికీ తాము వేడుక అవుతున్నామని తెలిసినా లెక్కచేయరు. వాళ్లు అలా ఎందుకు చేస్తారంటే, వాళ్లకు అలా చేయాలనిపించింది కనుక! 

రాత్రి బాగా పొద్దుపోయాక ఒక్క ఉదుటున ఉలికిపాటుగా మోగిన ఫోన్‌ని – అవతల ఏం ఉపద్రవం ముంచుకొచ్చిందో ఊహించలేను కనుక – క్షణమైనా ఆలస్యం చేయకుండా చేతికి అందుకున్నాను. మామూలుగా నైతే ఆ ఫోన్‌ మోగిన సమయం, ఆ మాట తీరు ఠప్పున నా చేత ఫోన్‌ పెట్టిపడేసేలా చేసి ఉండేవి.

‘‘నేను మిమ్మల్నొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను’’ అని అంటూనే... నా మాటకు చోటు ఇవ్వకుండా, ‘‘నేను మీ కాలమ్‌ని క్రమం తప్పకుండా చదివే పాఠకుడిని. మీరెప్పుడూ కూడా ప్రతిదాన్నీ విమర్శిస్తూనే ఉండటం గమనించాను. మెచ్చుకోవడానికి అసలు మీకేమీ కనిపించదా?’’ అని అవతలి వ్యక్తి!

ముక్కు మీద గుద్దినట్లున్న ఆ మొద్దుబారిన ప్రశ్న ఒక్కసారిగా నన్ను తత్తరపాటుకు గురిచేసింది. ఏం చెప్పాలో తెలియలేదు. ఒకటి మాత్రం తెలుస్తూనే ఉంది. అతడు నన్ను బోనులో నిలబెట్టాడు. నా తరఫు వాదనను నేను చెప్పాలి. ఫోన్‌ పెట్టేసి తప్పించు కోవచ్చు. అలా చేయాలని నేను అనుకున్న సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. కానీ అది ప్రశ్నకు సమాధానం అవదు. అంతేకాదు, సంభాషణ నుండి ఉత్పన్నం అవవలసిన తక్కిన సందేహాలు అర్ధంతరంగానే వ్యక్తం కాకుండా పోతాయి.

‘‘విమర్శించడమే వివేకం అన్నట్లుగా రాస్తారు మీరు. విమర్శనాత్మకంగా ఉండటం అన్నది పాఠకులకు నచ్చే, పాఠకులకు మిమ్మల్ని నచ్చేలా చేసే విషయమే కావచ్చు. అందులో సందేహం లేదు. కానీ అందువల్ల మీరెప్పుడూ ప్రతికూలతలకు మాత్రమే ప్రఖ్యాతిగాంచిన వారవుతారు. అసలు మీకు నచ్చే విషయాలే ఉండవా? వాటి మాటేమిటి? మీరు ప్రశంసించాలనుకున్న వాటి సంగతేమిటి? వాటి గురించి రాయడం ద్వారా మీకొక గుర్తింపును మీరెందుకు కోరుకోరు? ఏదో ఒకదానినైనా సమర్థించండి. ప్రతి దానినీ విమర్శిస్తూ పోకండి’’ అంటోంది ఆ గొంతు. వారి పేరేమిటో చెప్పారు కానీ, ప్చ్‌... గుర్తుకు రావడం లేదు.  

నన్ను నేను సమర్థించుకోవటానికి దారులు వెతికే పనిలో పడ్డాను. నేను ప్రతికూలమైన వ్యక్తిని కాదని అతడిని సానుకూల పరి చేందుకు ప్రయత్నించాను. కానీ అతడు కొన్ని క్షణాల పాటు మాత్రమే నాకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వగలిగాడు. 

‘‘నేను చెబుతాను ఏం రాయాలో’’ అన్నాడతను. అతడి స్వరంలోని అలజడి కాస్త నెమ్మదించింది. అంతకు ముందున్న అసహనం స్థానంలో ప్రశాంత చిత్తం ప్రతిఫలించింది. ‘‘మీకొక చిన్న సలహా ఇస్తాను. భారతదేశంలో మీకు నచ్చే వాటి గురించి మీరెందుకు రాయ కూడదు? ఆదివారం ఉదయం నేను మీ కాలమ్‌ చదివి సంతోషంగా, సంతృప్తికరంగా ఉండేందుకు అందులో నాకు మూడు మంచి కార ణాలు చూపించండి. కానీ మీరేం చేస్తున్నారో తెలుసా? పూర్తి భిన్న మైన అనుభూతులను నాకు కలిగిస్తున్నారు’’ అన్నాడు. 

ఫోన్‌ పెట్టేశాను. అతడి మాటలు నన్ను అయోమయంలోకి నెట్టేసినా, అతడితో సంభాషణ ఆశ్చర్యకరంగా నాకు సంతోషాన్ని కలుగజేసింది. మొదటిగా చెప్పాలంటే – అతడి వాదనను నేను అంగీ కరించనప్పటికీ, అతడి వైపు నుంచి అది నిజమే కావచ్చు. నాకున్న విమర్శించే హక్కును – అవసరమైతే దుడుకుగా, అదే సమయంలో దాడి చేసినట్లు కాకుండా – నేను వదులుకునే ప్రశ్నే లేనప్పటికీ అప్పు డప్పుడు ప్రశంసించడం, మెచ్చుకోవడం కూడా అవసరమేనని నేను ఒప్పుకుంటాను.

మరీ ముఖ్యంగా నేను చెప్పవలసింది, ఇదే విధమైన సంభాషణ మునుపు కూడా అనేకసార్లు నా అనుభవంలోకి వచ్చింది. అయినప్పటికీ, గతంలో ఎప్పుడూ కూడా నేను ఈ విషయమై గమనింపుతో లేననీ, కనీసం అర్థం చేసుకునే ప్రయత్నమైనా చేయలేదనీ నా కళ్లు తెరుచుకున్నాయి. ఇప్పుడది వచ్చి నేరుగా నా ముఖానికే తగిలిన అభిప్రాయం కాబట్టి బహుశా నేను దాన్నుంచి తప్పించుకునే అవ కాశమే లేదు. 

నిజం అని తాము నమ్మిన దానిని భారతీయులు ఒక అద్భు తమైన విధానంలో వ్యక్తపరుస్తారు. ఏమాత్రం సంకోచం లేకుండా అనువుకాని వేళనైనా చొరవ చేసుకుని వచ్చి తటాలున పేలుతారు. అందులో నమ్మదగనిదేం ఉండదు. అలాగే, ఎవర్న యినా తక్కువ చేస్తున్నామా అనే ఆలోచనా వారిలో కనిపించదు. పైపూతలేం ఉండవు. మన సులో ఏదుంటే అది, చేర్పులేమీ చేయనట్లుగా స్వచ్ఛంగా ఉంటుంది. అది కొన్నిసార్లు బాధాక రంగా ఉన్నప్పటికీ దాదాపుగా అదే ఎల్లప్పుడూ ఒక బాధా నివారిణిగా పనికొస్తుంది. ‘ఊరియా హీప్‌’ (చార్లెస్‌ డికెన్స్‌ నవల ‘డేవిడ్‌ కాపర్‌ఫీల్డ్‌’లో వినయాన్ని నటించే కపటి పాత్ర)కు దీటుగా మనం కలిగి ఉన్న సమాన కపట సామర్థ్యాన్ని అది పోగొడుతుంది.

నిజానికి మరే ఇతర దేశంలోనూ ఇంతటి అద్భుతమైన గుణం ఉన్నట్లు కనిపించదు. బ్రిటిష్‌వాళ్లు మరీ ఉదాసీనంగా ఉంటారు. ఫ్రెంచి వాళ్లు లొడలొడా మాట్లాడుతారు. జర్మనీ దేశస్థులు ఎక్కువ న్యాయ బద్ధంగా పోతారు. ఇటాలియన్లు గడబిడ మనుషులు. అమెరికన్లకు పెద్దగా ఏం తెలియదు. సత్యంలా కనిపించేది ఏదైనా చైనీయుల్ని భయపెడుతుంది.

కేవలం మన దేశంలో మాత్రమే ముక్కూమొహం తెలియనివారు మాటల కవాతు చేస్తారు. రాత్రిళ్లు పొద్దు పోయాక ఫోన్‌ చేసి, వాళ్ల మనసులో ఉన్నదానిని మీ ముఖానికేసి కొడతారు. అంతేకాదు... వాళ్ల వ్యాఖ్య వాళ్ల వ్యక్తిగతం అనీ, అర్ధరాత్రి కూడా దాటేసిందనీ, లేదా ఎవరైనా వింటూ ఉంటారనే నిజాలను కూడా వారు గ్రహించని స్థితిలో ఉంటారు. అటువంటి ప్రవర్తనతో అందరికీ తాము వేడుక అవుతున్నా మని తెలిసినా లెక్కచేయరు. వాళ్లు అలా ఎందుకు చేస్తారంటే, వాళ్లకు అలా చేయాలనిపించింది కనుక! వారిని అలా చేయించే ఉద్వేగం కనీస మర్యాదల్ని, సౌమ్యగుణాన్ని, చివరికి అవకాశం లేకపోవడాన్ని కూడా పట్టించుకోనివ్వదు. అలా తన్నుకొచ్చేస్తుందంతే!

కనుక, ఈ ఉదయం... ఇంతకుముందు నేను సరిగా ఆలోచించని నాలో ఉండవలసిన గుణం గురించి నాలో ఆలోచన రేకెత్తించిన నా నడిరేయి సంభాషణకర్తను అభినందించాలని అనుకుంటున్నాను. మీలాంటి వాళ్లే సర్, ఒక మనిషిలో విమర్శించనందువల్ల కలిగే స్వీయ ఆమోదాన్ని, ఆత్మసంతృప్తిని కదిలిస్తారు. మీ కాల్‌ నాకు గొప్ప ప్రయోజనం కలిగించింది. ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement