సాక్షి, అమరావతి: గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరుగుతోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సగటు తలసరి ఆదాయాన్ని మించి పెరిగింది. 2022–23లో జాతీయ తలసరి ఆదాయం కన్నా రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 47,518 ఎక్కువగా నమోదైంది. 2022–23లో జాతీయ సగటు తలసరి ఆదాయం రూ. 1,72,000 ఉండగా రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,19,518లకు చేరింది.
అలాగే గత మూడేళ్లుగా ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో గత మూడు సంవత్సరాల్లో ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య 1.65 లక్షలకు పెరిగినట్లు ఇటీవల లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. 2020–21లో ఆదాయపు పన్ను చెల్లించిన వారి సంఖ్య 19.79 లక్షల ఉండగా 2022–23లో ఆదాయపు పన్ను చెల్లించిన వారి సంఖ్య 21.65 లక్షలకు పెరిగినట్లు పంకజ్ చౌదరి తెలిపారు.
పన్ను లేకపోయినా ఐటీ రిటర్న్ దాఖలు చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పైసా కూడా ఆదాయపు పన్ను చెల్లించని వారు 2020–21లో 12.55 లక్షల మంది ఐటీ రిటర్న్ దాఖలు చేస్తే, వారి సంఖ్య 2022–23లో 13.04 లక్షలకు పెరిగినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
భారీగా పెరిగిన ఐటీ రిటర్న్‌లు
దేశంలో ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య గత మూడు సంవత్సరాల్లో భారీగా పెరిగినట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. దేశం మొత్తం మీద 2020–21లో 6.72 కోట్ల మంది ఆదాయపు పన్ను చెల్లించగా 2022–23లో ఆ సంఖ్య 7.40 కోట్లకు పెరిగినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆదాయపు పన్ను చెల్లించని వారు కూడా ఐటీ రిటర్న్ దాఖలు చేయడం దేశవ్యాప్తంగా పెరుగుతోందని ఆయన తెలిపారు. 2020–21లో ఆదాయపు పన్ను చెల్లించని వారు 4.84 కోట్ల మంది ఐటీ రిటర్న్ దాఖలు చేస్తే 2022–23లో ఆ సంఖ్య 6.16 కోట్లకు పెరిగినట్లు కేంద్ర మంత్రి వివరించారు.
దేశ సగటును మించి..
జాతీయ సగటు తలసరి ఆదాయాన్ని మించి రాష్ట్ర తలసరి ఆదాయంలో పెరుగుదల నమోదైంది. 2022–23లో జాతీయ సగటు తలసరి ఆదాయంలో పెరుగుదల రూ. 23,476 ఉండగా.. అదే ఏపీలో రూ. 26,931లకు పెరిగింది. దీంతో దేశ, రాష్ట్ర తలసరి ఆదాయం మధ్య వ్యత్యాసం 2022–23లో రూ. 47,518గా నమోదైంది. కోవిడ్ సమయంలో కూడా రాష్ట్ర తలసరి ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే అని నిపుణులు చెబుతున్నారు.
ప్రజలకు డబ్బులిస్తేనే ఆర్థిక రంగానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల ద్వారా లబి్ధదారులకు నేరుగా నగదు బదిలీ చేసింది. టీడీపీ హయాంలో 2018–19లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,54,031తో దేశంలో 17వ స్థానంలో ఉన్న రాష్ట్రం.. 2022–23 నాటికి రూ. 2,19,518తో 9వ స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment