ముంబై: ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న విధాన చర్యల ఫలితాలు ఇప్పటి వరకూ నామమాత్రంగానే ఉన్నట్లు రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ గురువారం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మేలో వేసిన మైనస్ 5 శాతం క్షీణ అంచనాలను ప్రస్తుతం మైనస్ 9 శాతానికి పెంచుతున్నట్లు కూడా క్రిసిల్ పేర్కొంది. ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా ఎటువంటి ద్రవ్య పరమైన మద్దతూ లభించని పరిస్థితి, కరోనా వైరస్ సవాళ్లు కొనసాగుతున్న ప్రతికూలతలు కూడా తమ క్షీణ అంచనాలకు కారణమని తెలిపింది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2020–21) క్షీణత రేటు భారీగా 23.9 శాతం నమోదయిన నేపథ్యంలో ఆవిష్కరించిన క్రిసిల్ తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...
► ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల సహాయక ప్యాకేజీ ప్రకటించింది. ఈ పరిమాణం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతం. అయితే వాస్తవంగా తాజా వ్యయాలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో రెండు శాతంకన్నా తక్కువగా ఉండడం గమనార్హం.
► ఆర్థిక వ్యవస్థ వృద్ధికిగాను ప్రభుత్వ పరంగా భారీ వ్యయాలు చేయడానికి తగిన ద్రవ్య పరిస్థితులు లేవు. ప్రభుత్వ ప్రత్యక్ష ద్రవ్య మద్దతు జీడీపీలో కనీసం ఒక శాతం ఉంటుందని మే అంచనాల నివేదికలో పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పటివరకూ ఈ స్థాయి ప్రత్యక్ష ద్రవ్య మద్దతు లభించలేదు.
► అక్టోబర్ నాటికి కరోనా కేసుల పెరుగుదల ఆగిపోతే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి (మార్చి నాటికి) జీడీపీ వృద్ధి రేటు కొంత సానుకూల బాటలోకి మళ్లే వీలుంది.
► భారత ఆర్థిక వ్యవస్థపై మహమ్మారి ఒక ‘‘శాశ్వత మచ్చ’’ను మిగల్చనుంది.
► స్వల్పకాలికంగా చూస్తే, జీడీపీకి 13 శాతం శాశ్వత నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విలువ దాదాపు రూ.30 లక్షల కోట్ల వరకూ ఉంటుంది.
కేంద్ర చర్యల చేయూత నామమాత్రమే!
Published Fri, Sep 11 2020 5:49 AM | Last Updated on Fri, Sep 11 2020 5:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment