పాడేరు రూరల్: పొదుపు చేయటం ద్వారనే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని, తద్వారా భవిష్యత్తుకు భరోసా ఏర్పడుతుందని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. మండలంలోని కుజ్జెలి పంచాయతీ దిగు మోదాపుట్టు గ్రామంలో మంగళవారం ఐకేపీ రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, రుణాలను సద్వినియోగం చేసుకొని ప్రగతి సాధించాలన్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి దశల వారిగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కుజ్జెలి, దిగు మోదాపుట్టు గ్రామాల్లో సామాజిక భవనాల నిర్మాణానికి కషి చేస్తానన్నారు.
పంచాయతీ పరిధిలోని ఇసుకలు, తూరుమామిడి గ్రామాల్లో రక్షిత తాగునీరు, రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే నేరుగా తమకు అర్జీల రూపంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. అన్ని వేళల్లో గిరిజనులకు అందుబాటులో ఉంటానని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయం సహాయక సంఘంలోని 16 మంది సభ్యులకు మంజూరైన రూ.5 లక్షల రుణాల ద్వార కొనుగోలు చేసిన 3 ఆటోలు, ఒక జెరాక్స్ మెషీన్, దుక్కిటెద్దులు, గొర్రెలను అర్హులైన గిరిజనులకు అందజేశారు. మరో ఇద్దరు మహిళలు రుణం ద్వారా ఏర్పాటు చేసుకున్న కిరాణా దుకాణం, టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పోలుపర్తి నూకరత్నం, ఎంపీపీ వర్తన ముత్యాలమ్మ, సర్పంచ్ గబ్బాడ చిట్టిబాబు, ఎంపీటీసీ సభ్యులు అడపా నర్శిం హామూర్తి నాయుడు, కిల్లు చంద్రమోహన్ కుమార్, కో ఆప్సన్ సభ్యుడు మహమ్మద్ తాజుద్దిన్, మాజీ ఎంపీపీ ఎస్వీవీ రమణమూర్తి, వైఎస్సార్‌సీపీ నాయకులు వర్తన పిన్నయ్యదొర, బూరెడ్డి నాగేశ్వరరావు, ఐకేపీ ఏపీఎం అప్పలనాయుడు, సీసీపీ. గోవిందమ్మ, ఓబీలు ఎస్.నాగమణి, డి.జయ, కె.చిన్నతల్లి, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.
పొదుపుతోనే ఆర్థికాభివృద్ధి: గిడ్డి ఈశ్వరి
Published Wed, Nov 19 2014 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM
Advertisement