సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆర్థికాభివృద్ధిలో వేగంగా దూసుకెళుతోంది. వివిధ రంగాల్లో మంచి వృద్ధిరేటుతో దూకుడు కొనసాగిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాతి నుంచి ఏడేళ్లలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) ఏకంగా 117 శాతం వృద్ధి నమోదు చేసింది. పలు అంశాల్లో జాతీయ సగటుకు రెండింతలకుపైగా వృద్ధిని సాధించింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై రిజర్వు బ్యాంకు తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
ప్రస్తుత ధరల ప్రాతిపదికన.. 2013–14లో రూ.4,51,580.4 కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్డీపీ విలువ.. 2020–21 నాటికి రూ.9,80,407 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా ఐటీ, ఐటీ అనుబంధ సేవలు, ఔషధ రంగ పరిశ్రమలతోపాటు వ్యవసాయం, అనుబంధ రంగాలు రాష్ట్ర వృద్ధికి అండగా నిలిచినట్టు రిజర్వు బ్యాంకు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బ్యాంకింగ్, బీమా, తయారీ, నిర్మాణ రంగాలు కూడా వృద్ధికి ఊతమిస్తున్నాయి. పంటల ఉత్పత్తి బాగా పెరిగింది.
మరోవైపు గత ఏడేళ్లలో రాష్ట్రం సొంత పన్నులు, పన్నేతర ఆదాయాన్ని సైతం భారీగా పెంచుకుంది. కానీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం భారీగా రుణాలు తీసుకుంటుండటంతో ఏటేటా అప్పులు కూడా పెరిగిపోయాయి. వాటిపై చెల్లిస్తున్న వడ్డీలు భారంగా మారుతున్నాయి. బడ్జెట్ ప్రతిపాదనల్లో రెవెన్యూ మిగులును చూపుతున్నా.. భారీ ఆర్థికలోటు కొనసాగుతుండటం గమనార్హం.
ఏడేళ్లుగా రాష్ట్రంలో అన్ని రంగాలు గణనీయంగా వృద్ధిని నమోదు చేయడంతో.. రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. రాష్ట్రం ఏర్పాటైనప్పటితో పోలిస్తే మూడింతలకుపైగా రాబడి వృద్ధి నమో దైంది. పన్నుల రాబడితోపాటు పన్నేతర ఆదాయాన్నీ ప్రభుత్వం పెంచుకోగలిగింది. ఇదే సమయంలో రాష్ట్ర అప్పులు కూడా మూడింతలు పెరిగాయి. వ్యవసాయ ఉత్పత్తుల వృద్ధిలో రాష్ట్రం మెరుగైన పనితీరు ప్రదర్శించింది. వరి, పత్తి, పప్పుధాన్యాల ఉత్పత్తిలో దేశ సగటుకన్నా 3, 4 రెట్లకుపైగా వృద్ధి నమోదవడం గమనార్హం.
సొంత పన్నులు, పన్నేతర ఆదాయంలో భారీ వృద్ధి
తెలంగాణ రాష్ట్రం గత ఏడేళ్లలో సొంత పన్నులు, పన్నేతర ఆదాయంలో భారీ వృద్ధిని నమోదు చేసినట్టు రిజర్వుబ్యాంకు నివేదిక పేర్కొంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఐటీ, తయారీ, పారిశ్రామిక, వ్యవసాయ, మైనింగ్ రంగాలు గణనీయ వృద్ధి సాధించడంతో ఖజానాకు రాబడి పెరిగిందని తెలిపింది. 2014–15తో పోల్చితే.. 2020–21 నాటికి పన్నేతర ఆదాయం 474 శాతం, పన్నుల ఆదాయం 291 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు పేర్కొంది.
రాష్ట్ర సొంత ఆదాయం, ఆర్థిక–రెవెన్యూ లోటు లెక్కలివీ.. (రూ.కోట్లలో)
ఏడాది పన్నేతర పన్నుల ఆర్థిక లోటు రెవెన్యూ
ఆదాయం ఆదాయం లోటు
2014–15 6,447 29,288 9,410 –369
2015–16 14,414 39,975 18,498 –238
2016–17 9,782 48,408 35,231 –1386
2017–18 7,825 58,177 26,514 –3459
2018–19 10,007 65,040 26,944 –4337
2019–20 12,275 71,328 21,913 –104
2020–21 30,600 85,300 33,191 –4482
(రెవెన్యూ లోటు (–)లో చూపారు. అంటే మిగులు ఆదాయం ఉన్నట్టు చూపారు)
ఏడేళ్లలో రంగాల వారీగా రాష్ట్రంలో నమోదైన వృద్ధి.. (రూ.కోట్లలో)
అంశం 2013–14 2020–21 వృద్ధిరేటు
మొత్తం జీఎస్డీపీ విలువ 4,51,580.40 9,80,407.01 117
వ్యవసాయ రంగంలో.. 47,092.85 80,574.00 71
తయారీ రంగంలో.. 57,148.39 94,020.80 64.5
నిర్మాణ రంగంలో.. 24,582.42 37,029.76 50.6
పారిశ్రామిక రంగంలో.. 1,02,825.74 1,79,884.62 74.9
సేవల రంగంలో.. 2,42,272.96 5,33,230.87 120
బ్యాంకింగ్, బీమా రంగంలో 26,595.53 53,145.22 99.8
(ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశం/రాష్ట్రంలో ఉత్పత్తి అయిన సరుకులు, సేవల మొత్తం విలువను స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ/జీఎస్డీపీ) అంటారు. సదరు దేశ/రాష్ట్ర ఆర్థికవ్యవస్థ పరిస్థితి ఏమిటన్నది దీనితో అంచనా వేయవచ్చు)
రాష్ట్రంపై అప్పులు, వడ్డీల భారం..
ఏటేటా రాష్ట్ర అప్పులు పెరిగిపోతున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2015 మార్చి నాటికి రూ.72,658 కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పులు.. 2021 మార్చి నాటికి రూ.2,52,325 కోట్లకు చేరాయి. అంటే ఆరేళ్లలో మూడింతల అప్పులు పెరిగిపోయినట్టు రిజర్వుబ్యాంకు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రుణాలపై వార్షిక వడ్డీల చెల్లింపులు సైతం రూ.5,227 కోట్ల నుంచి రూ.14,615 కోట్లకు పెరిగాయి. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతోపాటు రైతుబంధు, పంట రుణాల మాఫీ, ఆసరా పెన్షన్లు, ఇతర సం క్షేమ పథకాల కోసం రాష్ట్రం భారీగా అప్పులు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
ఆర్‌బీఐ నివేదికలోని ఇతర ముఖ్యాంశాలివీ
- పప్పుధాన్యాల ఉత్పత్తిలో వృద్ధి దేశ సగటు 34.2 శాతంకాగా.. రాష్ట్రం 108.8 శాతం వృద్ధిని సాధించింది.
- వరి ఉత్పత్తిలో దేశవ్యాప్తంగా సగటున 12.7 శాతం, రాష్ట్రం 67.3 శాతం వృద్ధి నమోదైంది.
- పత్తిసాగులో దేశవ్యాప్తంగా సగటున 3.6 శాతం, రాష్ట్రం 79.8 శాతం వృద్ధి సాధించాయి.
- మాంసం ఉత్పత్తిలో దేశ సగటు వృద్ధి 28.5 శాతంకాగా.. రాష్ట్రం 67.9 శాతం వృద్ధి నమోదు చేసింది.
- సాగునీటి సౌకర్యాలలో రాష్ట్రం 34.2 శాతం వృద్ధి సాధించగా.. దేశవ్యాప్తంగా సగటు వృద్ధి –11.1గా ఉంది.
- మొత్తంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం సగటున 2.2 శాతం, రాష్ట్రం 22.2% వృద్ధిని నమోదు చేశాయి.
జీఎస్డీపీ విలువ (రూ.కోట్లలో)
2013–14లో 4,51,580.40
2020–21లో 9,80,407.01
రాష్ట్ర అప్పులు.. (రూ.కోట్లలో)
2015లో 72,658
2021 నాటికి 2,52,325
రాష్ట్ర సొంత ఆదాయం తీరు (రూ. కోట్లలో)
పన్నుల ఆదాయం
2014–15లో 29,288
2020–21లో 85,300
రాష్ట్ర ప్రగతికి ఆర్బీఐ నివేదికే సాక్ష్యం
రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంతోసహా అన్ని రంగాల్లో గణనీయ ప్రగతి సాధించిందని ఆర్బీఐ తాజా నివేదిక స్పష్టం చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలని, ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని వారిని కోరారు.
చౌకబారు విమర్శలు, ప్రగల్భాలు మానుకోవాలని హితవు పలికారు. ఆర్బీఐ నివేదికపై గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ, దేశ సగటు కన్నా రాష్ట్రం చాలా రంగాల్లో మెరుగైన ప్రగతి సాధించిందని నివేదిక తేటతెల్లం చేసిందన్నారు. మాంసం, వరి, పప్పు దినుసుల ఉత్పత్తిలో రాష్ట్ర వృద్ధిరేటు దేశ సగటును మించిపోయిందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అనేక రంగాల్లో దూసుకుపోతోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment