ముంబై: ఆర్థికాభివృద్ధి అంశంలో వినియోగదారుని విశ్వాసం, మనోభావాలే కీలక పాత్ర పోషిస్తాయని ఫిక్కీ ప్రెసిడెంట్, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ అంశాల్లో బలహీనత నెలకొందని ఆమె అన్నారు. వినియోగ విశ్వాసం పటిష్టతే ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. ఈ దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ జరిగిన ఒక గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ సందర్భంగా జరిగిన చర్చ గోష్టిలో ఆర్థిక అనిశ్చిత పరిస్థితిపై ఆమె మాట్లాడారు. ఆమె ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
► కరోనా మహమ్మారి ప్రేరిత అంశాలతో దాదాపు 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. పూర్తి అనిశ్చితి, భయాందోళనకర పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక పురోగతికి ప్రభుత్వం నుంచి మరింత వ్యయాలు అవసరం.
► కరోనా ముందటి పరిస్థితితో పోల్చితే ఉత్పత్తి ప్రస్తుతం 60 నుంచి 70 శాతం స్థాయికి చేరిందని కర్మాగారాల నుంచి వార్తలు వస్తున్నాయి. రుణ లభ్యత బాగుంది. ఎగుమతులు దారిలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డిమాండ్ పెంపు పరిస్థితులపై ఆలోచించాలి. ఎందుకంటే వినియోగదారు విశ్వాసం ఇంకా బలహీనంగానే ఉంది. వారి మనోభావాలు మెరుగుపడకుండా వృద్ధిని మళ్లీ పట్టాలపైకి ఎక్కించడం అసాధ్యం. ఇందుకుగాను ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష నగదు బదలాయింపులు మరింత జరగాలి. పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వృద్ధిలో ప్రత్యక్ష నగదు బదలాయింపు ఎంతో కీలకమవుతుంది.
► ఫిక్కీ ఇప్పటికే ప్రభుత్వానికి కన్జూమర్ వోచర్ విధానాన్ని సిఫారసు చేసింది. ప్రభుత్వం వ్యయాల కింద 30 నుంచి 50 శాతం డిస్కౌంట్‌తో కన్జూమర్ వోచర్ విధానాన్ని అమలు చేయడం వల్ల వ్యవస్థలో డిమాండ్ మెరుగుపడే అవకాశం ఉంటుంది.
► విధానాన్ని ఇకమీదట ఏ మాత్రం అనుసరించకూడదు. పూర్తి సాధారణ పరిస్థితులు నెలకొనాలి. ఏ విభాగంలోనూ ఇకపై లాక్‌డౌన్ నిబంధనలను ఏ మాత్రం అమలు చేయకూడదు.
► వేదాంతా గ్రూప్ సీఈఓ సునీల్ దుగ్గల్, టాటా మోటార్స్ సీఈఓ బషెక్, యాక్సెంచర్ సీఈఓ పీయూష్ సింగ్ తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు. వారి అభిప్రాయాలను చూస్తే...
ద్రవ్యోల్బణంపై ఆందోళన అక్కర్లేదు
వృద్ధిని తిరిగి పట్టాలు ఎక్కించే విషయానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ద్రవ్యోల్బణంపై ఆందోళన చెందనక్కర్లేదు. ఎకానమీలోకి మరింత నగదు లభ్యత జరిగేలా చూడ్డం ఇప్పడు ముఖ్యం. ముఖ్యంగా మౌలిక రంగంలో వ్యయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనితోపాటు కార్మిక సంస్కరణల విషయంలో కూడా ప్రభుత్వం ముందడుగు వేయాలి. పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి.
– సునీల్ దుగ్గల్, సీఈఓ, వేదాంతా గ్రూప్
డిమాండ్ పటిష్టతకు మరో 9 నెలలు
ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ విభాగంలో డిమాండ్ ఊరటకలిగించే స్థాయిలో మెరుగుపడింది. అయితే అన్ని విభా గాల్లో డిమాండ్ పూర్తి పునరుత్తేజానికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుంది.
– పీయూష్ సింగ్, సీనియన్ ఎండీ, యాక్సెంచర్
ఆటో... పన్ను రాయితీలు కావాలి
కరోనా ప్రేరిత అంశాలతో ఆటో పరిశ్రమ దారుణంగా దెబ్బతింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రంగం 2010–11 స్థాయికి క్షీణిస్తుందన్నది అంచనా. పన్ను రాయితీలు ఈ రంగానికి తక్షణ అవసరం.
– బషెక్, ఎండీ, సీఈఓ, టాటా మోటార్స్
Comments
Please login to add a commentAdd a comment