
9% వరకూ వృద్ధి అవసరం: జైట్లీ
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుతం కన్నా ఒకటి నుంచి ఒకటిన్నర శాతం (1 శాతం-1.5 శాతం) వరకూ అదనపు ఆర్థికాభివృద్ధి రేటును సాధించాల్సి ఉందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం పేర్కొన్నారు. వేతనాల పెంపు భారాన్ని మోయడానికి, కార్మికులు-పేద వర్గాల ప్రయోజనాలు నెరవేర్చడం వంటి అవసరాలకు వృద్ధి రేటు పెరుగుదల అవసరమని పేర్కొన్నారు. భారతీయ మజ్దూర్ సంఘం (బీఎంఎస్) నిర్వహించిన ఒక సన్మాన కార్యక్రమంలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడారు. ‘‘ప్రస్తుతం మనం 7.5 శాతం మేర ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నాం.
అంతర్జాతీయ ఆర్థిక మందగమన పరిస్థితుల్లోనూ వేగవంతమైన వృద్ధి రేటు సాధిస్తున్న దేశంగా అవతరించాం. అయతే మన అవసరాలకు ఈ వృద్ధి రేటు సరిపోదు. ఈ రేటు అదనంగా మరో 1.5 శాతం వరకూ పెరగాలి’’ అన్నారు. వేతనాల పెంపునకు సంబంధించి ట్రేడ్ యూనియన్లతో ప్రభుత్వం సిద్ధమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆర్థికాభివృద్ధి ప్రయోజనాలు మొదటి కార్మికులకు, పేదలకు అందాలన్నదే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని వివరించారు.
కార్మికుల వేతనాలు కనీస స్థాయిలో, ద్రవ్యోల్బణాన్ని తట్టుకోగలిగేలా ఉండడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. లెఫ్ట్ పార్టీల సిద్ధాంతం దేశ వ్యాప్తంగా ఆమోదనీయం కాని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా అంతర్జాతీయ అంశాలు, ప్రైవేటు పెట్టుబడులు వచ్చే ఏడాది భారత్ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా మారో కార్యక్రమంలో జైట్లీ అన్నారు.