
జీహెచ్‌ఎంసీ తీరు ఆదర్శనీయం
ప్రధాని మోదీ ప్రశంస
సాక్షి,సిటీబ్యూరో: గత దశాబ్ద కాలంగా ఆస్తిపన్నును పెంచకుండానే... ఆదాయ మార్గాలను గణనీయంగా పెంచడం ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ను దేశంలోని అన్ని పట్టణాలు ఆదర్శంగా తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో గురువారం జరిగిన స్మార్ట్‌సిటీ, అమృత్ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. దేశంలోని దాదాపు 500 నగరాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, కేంద్ర మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్‌ఎంసీ సాధించిన ప్రగతి, అందుకు అనుసరించిన విధానాలను కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
దీనిపై ప్రధాని స్పందిస్తూ 2004-05 ఆర్థిక సంవత్సరంలో రూ.166 కోట్లుగా ఉన్న ఆస్తిపన్ను 2014-15లో రూ.1115 కోట్లకు పెరగడం ఎంతో గొప్ప విషయమని ప్రధాని ప్రశంసించారు. జీహెచ్‌ఎంసీ సాధించిన ఈ ప్రగతి మిగతా నగరాల్లో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయన్నారు. అంతకుముందు వివిధ కార్పొరేషన్లు సాధించిన ప్రగతిని తెలియజేసే ప్రదర్శనను ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తిలకించారు.
మెరుగైన ప్రజా సదుపాయాలతో పాటు జీహెచ్‌ఎంసీ సాధించిన ఆర్థిక ప్రగతిని తెలియజేసే పోస్టర్‌ను కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రదర్శించి ప్రధానికి, వెంకయ్య నాయుడికి వివరించారు. జీహెచ్‌ఎంసీ చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు రూ.5కే భోజనం, డ్రైవర్ కమ్ ఓనర్, పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లతో పాటు సమగ్ర రహదారుల అభివృద్ధి పథకం(ఎస్‌ఆర్‌డీపీ), తదితరమైన వాటి గురించి సోమేశ్ కుమర్ తన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించారు.