సాక్షి, సంగారెడ్డి : ‘మహిళల శక్తి ఏమిటో చూశాం. కృషితో ఆర్థిక శక్తిగా ఎదగడమే కాకుండా.. ధైర్య సాహసాలు, ఆత్మ విశ్వాసంతో సామాజిక రుగ్మతలపై కలిసికట్టుగా పోరాడి విజయాలు సాధించారు. మిమ్మల్ని కలుసుకున్నందుకు గర్వపడుతున్నాను..’ అని 14వ ఆర్థిక సంఘం సభ్యురాలు ఎంఎస్ సుష్మానాథ్ సదాశివపేట మండలం వెల్టూర్ గ్రామంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్థిక సంఘం సభ్యులు అభిజిత్ సేన్, ఎంఎస్ సుష్మానాథ్, డాక్టర్ సుదిప్తో ముండ్లే, అజయ్ నారాయణ్ ఝా, గోవింద్ రావుల బృందం ఆర్థిక విధానాలపై క్షేత్ర స్థాయి అధ్యయనంలో భాగంగా శుక్రవారం సాయంత్రం జిల్లాలో పర్యటించింది. ఆర్థిక సంఘం చైర్మన్, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి ఈ పర్యటనను నేతృత్వం వహించాల్సి ఉండగా.. ఆయన పాల్గొనలేదు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి వీ సునీతారెడ్డి, ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి రేమండ్ పీటర్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ప్రేం చంద్రారెడ్డి, ఆ శాఖ కమిషనర్ శశిభూషణ్ కుమార్, కలెక్టర్ ఏ దినకర్ బాబు, జేసీ శరత్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ మహిళలతో ఆర్థిక సంఘ సభ్యులు సమావేశమయ్యారు. గ్రామంలో ఏవైనా సమస్యలుంటే తెలపాలని సభ్యులు కోరారు. ‘గ్రామంలో మద్య నిషేధం, పేకాట నిర్మూలన సాధించే వరకు పొదుపు ఆపేసి పోరాడాలని గ్రామైక్య సంఘం సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించాం. అందరం ఇళ్లల్లో గాలించి మద్యం సీసాలను బయటకు తెచ్చి వీధుల్లో పగలగొట్టాం. ఊళ్లో ఆడ వాళ్లు అందరూ మూకుమ్మడిగా వంటలు చేయడం మానేసి మూడు రోజుల పాటు పంచాయతీ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేశాం.అమ్మినోళ్లకు రూ.5 వేలు, తాగినోళ్లకు రూ.500 జరిమానాతో పాటు మద్యం గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.500 ప్రోత్సాహక బహుమతి ఇవ్వాలని తీర్మానించేలా చేశాం. ఇలా ఊళ్లో మద్య నిషేధాన్ని సాధించుకున్నాం. గ్రామంలో ఎక్కడైనా పేకాట ఆడుతుంటే సమాచారమిస్తాం.. వచ్చి పట్టుకెళ్లాలని పోలీసులకు చెప్పితే వారు సానుకూలంగా స్పందించారు. ఓ సారి పేకాట జరుగుతుంటే ఫోన్ చేయగా పోలీసోళ్లు వచ్చి 5 మందిని పట్టుకెళ్లి మరుసటి రోజు వదిలేశారు. పోలీసులు ఏం చేశారో ఏమో మళ్లీ ఇప్పుడు గ్రామంలో ఎవ్వరూ పేకాట ఆడడం లేదు’ అని గ్రామ జెండర్ కమిటీ సభ్యురాలు రుక్కమ్మ సమాధానమిచ్చారు. ఇప్పుడు గ్రామంలో మహిళలు సమస్యల నుంచి విముక్తి పొందారని ఆమె స్పష్టం చేయడంతో ఆర్థిక సంఘం బృందం గ్రామ మహిళలపై ప్రశంసల వర్షం కురిపించింది.
గ్రామంలో 47 ఎస్‌హెచ్‌జీలు, 582 మంది మహిళలు అందులో సభ్యులుగా ఉన్నారని వెలుగు గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు మల్లేశ్వరి తెలిపారు. రూ.1.48 కోట్ల బ్యాంకు రుణాలు తీసుకున్నామని, 28 సంఘాలు రూ.4.25 లక్షల వడ్డీ మాఫీ పొందాయని తెలిపారు. ఈ డబ్బుతో ఏం చేస్తున్నారని ఆర్థిక సంఘం సభ్యులు ప్రశ్నించగా.. వ్యవసాయం, మేకల పెంపకం, కౌలు వ్యవసాయం, కిరాణ దుకాణాలు ఏర్పాటు చేసి ఉపాధి పొందుతున్నట్లు ఆమె వివరించారు. గ్రామ సర్పంచ్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తమ గ్రామాభివృద్ధికి సహకరించాలని అధికారులను కోరారు. కార్యక్రమం చివర్లో ఆర్థిక సంఘం సభ్యుల చేతుల మీదుగా తలారి సునంద అనే మహిళకు బంగారు తల్లి పథకం కింద తొలి బాండును అందజేశారు. అనంతరం కొండాపూర్ మండలం గిర్మాపూర్‌లోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించినప్పుడు విద్యార్థులు తమ ప్రశ్నలతో ఆర్థిక సంఘం సభ్యులను ఆకట్టుకున్నారు. మీరు మాకు ఏదో ఇవ్వాలని పాఠశాలకు వచ్చారు.. రేపు మేమూ మీలా ఇతరులకు ఇచ్చే స్థితిలో ఉంటామన్న మరో విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించడంతో చప్పట్లతో అభినందించారు. అంతకు ముందు నార్సింగిలోని గురుకుల పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థినిలు దివ్య, మాధవిలు తమ పాఠశాలల్లో బోధనా పద్ధతులు, అధ్యాపకుల సేవల గురించి అధికారులకు వివరించారు. పర్యటన ముగిసిన అనంతరం హైదరాబాద్‌కు పయనమయ్యారు.
రూపాయి ఎందుకు పతనమవుతోంది?
రూపాయి విలువ ఎందుకు పతనమవుతోంది? అని ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం విద్యార్థి రాజు 14వ ఆర్థిక సంఘం సభ్యులకు ప్రశ్నించారు. ‘ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రూపాయికి స్థిరత్వం వస్తుంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.’ అని ఆర్థిక సంఘం సభ్యులు ప్రొఫెసర్ అభిజిత్ సేన్ సమాధానమిచ్చారు.
మహిళల ఆర్థికాభివృద్ధి భేష్
Published Sat, Sep 14 2013 12:23 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
Advertisement
Advertisement