వేడుకల్లో ప్రసంగిస్తున్న గవర్నర్ నరసింహన్
సాక్షి, అమరావతి: దేశ ఆర్థికాభివృద్ధి 7.3 శాతం కాగా ఏపీ ఆర్థికాభివృద్ధి 10.52 శాతంగా ఉందని ఏపీ, తెలంగాణ ఉమ్మడి గవర్నర్ నరసింహన్ చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం జరిగిన గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దుతున్నామన్నారు. ఈబీసి కోటా కింద ప్రవేశ పెట్టిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయిస్తున్నామన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రూ. లక్షా 9 వేల కోట్లు ఖర్చు అవుతుందని, మొదటి విడతగా రూ. 51,687 కోట్లు కేటాయించామన్నారు. అందులో భాగంగా రూ. 41,297 కోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. నాలుగేళ్లలో రైతులకు రూ. 24 వేల కోట్ల మేర రుణమాఫీ చేశామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ హౌసింగ్ కింద 10,15,663 ఇళ్లు నిర్మించినట్టు వివరించారు. ఇప్పటికే కృష్ణా–గోదావరి అనుసంధానం చేశామని, గోదావరి పెన్నా నదుల అనుసంధానం చేపట్టామన్నారు. రూ.20 వేల కోట్లతో అమరావతి–అనంతపురం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం చేపట్టబోతున్నట్టు చెప్పారు. విమానాల ఇంధనంపై టాక్స్‌ను 16 శాతం నుంచి 1 శాతానికి తగ్గించినట్టు తెలిపారు. ఈ ఏడాది గన్నవరం నుంచి సింగపూర్‌కి అంతర్జాతీయ విమాన స్వర్వీసులు ప్రారంభించినట్టు చెప్పారు. చంద్రన్న బాట కింద గ్రామీణ ప్రాంతాల్లో 23,550 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించామన్నారు. వ్యవసాయ రంగానికి 9 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. విద్యా రంగానికి పెద్ద పీట వేశామని, మన ఊరు, మన బడి, బడి పిలుస్తుంది కార్యక్రమాల ద్వారా విద్య ప్రాముఖ్యత తెలియజేశామన్నారు. నాలుగున్నరేళ్లలో వివిధ రంగాలలో జాతీయ అంతర్జాతీయ సంస్థల నుంచి 660 అవార్డ్స్ సాధించినట్టు చెప్పారు. శాంతిభద్రతల నిర్వహణలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించటం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నట్టు గవర్నర్ చెప్పారు.
జాతీయ పతాకం ఎగురవేసిన గవర్నర్..
గణతంత్ర వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని గవర్నర్ నరసింహన్ ఎగురవేశారు. తొలుత సభా ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్ నరసింహన్, విమలా నరసింహన్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంపై గవర్నర్ పెరేడ్‌ను తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. సీఎస్ పునేఠ, డీజీపీ ఠాకూర్ పెరేడ్‌లో గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, అధికారులు పాల్గొన్నారు.
కవాతులో ఇండియన్ ఆర్మీ ఫస్ట్...
గణతంత్ర వేడుకల్లో నిర్వహించిన కవాతు(పెరేడ్) అందర్నీ ఆకట్టుకుంది. ఆర్ముడ్ విభాగంలో ఇండియన్ ఆర్మీ, ఏపీఎస్‌పీ ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించాయి. అన్ ఆర్ముడ్ విభాగంలో ఎన్‌సీసీ బాలురు, బాలికలు ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించారు. ఒడిశా కంటిజెంట్‌కు ప్రత్యేక బహుమతిని అందించారు. ఇండియన్ ఆర్మీ కటింజెంట్ ముత్తు పాండ్యన్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ అమిత్ కుమార్, ఒడిశా స్టేట్ పోలీస్ అశోక్ కుమార్ బ్రహ్మ, ఏపీఎస్‌పీ 2వ బెటాలియన్ డి.మధుసూదనరావు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కృష్ణ ధర్మరాజు, ఎన్‌సీసీ బాలుర కటింజెంట్ కె.సురేంధర్, ఎన్‌సీసీ బాలికల కటింజెంట్ పి.భాగ్యశ్రీ, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్(బాయ్స్, గరల్స్) కటింజెంట్ సీహెచ్ కృష్ణవేణి, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ (బాయ్స్, గరల్స్) కటింజెంట్ గంగుల చందు, యూత్ రెడ్ క్రాస్ బాయ్స్ కటింజెంట్ వై మురళీకృష్ణ ఆధ్వర్యంలో గవర్నర్‌కు గౌరవవందనం అందజేశారు. అనంతరం పైప్ /బ్రాస్ బ్యాండ్ విభాగాలు గౌరవ వందనాన్ని అందజేశారు.
సమాచార శాఖ శకటం ఫస్ట్..
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రంగాలలో జరుగుతున్న కార్యక్రమాలపై రూపొందించిన శకటాలు ప్రదర్శించాయి. సమాచార పౌరసంబంధాల శాఖ, అటవీశాఖ, పర్యాటక శాఖల శకటాలు మొదటి, రెండు, మూడు బహుమతులు గెలుచుకున్నాయి. వ్యవసాయ, సీఆర్డీఏ, విద్యాశాఖ, అటవీశాఖ, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ, గృహనిర్మాణ శాఖ, ఉద్యాన శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పర్యాటక శాఖ, జలవనరుల శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, పరిశ్రమలు, వాణిజ్య శాఖలు ప్రత్యేకంగా అలంకరించిన శకటాలు ప్రదర్శించాయి.
ఉండవల్లిలో జాతీయజెండా ఎగురవేసిన సీఎం (బాక్స్)
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేసి, జెండాకు గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ఏవి రాజమౌళి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ వెంకటేశ్వర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment