అడుగులేని అగాథంలోకి జారిపోతున్నట్టున్న రూపాయి విలువ శుక్రవారం డాలర్‌కు రూ.62 రికార్డును అధిగమించి 4 శాతం విలువను కోల్పోయింది. మరోవంక బీఎస్‌ఈ సెన్సెక్స్ నాలుగేళ్ల గరిష్ఠస్థాయిలో 699 పాయింట్ల మేరకు పతనమైంది. ఈ పరిణామాలు భారత షేర్, విదేశీ మారక ద్రవ్య (ఫోరెక్స్) మార్కెట్లలో ఉత్పాతాన్ని సృష్టించాయి. అమెరికా ఆర్థిక వృద్ధి గణాంకాలకు మన మార్కెట్లు ఇంతగా స్పందించాల్సింది కాదని ఆర్థికమంత్రి పి. చిదంబరం అంటున్నారు. ఆయన చిత్తానుసారం గాక స్టాక్, ఫోరెక్స్ మార్కెట్లు వాటి సొంత నియమాల ప్రకారమే గత మూడు నెలలుగా స్పందిస్తున్నాయి. అమెరికా ఆర్థికవృద్ధి అంచనాలకు మించి పుంజుకుంటోందని, వడ్డీరేట్లు పెరిగే అవకాశాలున్నాయని బుధవారం అంచనాలు వెలువడ్డాయి. అమెరికా ఆర్థికవ్యవస్థ సంక్షోభంలో పడటంవల్ల ఏర్పడ్డ మాంద్య పరిస్థితుల దుష్ఫలితాలను అనుభవిస్తున్న ప్రపంచానికి, ప్రత్యేకించి మనలాంటి వర్థమాన దేశాలకు ఇది శుభవార్త కావాలి. కానీ అది మన మార్కెట్లలో ఉత్పాతాన్ని సృష్టించడం విచిత్రంగా అనిపిస్తుంది. ఆ విచిత్రమే సామాన్యులకు అంతుపట్టని మాయాజాలంగా మారిన మన ఆర్థిక వృద్ధి పొడుపు కథను విప్పి చె ప్పగలుగుతుంది. అమెరికా వృద్ధి తాజా గణాంకాలేవీ వెలువడక ముందే జూన్ 19న అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) చైర్మన్ బెన్ బెర్నాకె ఒక్క ప్రకటనతో మన మార్కెట్లను మండించేశారు. అమెరికా వృద్ధి ఆశావహంగా ఉన్నందున ఆర్థికవ్యవస్థలో ద్రవ్యత్వాన్ని పెంచడానికి ఫెడ్, బాండ్ల కొనుగోళ్ల రూపంలో ఇస్తున్న సహాయక ప్యాకేజీలను భవిష్యత్తులో దఫదఫాలుగా తగ్గించే అవకాశం ఉందని మాత్రమే ఆయన అన్నారు. అప్పుడు అథోగతికి దిగజారడం ప్రారంభించిన మన రూపాయి మళ్లీ తల పెకైత్తి చూసింది లేదు. 2004-2008 మధ్య 9 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేసిన ఘన చరిత్రను పునరావృతం చేయడానికేనంటూ చిదంబరం రెండు దఫాలుగా ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు తలుపులను తెరిచే ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. అలా దేశంలోకి ప్రవహించిన పెట్టుబడులు ఇలా పలాయనం చిత్తగిస్తే వృద్ధి రథం పరిగెత్తేదెలా?
మూడు నెలలుగా రూపాయి దానికదే తగు స్థాయిలో స్థిరత్వాన్ని సాధిస్తుందని చిదంబరంతోపాటూ పలువురు ఆర్థిక నిపుణులు చెబుతూ వస్తున్నారు. రూపాయి పతనం కంటే వేగంగా ఆహార ద్రవ్యోల్బణం పెరిగి దాదాపు 12 శాతం కావడంతో ఆర్థిక నిపుణులు కాని కూలీనాలీ, వేతన జీవులు, రైతులు, గృహిణులు గగ్గోలు పెడుతున్నారు. రానున్న ఎన్నికల్లో నేతల తలరాతలను రాసేది ఇలాంటి ఓటర్లే. కాబట్టే రిజర్వ్ బ్యాంకు రూపాయి పతనాన్ని నిలువరించడానికి తగు చర్యలు తీసుకుంటుందని చిదంబరం ప్రకటనలు చేశారు. గురువారం రిజర్వ్ బ్యాంక్ దేశం నుంచి స్వల్పకాలిక పెట్టుబడులను ఇష్టానుసారంగా ఉపసంహరించుకోవడంపై కొన్ని ఆంక్షలను విధించింది. శుక్రవారమే స్టాక్ మార్కెట్లలో కల్లోలం ప్రారంభమైంది. ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే బ్యాంకు వడ్డీ రేట్ల పెంపుదలకు తిరస్కరిస్తున్న ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు విధించిన ఆంక్షలే మదుపర్లలో బీభత్సాన్ని సృష్టించాయంటూ పలువురు ఆర్థిక నిపుణులు ఆయనపై విరుచుకుపడుతున్నారు.పెట్టుబడులు ఎప్పుడుబడితే అప్పుడు రెక్కలుగట్టుకొని ఎగిరిపోయే పరిస్థితులు ఉండటం, రూపాయి విలువ డాలర్‌కు 65గా స్థిరపడటం ఆర్థికవృద్ధికి అవసర మని విధాన కర్తల భావన.
మన కరెంటు అకౌంటు లోటు గత ఏడాది స్థూల జాతీయోత్పత్తిలో 4.8 శాతంగా ఉంది. మన విదేశీ మారకద్రవ్య నిల్వలు 28,000 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఈ ఏడాది 17,235 కోట్ల డాలర్ల రుణ చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 1991లో మన బంగారాన్ని తాకట్టుపెట్టుకొని, రూపాయి విలువను తగ్గించుకొని దిగుమతుల కోసం దినదినగండంగా బతకాల్సిన రోజులు పునరావృతం కానున్నాయనే భయాలు వ్యాపిస్తున్నాయి. ఆరునెలల దిగుమతులకు సరిపడా విదేశీ నిల్వలు ఉన్నాయంటూ ప్రధాని అలాంటి భయాలు అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. కానీ, 1991లో మొదలైన మన ఆర్థిక సంస్కరణల చరిత్ర మూడు దశాబ్దాల తర్వాత తిరిగి అక్కడికే చేరబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వాల్‌మార్ట్, మెకీస్ వంటి బడా రిటైల్ వర్తక సంస్థల అమ్మకాలు క్షీణిస్తుండటం అమెరికా వృద్ధి కథనాన్ని సందేహాస్పదం చేస్తోంది. వాల్‌మార్ట్ తన అమ్మకాలు 0.3 శాతం పడిపోవడానికి అల్పాదాయ వర్గాలపై పన్నుల భారం, అల్పవేతనాల వల్ల కొనుగోలుశక్తి పెరగకపోవడమేనని, వారు తమ అవసరాలకు మించి వినియోగం చేయలేకపోవడమే కారణమని వాపోతోంది. వాల్‌మార్ట్ మన విధానకర్తలు చెప్పని నిజాన్ని చెబుతోంది. అల్పాదాయ వర్గాల ఆదాయాలు, కొనుగోలుశక్తి పెరగనిదే వృద్ధి అసంభవమని స్పష్టం చేస్తోంది. వృద్ధిలో మనకు ప్రత్యర్థిగా భావిస్తున్న చైనా తిరిగి అధిక వృద్ధి రేట్లను సాధించ డానికి ప్రజల జీవన ప్రమాణాలను, దేశీయ వినియోగాన్ని పెంచడంపై దృష్టిని కేంద్రీకరించింది. ఉద్యోగితను పెంచే మౌలిక సదుపాయాల నిర్మాణం, భారీ నీటిప్రాజెక్టులు, వెనుకబడిన ప్రాంతాల పారిశ్రామికీకరణ పెద్ద ఎత్తున చేపడుతోంది. ఆ దిశగా దృష్టినైనా సారించలేని మన విధానకర్తల నిర్వాకం ఫలితంగా గత ఏడాది మన పారిశ్రామిక వృద్ధి రెండు దశాబ్దాలలో అతి తక్కువగా ఒక్క శాతంగా నమోదైంది. పైగా మరింతగా ప్రజల కొనుగోలుశక్తిని తగ్గించేలా సబ్సిడీల, సంక్షేమ వ్యయాల కోతలను అమలుచేస్తోంది. గత 22 ఏళ్ల ఆర్థిక సంస్కరణల అనంతరం విదేశీ ద్రవ్యసంస్థలు స్వల్పకాలిక చంచల పెట్టుబడులతో మన రూపాయితోనూ, స్టాక్ మార్కెట్లతోనూ జూదమాడగలుగుతున్నాయి. మన ఆర్థిక వ్యవస్థను ఒక జూదగృహంగా మారుస్తున్నాయి. కాబట్టే ఈ అర్థసంవత్సరంలో అమెరికా వృద్ధి 1.4 శాతమే అయినా, యూరోపియన్ వృద్ధి 0.3 శాతమే అయినా... అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు మన రూపాయి, స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. ఆర్థిక వృద్ధి చరిత్రకు ఉన్న ఈ చీకటి కోణాన్ని గుర్తించేదెన్నడు?
ఆర్థికవృద్ధి చీకటికోణం!
Published Sun, Aug 18 2013 2:30 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement