కోబేలో జరిగిన కార్యక్రమంలో భారతీయులకు అభివాదం చేస్తున్న మోదీ
ఒసాకా/కోబే: భారత ఆర్థికాభివృద్ధిలో జపాన్ కీలకమైన పాత్ర పోషించిందని ప్రధాని మోదీ తెలిపారు. సంయుక్త భాగస్వామ్యంలో కార్లు(మారుతీ సుజుకీ) తయారుచేయడం దగ్గర్నుంచి బుల్లెట్ రైళ్ల వరకూ ఇరుదేశాల మధ్య సంబంధాలు కాలంతోపాటు దృఢమయ్యాయని వ్యాఖ్యానించారు. నేటి నుంచి రెండ్రోజుల పాటు సాగే జీ20 సదస్సు కోసం మోదీ జపాన్‌లోని ఒసాకాకు చేరుకున్నారు. అనంతరం జపాన్ ప్రధాని షింబో అబేతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ పటిష్టత కోసం, అవినీతిని నిర్మూలించడానికి రుణఎగవేతదారులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరముందని ఇరువురు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వాణిజ్యం, డేటా ఫ్లో నియంత్రణ విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని మోదీ–అబేలు నిర్ణయించారు. వాతావరణ మార్పులపై ఈ జీ20 సదస్సులోనే ఓ నిర్మాణాత్మక అంగీకారానికి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భారత్‌లో జపాన్ నిర్మిస్తున్న హైస్పీడ్ రైల్ కారిడార్(ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు)పై ఇరువురు కొద్దిసేపు చర్చించుకున్నారు. జీ20 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్‌తో మోదీ ప్రత్యేకంగా సమావేశంకానున్నారు.
ఇరుదేశాల సంస్కృతిలో అంతర్భాగం..
ప్రపంచదేశాలతో భారత్ సంబంధాల విషయానికి వస్తే జపాన్‌కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. సామరస్యం, పరస్పరం గౌరవించుకోవడం అన్నది ఇరుదేశాల సంస్కృతిలో అంతర్భాగంగా ఉందని వ్యాఖ్యానించారు. జపాన్ పర్యటనలో భాగంగా కోబే నగరంలో గురువారం భారత సంతతి ప్రజలతో మోదీ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన మోదీకి భారత సంతతి ప్రజలు కరతాళధ్వనులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘రాబోయే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావడంలో జపాన్ పాత్ర ఎంతో ఉంది. ఈరోజు ఇండియాలో ప్రతీచోట జపాన్ ప్రాజెక్టులు, పెట్టుబడులు ఉన్నాయి. అదే సమయంలో భారత మానవ వనరులు, నైపుణ్యంతో జపాన్ లబ్ధిపొందుతోంది’ అని అన్నారు.
‘విపత్తు’ సాయం కోరుతున్నా..
విపత్తు నిర్వహణ, పునరావాసం, పునర్‌నిర్మాణం విషయంలో జపాన్ సహకారాన్ని తాము కోరుతున్నట్లు చెప్పారు. కాగా, ఈ ఏడాది భారత్‌లో జరిగే ఇండియా–జపాన్ వార్షిక సదస్సుకు అబే రాకకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు. కాగా, ఈ భేటీకి ముందు ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
3 కోతుల కథ చెప్పిన మోదీ
భారత్–జపాన్‌ల మధ్య ఎంత బలమైన సంబంధాలు ఉన్నాయో తెలిపేందుకు కళ్లు, చెవులు, నోరు మూసుకున్న మూడు కోతులను మోదీ ప్రస్తావించారు. ‘చెడు చూడవద్దు.. చెడు వినవద్దు.. చెడు మాట్లాడవద్దు అని బాపూ(మహాత్మా గాంధీ) చెప్పడాన్ని మనమందరం వినుంటాం. ఇందుకు కళ్లు, చెవులు, నోరు మూసుకున్న కోతులను ప్రతీకగా చూపుతారు. కానీ ఇందుకు మూలం 17వ శతాబ్దపు జపాన్‌లో ఉంది. మిజారు అనే కోతి చెడు చూడదు. కికజారు అనే కోతి చెడు వినదు. ఇవజారు అనే కోతి చెడు మాట్లాడదు’ అని మోదీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment