పిడికిలి బిగించి మీడియాతో సరదాగా మాట్లాడుతున్న ట్రంప్, షింజో అబే, మోదీ
ఒసాకా: అమెరికాలో ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలపర్చుకునేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. జపాన్‌లోని ఒసాకాలో జీ20 సదస్సు సందర్భంగా శుక్రవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఇరాన్–అమెరికా వివాదం, భారత్‌లో 5జీ సాంకేతికతను ప్రవేశపెట్టడం సహా పలు అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారు. ఈ సమావేశం అనంతరం ప్రధాని మోదీ స్పందిస్తూ..‘ట్రంప్‌తో పలు అంశాలపై చర్చించా. టెక్నాలజీ, రక్షణ, భద్రత రంగాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేసుకోవాలని ఈ భేటీలో నిర్ణయించాం’ అని తెలిపారు.
కలసి ముందుకెళతాం: ట్రంప్
‘ప్రధాని మోదీ, నేను చాలామంచి స్నేహితులయ్యాం. భారత్–అమెరికాల మధ్య ఇప్పుడున్నంత సత్సంబంధాలు చరిత్రలో ఎన్నడూ లేవు. మిలటరీ సహా పలు రంగాల్లో కలిసి ముందుకెళ్లాలని మేం నిర్ణయించాం. ఈరోజు మాత్రం వాణిజ్యంపై చర్చించాం’ అని ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ నుంచి చమురు దిగుమతుల్ని ఆపేశామని మోదీ ట్రంప్ దృష్టికి తీసుకొచ్చారు. హోర్ముజ్ జలసంధిలో భారత చమురు ట్యాంకర్లపై దాడులు జరగకుండా యుద్ధనౌకలను మోహరించామని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరల్లో స్థిరత్వాన్ని, గల్ఫ్ ప్రాంతంలో పనిచేన్తున్న భారత సంతతి ప్రజల రక్షణను తాము కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. దీంతో చమురు ధరలు స్థిరంగా ఉండేలా తామూ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ట్రంప్–అబేలతో త్రైపాక్షిక భేటీ
జీ20 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబేలతో త్రైపాక్షిక భేటీలో పాల్గొన్నారు. జపాన్–అమెరికా–ఇండియా(జయ్)గా వ్యవహరించే మూడు దేశాల భేటీలో ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం, శాంతిస్థాపన కోసం తీసుకోవాల్సిన చర్యలపై మోదీ, ట్రంప్ అబేలు చర్చించారు. మరోవైపు జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్–జే–ఇన్‌తో సమావేశమయ్యారు.‘స్నేహితుడైన మూన్–జే–ఇన్‌ను కలవడం ఎప్పుడూ ప్రత్యేకమే. దక్షిణకొరియా–భారత్‌ల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని పటిష్టపరిచేందుకు మూన్ కృషిచేస్తూనే ఉంటారు’ అని మోదీ ట్వీట్ చేశారు. ఈ పర్యటనలో భాగంగా జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కల్‌తో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సైబర్ భద్రత, కృత్రిమ మేధ(ఏఐ) రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయించారు.
సమ్మిళితవృద్ధికి ఏకాభిప్రాయం..
సమ్మిళిత, సుస్థిర ప్రపంచాభివృద్ధి కోసం అన్నిదేశాల మధ్య ఏకాభిప్రాయం అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందుకోసం ప్రపంచదేశాలన్నీ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సాంకేతిక ఫలాలు సామాన్యులకు చేరేలా తమ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుందని ఆయన వెల్లడించారు. డిజిటల్ సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చడానికి ఐదు ‘ఐ’లు అవసరమని పేర్కొన్నారు. జపాన్‌లోని ఒసాకా నగరంలో శుక్రవారం ప్రారంభమైన జీ20 దేశాల సదస్సులో మోదీ మాట్లాడుతూ..‘భారత్‌లో టెక్నాలజీ ఫలాలు సామాన్యులకు అందేలా మా ప్రభుత్వం విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంది. 120 కోట్ల మంది ప్రజలకు ఆర్థిక సేవలను చేరువ చేయడంలో భాగంగా పీఎం జన్‌ధన్ యోజన(పీఎంజేడీవై), ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ)ని తీసుకొచ్చాం. బ్యాంకింగ్ సేవలు, ఇన్సూరెన్స్ పెన్షన్లు, రుణాలు, రెమిటెన్సులు పొందడం వంటి ఆర్థిక సేవలను ప్రజలు పొందేందుకు జన్‌ధన్ యోజన ఎంతగానో ఉపకరించింది’ అని చెప్పారు. టెక్నాలజీ సాయంతో సమాజానికి గరిష్ట లబ్ధిచేకూర్చడానికి ఐదు ‘ఐ’లు అంటే.. అందర్ని కలుపుకుపోవడం(ఇన్‌క్లూజివ్‌నెస్), స్వదేశీకరణ(ఇండిజినైజేషన్), నవకల్పన(ఇన్నొవేషన్), పెట్టుబడులు–మౌలికవసతులు(ఇన్వెస్ట్‌మెంట్–ఇన్‌ఫ్రా), అంతర్జాతీయ సహకారం(ఇంటర్నేషనల్ కోఆపరేషన్) అవసరమని మోదీ తెలిపారు.
పుతిన్‌తో జోక్ వేసిన ట్రంప్
అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యంపై మీడియాప్రతినిధులు ప్రశ్నలతో ట్రంప్‌ను ఇబ్బంది పెట్టారు. దీంతో ట్రంప్ పుతిన్‌వైపు వేలు చూపిస్తూ..‘ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దు’ అని జోక్ వేశారు. దీంతో పుతిన్, మీడియా ప్రతినిధులు నవ్వుల్లో మునిగిపోయారు. పుతిన్‌తో సత్సంబంధాలున్నాయనీ, భవిష్యత్‌లో మంచి ఫలితాలొస్తాయని ట్రంప్ అన్నారు. రెండో ప్రపంచయుద్ధం ముగిసి 75 ఏళ్లయిన సందర్భంగా రష్యాలో వేడుకలకు రావాలని పుతిన్ ట్రంప్‌ను కోరారు.
‘ఎస్–400’పై చర్చించని నేతలు..
ట్రంప్–మోదీల భేటీ సందర్భంగా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ఎస్–400 క్షిపణి నిరోధక వ్యవస్థ ప్రస్తావన రాలేదని భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ తెలిపారు. ఇరుదేశాల మధ్య రక్షణ రంగ సహకారం బలోపేతం చేసుకోవడంపై చర్చ జరిగిందన్నారు. 2014లో 5 బిలియన్ డాలర్లతో ఎస్–400 వ్యవస్థ కొనుగోలుకు భారత్ రష్యాతో ఒప్పందం చేసుకుంది. ప్రజల సమాచారాన్ని(డేటా) సరికొత్త సంపదగా ఆయన అభివర్ణించారు. డేటా ఫ్లో విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను కంపెనీలు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. తమ పౌరుల సమాచారాన్ని స్థానికంగానే భద్రపరచాలని భారత్ సహా పలుదేశాలు కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జీ20 సదస్సు సందర్భంగా డేటాను స్థానికంగా భద్రపరచడాన్ని అమెరికా వ్యతిరేకిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment