నగదు కొరత, మందగిస్తున్న ఉపాధి కల్పన, పెట్రోలు, డీజిల్ సహా నిత్యావసర ధరల పెరుగుదల వల్ల దేశ ఆర్థిక పరిస్థితిపై పట్టణ ప్రాంతాల వినియోదారులకు నమ్మకం సన్నగిల్లుతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ప్రతి మూడు నెలలకు చేసే తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కిందటి డిసెంబర్ సర్వే మినహా 2017 మార్చినాటి సర్వే నుంచీ భారత నగరవాసులకు దేశ ఆర్థిక వ్యవహారలపై ఆశలు తగ్గుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సాధారణ ఆర్థిక పరిస్థితులు, ఉపాధి అవకాశాలపై వినియోగదారులు నిరాశా నిస్పృహలు వ్యక్తం చేస్తున్నారు. 2019 ఏప్రిల్మేలో జరిగే లోక్ సభ ఎన్నికలకల్లా దేశ ఆర్థికాంశాలు మెరుగవుతాయని భావిస్తున్నారుగాని, ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక మొదటి రెండేళ్లలో కనిపించిన ఆశావహ వాతావరణం వచ్చే ఏడాదిలో ఉండకపోవచ్చని అంచనా.
కేంద్రంలో ఎన్డీఏ సర్కారు తొలి రెండేళ్లూ ఆర్థిక వ్యవస్థను సాఫీగా నడిపించి మంచి పేరు తెచ్చుకున్నాక హఠాత్తుగా దానికి బ్రేకులు పడేలా రెండు అనూహ్య చర్యలు తీసుకుంది. 2016 నవంబర్లో పెద్ద నోట్లు రద్దు చేసి, వాటి స్థానంలో ఆలస్యంగా కొత్త కరెన్సీ విడుదల చేయడంతో దేశ ప్రజలు కుదేలయ్యారు. చేతుల్లో డబ్బున్నా దిగులు లేకుండా బతకలేని పరిస్థితి సృష్టించిన నోట్ బందీ వల్ల 2017లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) అంతకు ముందు ఏడాదిలో నమోదైన 8.2 శాతం నుంచి 7.1 శాతానికి పడిపోయింది. ఆరు నెలల తర్వాత 2017లో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ప్రవేశపెట్టడంతో ఆర్థిక వ్యవస్థ మరింత మందగించింది. జీఎస్టీ వల్ల సత్ఫలితాలు నెమ్మదిగా వస్తున్నాయని ఆర్థికవేత్తలు అంటున్నాగాని వినియోగదారులకు మాత్రం నమ్మకం కుదరడం లేదు.
నాలుగు అంశాల్లో ప్రతికూలం
బెంగళూరు, చెన్సై, హైదరాబాద్, కోల్ కత్తా, ముంబై, దిల్లీలో 5, 297 మంది వినియోగదారులను సాధారణ ఆర్థిక పరిస్థితి, ఉపాధి కల్పన అవకాశాలు, ధరల పరిస్థితి, వారి ఆదాయం, వ్యయంపై వారి కుటుంబాల అంచనాలపై ఆర్బీఐ ప్రతినిధులు ప్రశ్నించగా ప్రజల్లో విశ్వాసం పెరగలేదని తేలింది. ఆర్థిక స్థితి, ఉపాధి, ధరలు, ఆదాయంపై పౌరులకు సానుకూల అంచనాలు లేవు. ఈ నాలుగు విషయాల్లో పరిస్థితి దిగజారుతుందని భావిస్తున్నామని వినియోగదారులు చెప్పారు. వ్యయంపై ఆశలు సానుకూలంగా ఉన్నా గతంతో పోల్చితే అవి తక్కువే. వచ్చే ఏడాదికి ప్రజల సెంటిమెంటు బాగుందిగాని పూర్వపు స్థాయితో పోల్చితే మెరుగ్గా లేదు. సాధారణ ఆర్థిక పరిస్థితిపై దాదాపు తటస్థ స్థితిలో ఉన్న 2017 డిసెంబర్ఫలితాలతో పోల్చితే వినియోగదారుల విశ్వాసం ఈ మూడు నెలల్లో బాగా తగ్గిందని తాజా సర్వే చెబుతోంది.
మోదీ రాకతో ‘అచ్ఛే దిన్’ ఆశలు!
2012 డిసెంబర్నుంచీ విడుదల చేసిన త్రైమాసిక ఆర్బీఐ వినియోగదారుల సర్వేల వివరాలు గమనిస్తే, నరేంద్రమోదీ 2014 మేలో ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి 2017 మార్చి వరకూ ప్రజలు ఆర్థికంగా ఆశావహంగానే ఉన్నారని స్పష్టమౌతుంది. అంతకు ముందు అంటే కాంగ్రెస్నాయకత్వంలోని యూపీఏ హయాంలో నగరాల్లో వినియోగదారులు ఇలాంటి ఆశావహ దృక్పథంతో ఉన్నది 2013 జూన్ సమయంలోనే. ఆ తర్వాత నుంచి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకూ పట్టణ కుటుంబాల సెంటిమెంటు దిగజారిపోతూనే ఉందని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. మళ్లీ మోదీ అధికారంలోకి వచ్చి ఆ తరువాత రెండేళ్ల వరకూ ‘అచ్ఛే దిన్’ వచ్చాయని భావించారు. నోట్ల రద్దు, జీఎస్టీతో పరిస్థితి దిగజారిందని ఆర్బీఐ వెల్లడించింది.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment