ఆర్‌బీఐ పాలసీ కీలకం
♦ ఈ వారం మార్కెట్‌పై విశ్లేషకులు
♦ రుతుపవనాల పురోగతి, సేవల పీఎంఐ గణాంకాల ప్రభావం
న్యూఢిల్లీ: ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష, రుతుపవనాల పురోగతి, కీలక ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్ గమనాన్ని ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. శనివారం జరిగిన జీఎస్టీ సమావేశం పెండింగ్‌లో ఉన్న నిబంధనలకు ఆమోదం తెలపడం, మరికొన్ని వస్తువులపై జీఎస్టీ రేట్లను ఖరారు చేసిన నేపథ్యంలో రంగాల వారీ షేర్ల కదలికలు ఉంటాయంటున్నారు. ‘‘ఫలితాల సీజన్ దాదాపుగా ముగిసింది. ఫలితాలను బట్టి షేర్లు ఇప్పటికే స్పందించాయి. మంగళ, బుధవారాల్లో (ఈ నెల 6,7న) జరిగే ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం స్వల్పకాలంలో మార్కెట్ గమనాన్ని నిర్దేశించనుంది. అలాగే, రుతుపవనాల పురోగతి సైతం మార్కెట్‌పై ప్రభావం చూపనుంది. జీఎస్టీని ఎంత సమర్థవంతంగా అమలు చేయగలరన్న అంశాన్ని మార్కెట్ గమనించనుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమీత్‌మోది చెప్పారు.
కొనుగోళ్లు కొనసాగొచ్చు...
‘‘జీఎస్టీ అమలుతో వ్యాపారాలపై స్వల్ప కాలంలో ప్రభావం పడనుంది. ఇది మార్కెట్లో అస్థిరతకు దారితీయొచ్చు. అయినప్పటికీ జీఎస్టీతో దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా కొనుగోళ్ల ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయంగా ఏవైనా అంశాలు మారితే తప్పితే ఈ కొనుగోళ్ల వాతావరణం కొనసాగవచ్చు.
ఈ వారం మార్కెట్లు ఆర్‌బీఐ, యూరప్ సెంట్రల్ బ్యాంకు (ఈసీబీ) పాలసీ సమావేశాలను నిశితంగా గమనించనున్నాయి’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు.
‘‘సోమవారం కీలకమైన సేవల పీఎంఐ గణాంకాలు విడుదల కానున్నాయి. బుధవారం ఆర్‌బీఐ సమావేశ వివరాలు వెల్లడి కానున్నాయి’’ అని అమ్రపాలి ఆద్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ డైరెక్టర్ అభ్నీష్ కుమార్ అన్నారు. వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ విధానం, రుతుపవనాల పురోగతి, జీఎస్టీ అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను నిర్ణయించనున్నాయని ట్రేడ్‌స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపకుడు విజయ్ సింఘా చెప్పారు. సూచీలు రికార్డు గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నందున కొంత స్థిరీకరణకు అవకాశం లేకపోలేదన్నారు. గత వారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 245 పాయింట్లు లాభపడింది.