ఆగస్ట్‌లో వృద్ధి బాటకు... తయారీ: పీఎంఐ
న్యూఢిల్లీ: తయారీ రంగం ఆగస్టులో తిరిగి వృద్ధి బాటకు మళ్లింది. నికాయ్ ఇండియా మేనేజింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఆగస్టులో 51.2గా నమోదయ్యింది. జూలైలో ఇండెక్స్ 47.9 వద్ద ఉంది. పీఎంఐ పాయింట్లు 50 శాతం ఎగువన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువున ఉంటే, క్షీణతగా పరిగణించడం జరుగుతుంది.
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు నేపథ్యంలో– జూలైలో అప్పటికే ఉన్న నిల్వలను విక్రయించుకోవడంపై దృష్టి పెట్టిన కంపెనీలు, కొత్త ఉత్పత్తులపై దృష్టి సారించకపోవడం, కొత్త పన్ను వ్యవస్థ (జీఎస్‌టీ)పై సంక్లిష్టత వంటి అంశాలు జూన్, జూలై తయారీ రంగం పేలవ పనితనానికి కారణమని పేర్కొన్న నికాయ్ ఇండెక్స్, జీఎస్‌టీ అమల్లోకి వచ్చి, దీనిపై స్పష్టత వస్తున్న కొలదీ ఆర్డర్లు తిరిగి పుంజుకుంటున్నాయని విశ్లేషించింది. ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో జీడీపీ వృద్ధి రేటు మూడేళ్ల కనిష్ట స్థాయి 5.7 శాతానికి పడిపోయిన నేపథ్యంలో– ఆగస్టు నికాయ్ తయారీ సూచీ కొంత సానుకూలంగా నమోదవడం విశేషం.