అభివృద్ధిలో పైపైకి | Andhra Pradesh Rop Best Most Improved In Big State | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో పైపైకి

Published Sun, Nov 29 2020 4:52 AM | Last Updated on Sun, Nov 29 2020 5:13 AM

Andhra Pradesh Rop Best Most Improved In Big State - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను హరించడమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేసింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ దూసుకెళ్తోంది. ఈ విషయం ఇండియా టుడే స్టేట్‌ ఆఫ్‌ స్టేట్స్‌–2020 అధ్యయనంలో వెల్లడైంది. ఒక్క ఆర్థిక రంగంలోనే కాదు. పర్యాటక రంగంలోనూ ఏపీ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోందని ఆ అధ్యయనం పేర్కొంది.

వివిధ రంగాల్లో దేశం, రాష్ట్రాలు జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకూ సాధించిన ప్రగతిపై మార్కెటింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ అసోసియేట్స్‌ (ఎండీఆర్‌ఏ)తో కలిసి ఇండియా టుడే సంస్థ అధ్యయనం చేసింది. కరోనా ప్రతికూల పరిస్థితులను అధిగమించి 12 రంగాల్లో (ఆర్థిక, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధి, పరిపాలన, శాంతిభద్రతలు.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, పరిశుభ్రత, పర్యావరణం, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం) రాష్ట్రాలు సాధిస్తున్న ప్రగతిని.. వివిధ మార్గాల్లో సేకరించిన డేటాతో పరిశీలించింది.

ఆ విభాగాల్లో రాష్ట్రాలను ఉత్తమ ప్రదర్శన (బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌), అత్యుత్తమ మెరుగైన (మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌), ఓవరాల్‌ కేటగిరీలుగా విభజించింది. వాటికి అనుగుణంగా స్కోర్‌ ఇచ్చింది. ఆయా విభాగాల్లో ఉత్తమ రాష్ట్రాలను విజేతలుగా పేర్కొంది. ఈ అధ్యయనంలో భాగంగా 35 వేల చదరపు కి.మీ.ల భౌగోళిక విస్తీర్ణం లేదా 5 మిలియన్‌ల కంటే ఎక్కువ జనాభా కలిగిన 20 రాష్ట్రాలను పెద్ద రాష్ట్రాలుగానూ, అంతకంటే తక్కువ విస్తీర్ణం, జనాభా కలిగిన రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలుగానూ వర్గీకరించింది. వీటికి అనుగుణంగా ర్యాంకులు ఇచ్చింది.

రెండేళ్ల క్రితం పది.. ఇపుడు ఏడో స్థానం
ఓవరాల్‌ బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2018లో పదో స్థానంలో ఉంటే.. గతేడాది ఎనిమిదో స్థానానికి చేరింది. ఇప్పుడు ఏడో స్థానంలోకి దూసుకొచ్చింది. మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2018లో మన రాష్ట్రం ఎనిమిదో ర్యాంకులో నిలిస్తే.. గతేడాది రెండో ర్యాంకును సాధించింది. ఈ ఏడాది అదే ర్యాంకును నిలబెట్టుకుంటూ స్థిరమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ఇండియా టుడే అధ్యయనం వెల్లడించింది.

ఈ అధ్యయనంలో వెల్లడైన ముఖ్యాంశాలు ఇవీ..
► మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ పెద్ద రాష్ట్రాల విభాగంలో ఆర్థిక రంగం, పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో నిలిచింది.
► ఓవరాల్‌ మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2,000 మార్కులకుగానూ 1,194.8 మార్కులను సాధించిన ఏపీ రెండో స్థానంలో నిలిచింది.
► ఓవరాల్‌ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2,000 మార్కులకుగానూ 1,147.7 మార్కులను సాధించిన ఏపీ ఏడో స్థానానికి చేరుకుంది.
► కరోనా కట్టడిలో వందకు 65.8 మార్కులను సాధించిన రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది.



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement