ఆర్థికాభివృద్ధిలో పట్టణీకరణ కీలకమే | Urbanisation is key point in economic development | Sakshi
Sakshi News home page

ఆర్థికాభివృద్ధిలో పట్టణీకరణ కీలకమే

Published Fri, Sep 20 2013 10:45 PM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM

ఆర్థికాభివృద్ధిలో పట్టణీకరణ కీలకమే

ఆర్థికాభివృద్ధిలో పట్టణీకరణ కీలకమే

శాటిలైట్ నగరాలతోనే సమస్యల పరిష్కారం
 సాక్షి, హైదరాబాద్: ‘ఒకే ప్రాంతంలో అభివృద్ధి జరిగితే అందరూ ఆ వైపుగానే పరుగు తీస్తారు. దీంతో ఆ ప్రాంతంపై ఒత్తిడి పెరిగి అనేక రకాల సమస్యలకు దారి తీస్తుంది. అలా కాకుండా శాటిలైట్ నగరాలను అభివృద్ధి చేస్తే పట్టణాలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు ప్రజలు లగ్జరీ జీవితాన్ని గడుపుతారు’ అని మౌలిక రంగ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. దేశం ఆర్థికంగా పురోగతి సాధించడంలో పట్టణాభివృద్ధి కీలకమైన పాత్రను పోషిస్తుందని వారు తెలిపారు. ‘పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన- పట్టణాభివృద్ధి వికేంద్రీకరణ, శాటిలైట్ నగరాల అభివృద్ధి’ అనే అంశంపై శుక్రవారం తాజ్‌కృష్ణ హోటల్‌లో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐఐ ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్యానల్, ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ సీఎండీ వీబీ గాడ్గిల్ మాట్లాడుతూ.. మన రాష్ట్రంలోనూ పెరిగే పట్టణ ప్రాంత జనాభాకి మౌలిక వసతుల కల్పన కోసం వికారాబాద్, భువనగిరి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, జడ్చెర్ల, చౌటుప్పల్ తదితర నగరాల్లో శాటిలైట్ నగరాల అభివృద్ధికి ప్రణాళికలను రచించడం జరుగుతోందని పేర్కొన్నారు. మురుగునీటి వ్యవస్థ, రక్షిత మంచినీరు, ట్రాఫిక్, పార్కులు, సంస్కృతి ఇలా అన్ని రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని శాటిలైట్ నగరాలను అభివృద్ధి చేయాలని సూచించారు.
 
 జీహెచ్‌ఎంసీ (ప్లానింగ్, టీఅండ్‌టీ అండ్ హెరిటేజ్) అడిషనల్ కమిషనర్ డీ రొనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. బార్సిలోనా, షాంఘై వంటి చోట్ల విజయవంతమైన శాటిలైట్ నగరాలను స్ఫూర్తిగా తీసుకుని..మన దేశ పరిస్థితులకు అనుగుణమైన నగరాలను అభివృద్ధి చేయాలని సూచించారు.  అప్పుడే అవి ప్రజాదరణకు నోచుకుంటాయన్నారు.  భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల లేమి కారణంగానే చాలా కాలంగా విదేశీ సంస్థలు నగరానికి రావటంలేదన్నారు. అందుకే ముందుగా మౌలిక సదుపాయాలను కల్పించుకోవాలని, ఆ తర్వాతే శాటిలైట్ నగరాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. గఈ కార్యక్రమంలో అర్బన్ ప్రాక్టిస్, క్రిసిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజరీ డెరైక్టర్ రాకే శ్ బంగే రా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) చైర్మన్ బీ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 శాటిలైట్ నగరాలిలా ఉండాలి
  రాజధానికి సుమారు 100 కి.మీ. ల దూరంలో ఉన్న ముఖ్య పట్టణాలు, నగరాలను శాటిలైట్ నగరాలుగా అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించాలి.
  పకడ్బందీ పట్టణ ప్రణాళికతో పాటు డ్రైనేజీ, మంచినీరు, రహదారులు, వీధిలైట్లు, పారిశుద్ధ్యం వంటి వసతులు కల్పించాలి.
  శాటిలైట్ నగరాల నుంచి రాజధానికి చేరుకునేందుకు ఎంఎంటీఎస్ పరిధిని విస్తరించాలి. బస్సుల సంఖ్యను పెంచాలి.
  ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీలు, పరిశ్రమలను శాటిలైట్ నగరాల్లోనే ఏర్పాటు చేసేలా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాలి.
  ప్రతి చిన్న పనికి రాజధానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పలు ప్రభుత్వ విభాగాల కార్యాలయాలను శాటిలైట్ నగరాల్లో ఏర్పాటు చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement