కూతురును ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలని తల్లి డ్రామా
చైన్ స్నాచింగ్ అంటూ డయల్ 100కు ఫోన్
దర్యాప్తులో అంతా అబద్ధమేనని తేల్చిన పోలీసులు
ఘట్‌కేసర్ (మల్కాజ్‌గిరి జిల్లా) : కూతురును ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలని ఓ తల్లి ఆడిన డ్రామాను ఘట్‌కేసర్ పోలీసులు ఛేదించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలి (60) కూతురు ఆర్థిక సమస్యల్లో ఉంది. కూతురు పడుతున్న కష్టాలను గమనించిన తల్లి.. ఏదైనా సాయం చేయాలనుకుంది. తన దగ్గర డబ్బు లేకపోవడంతో పుస్తెల తాడు విక్రయించాలనుకుంది.
బంగారం అమ్మితే కుమారుడికి తెలుస్తుందని భయపడి మిన్నకుండిపోయింది. ఎలాగైనా కూతురికి సాయం చేయాలని చైన్ స్నాచింగ్ డ్రామాకు తెరలేపింది. ఆదివారం ఉదయం ఇంటి నుంచి మెయిన్ రోడ్డుకు చేరుకొని తన మెడలోని మూడు తులాల బంగారు పుస్తెల తాడును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారని ఏడ్వసాగింది. దీంతో పలువురు స్థానికులు అక్కడ గుమికూడారు. ఈ క్రమంలో వృద్ధురాలు డయల్ 100కు ఫోన్ చేసింది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, నలుగురు ఎస్సైలు పోలీస్ సిబ్బందితో కలిసి నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వృద్ధురాలు పొంతన లేని సమాధానాలు చెప్పింది. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా దుండగుల ఆచూకీ లభించలేదు. దీంతో వృద్ధురాలిని గట్టిగా నిలదీయడంతో.. కూతురిని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలని డ్రామా ఆడినట్లు తెలిపింది. కూతురి ఆర్థిక సమస్యలు తీర్చాలని పోలీసులను తప్పుదోవ పట్టించిన వృద్ధురాలిపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. అత్యవసర సమయాల్లో వినియోగించే డయల్ 100ను దుర్వానియోగపర్చవద్దని పోలీసులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment