Ghatkesar Police
-
‘మేము పోలీసులం.. డబ్బులు ఇస్తే కేసు నుంచి తప్పిస్తాం’
సాక్షి, ఘట్కేసర్: ‘మేము పోలీసులం.. కేసు నుంచి తప్పిస్తాం’అని లంచం తీసుకున్న వారిని ఘట్కేసర్ పోలీసులు ఆదివారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 25న కాళేశ్వరం నుంచి ఘట్కేసర్కు (టీఎస్ 07యూఈ 5355) లారీ ఇసుక లోడుతో వస్తుండగా ఎన్‌ఎఫ్‌సీనగర్ వంతెన వద్ద కారును ఢీకొట్టింది. సంఘటన స్థలానికి ఘట్కేసర్ ప్యాట్రోలింగ్ మొబైల్ వ్యాన్–1 వెళ్లింది. ఆ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో ప్యాట్రోలింగ్ డ్రైవర్ హోంగార్డు శివ లారీని పక్కకు జరపాలని ఆదేశించారు. లారీ డ్రైవర్ జాజుల నర్పింహ లారీని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లాడు. అదే సమయంలో వనస్థలిపురంలో 2010లో హోంగార్డుగా విధుల్లోకి చేరి 2014 నుంచి గైర్హాజరు అవుతున్న ఏ–1 బాల్‌రాజ్(35), ఏ–2 శ్రీను (డైవర్)తో కలిసి ఓ ఆటోను విడిపించాలని మాట్లాడడానికి ఏ–3 హోంగార్డు శివకు ఫోన్ చేశాడు. వెంటనే లారీ దగ్గరికి వెళ్లి వివరాలు సేకరించాలని వారిద్దరికి శివ ఆదేశించారు. వారిరువురు లారీ డ్రైవర్ దగ్గరికి వెళ్లి ఘట్కేసర్ పోలీసులమంటూ వివరాలు సేకరించి శివకు అందించారు. చదవండి: భార్యపై అనుమానం.. నిద్రలో ఉండగా సిలిండర్ ఆన్ చేసి.. డ్రైవర్ ఫిర్యాదుతో హోంగార్డు సస్పెండ్.. ప్రమాదాన్ని ఎవరూ గమనించలేదని డబ్బులు ఇస్తే తప్పిస్తామని వారు లారీ డ్రైవర్‌ను డిమాండ్ చేశారు. డ్రైవర్ రూ.20వేలు బాల్‌రాజ్‌కు ఇచ్చాడు. అనంతరం శివకు రూ.15 వేలు అందజేసి మిగిలినవి తన దగ్గర ఉంచుకున్నాడు. లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు సెల్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేసి ఘట్కేసర్కు చెందిన ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. కాగా ఉన్నతాధికారులు హోంగార్డు శివను (ఏ–3) విధుల నుంచి సస్పెండ్ చేశారు. -
18 హత్యలు: భర్తలుండి తప్పుచేసే ఆడవారినే..
సాక్షి, హైదరాబాద్: రాజధానితోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో వరుసపెట్టి చోరీలు చేస్తున్న ఘరానా దొంగ మంత్రి శంకర్... మూడు కమిషనరేట్లు, ఇతర జిల్లాల్లోనూ మహిళల్ని హత్య చేస్తున్న సైకోకిల్లర్ మైన రాములు... వీరిలో ఒకరు 40 ఏళ్లుగా 256 చోరీలు చేస్తే, మరొకరు 17 ఏళ్లలో 18 హత్యలు చేశాడు. గత ఏడాది జైల్లో కలుసుకున్నప్పుడు వారి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగిందని పోలీసులు చెప్తున్నారు. నరహంతకుడిని విచారించిన నేపథ్యంలోనే ఇది బయటపడిందని అంటున్నారు. హత్యలు చేయడం మానమంటూ శంకర్ ‘హితబోధ’చేశాడని.. దీన్ని విభేదించిన రాములు తన ‘లక్ష్యం’వేరంటూ చెప్పాడని పేర్కొంటున్నారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన రాములును ఘట్కేసర్ పోలీసులు బుధవారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. చదవండి: (భార్యలు మోసం చేయడంతో సైకోగా మారి 18 హత్యలు) జైల్లో సంభాషించుకున్న ఈ ద్వయం... రాములును పటాన్చెరు, శామీర్పేటల్లో జరిగిన రెండు హత్య కేసుల్లో పోలీసులు 2019లో అరెస్టు చేశారు. అప్పటికే కొన్ని పాత కేసులు కూడా ఉండటంతో గత ఏడాది జూలై 31 వరకు ఇతడు జైల్లోనే ఉన్నాడు. నగరంలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో 12 చోరీలకు సంబంధించిన కేసుల్లో మంత్రి శంకర్‌ను హైదరాబాద్ పోలీసులు 2019, సెప్టెంబర్ 11న అరెస్టు చేశారు. ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ నేపథ్యంలోనే శంకర్ గత ఏడాది డిసెంబర్ 4 వరకు జైల్లోనే గడిపాడు. ఇలా వీళ్లిద్దరూ జైల్లో ఉండటంతో అక్కడే కలుసుకున్నారు. రాములు వ్యవహారం తెలిసిన శంకర్ ‘హితబోధ’చేయడానికి ప్రయత్నించాడు. మహిళల ఒంటిపై ఉన్న సొత్తు కోసమే రాములు నేరాలు చేస్తున్నాడని భావించి అలా హత్యలు ఎందుకని, జైలు నుంచి బయటకు వచ్చాక తనతో వస్తే చోరీలు చేద్దామంటూ ‘ఆఫర్’ఇచ్చాడు. తాను చోరీలు చేయనంటూ చెప్పిన రాములు... కేవలం భర్తలు ఉండి పెడదారిలో నడుస్తున్న వారినే తాను చంపుతున్నానని, భర్తల్ని కోల్పోయి ఆ వృత్తిలోకి దిగిన వారిని ఏమీ చేయకుండా విడిచిపెట్టేస్తానని చెప్పుకొచ్చాడు. ఓ కోణంలో భిన్న ధ్రువాలు... ఓ కోణంలో మాత్రం శంకర్, రాములు భిన్న ధ్రువాలని పోలీసులు చెప్తున్నారు. ముగ్గురు భార్యలు ఉండగా... మరో ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తున్న గజదొంగ శంకర్ అయితే... మొదటి భార్య వివాహమైన పక్షం రోజులకే మరొకరితో వెళ్లిపోవడం, మూడేళ్లు కాపురం చేసిన రెండో భార్య విభేదాలతో వేరుకావడం, సహజీవనం చేసిన మూడో ఆమె మరొకరితో సన్నిహితంగా ఉండి కంటపడటంతో రాములు సైకోగా మారాడని వివరిస్తున్నారు. ఘట్కేసర్లో హతమైన వెంకటమ్మ కేసులో పోలీసులు రాములు అరెస్టును ప్రకటించారు. బుధవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. -
ఉద్యోగం ఇప్పిస్తానని మభ్యపెట్టి చోరీలు
నిందితుడిని పట్టుకున్న పోలీసులు ఘట్కేసర్ : ఉద్యోగాలు ఇప్పిస్తానని మభ్యపెట్టి విద్యార్థినులను నగర శివారులో గల సాఫ్ట్వేర్ కంపెనీ వద్దకు తీసుకువచ్చి వారి నుంచి విలువైన వస్తువులను చోరీలకు పాల్పడిన దుండగుడిని పోలీసులు పట్టుకున్నారు. వివరాలను పోలీసులు శుక్రవారం విలేకరులకు వివరించారు. కరీంనగర్ జిల్లా ఓదేలు మండలం, గుంపుల్ల గ్రామానికి చెందిన రావెల్ల స్వరాజ్ బీటెక్‌ను మధ్యలోనే ఆపేశాడు. తరువాత నగరంలోని సుచిత్ర ప్రాంతంలో అద్దెకు ఉంటే అరైస్ ఇంటర్నేషనల్ ఏజెన్సీలో భాగస్వామిగా చేరాడు. మద్యానికి, విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డ స్వరాజ్, ఆదాయానికి మించి ఖర్చులు ఉండడంతో చోరీలను ఎంచుకున్నాడు. ఇందు కోసం కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ఎక్కువగా ఉండే నగరంలోని మైత్రీవనాన్ని తరుచుగా సందర్శించేవాడు. ఒంటరిగా కనిపించే విద్యార్థినుల వద్దకు వెళ్లి, తన సోదరి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తోందని, మీకు అందులో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికేవాడు. అతడి మాటలు నమ్మిన విద్యార్థినులను రాత్రి 10 గంటల సమయంలో నగర శివారులలోని గచ్చిబౌలి, ఇన్ఫోసిస్ సంస్థ, పోచారం, టెక్ మహేంద్ర సంస్థ ఉన్న దుండిగల్‌కు ఆటోలో తీసుకువెళ్లేవాడు. సంస్థ కొంతదూరంలో ఉండగానే ఆటో దింపి జనసంచారం లేని ప్రాంతానికి విద్యార్థిని తీసుకువెళ్లి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు ఇవ్వాలని కోరేవాడు. లేని పక్షంలో అత్యాచారం చేస్తానని బెదిరించేవాడు. దీంతో విద్యార్థినులు వారి ఒంటిపై ఉన్న నగలు, విలువైన వస్తువులను స్వరాజ్‌కు ఇచ్చి అక్కడి నుంచి వెనుతిరిగేవారు. ఇలాంటి కేసులు ఇటీవల ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆరు, దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు నిందితుడి కోసం పోలీసులు వేట కొనసాగించారు. గురువారం రాత్రి ఘట్కేసర్ ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగాడుతున్న స్వరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాలను అంగీకరించిన స్వరాజ్ నుంచి 18 తులాల బంగారు ఆభరణాలు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ ఈస్ట్ సీపీ మహేష్‌భగవత్, డీసీపీ రామచంద్రారెడ్డి, ఏసీపీ సందీప్, ఘట్కేసర్ సీఐ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.