ఉద్యోగం ఇప్పిస్తానని మభ్యపెట్టి చోరీలు
నిందితుడిని పట్టుకున్న పోలీసులు
ఘట్‌కేసర్ : ఉద్యోగాలు ఇప్పిస్తానని మభ్యపెట్టి విద్యార్థినులను నగర శివారులో గల సాఫ్ట్‌వేర్ కంపెనీ వద్దకు తీసుకువచ్చి వారి నుంచి విలువైన వస్తువులను చోరీలకు పాల్పడిన దుండగుడిని పోలీసులు పట్టుకున్నారు. వివరాలను పోలీసులు శుక్రవారం విలేకరులకు వివరించారు. కరీంనగర్ జిల్లా ఓదేలు మండలం, గుంపుల్ల గ్రామానికి చెందిన రావెల్ల స్వరాజ్ బీటెక్‌ను మధ్యలోనే ఆపేశాడు. తరువాత నగరంలోని సుచిత్ర ప్రాంతంలో అద్దెకు ఉంటే అరైస్ ఇంటర్నేషనల్ ఏజెన్సీలో భాగస్వామిగా చేరాడు. మద్యానికి, విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డ స్వరాజ్, ఆదాయానికి మించి ఖర్చులు ఉండడంతో చోరీలను ఎంచుకున్నాడు. ఇందు కోసం కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ఎక్కువగా ఉండే నగరంలోని మైత్రీవనాన్ని తరుచుగా సందర్శించేవాడు. ఒంటరిగా కనిపించే విద్యార్థినుల వద్దకు వెళ్లి, తన సోదరి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తోందని, మీకు అందులో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికేవాడు.
అతడి మాటలు నమ్మిన విద్యార్థినులను రాత్రి 10 గంటల సమయంలో నగర శివారులలోని గచ్చిబౌలి, ఇన్ఫోసిస్ సంస్థ, పోచారం, టెక్ మహేంద్ర సంస్థ ఉన్న దుండిగల్‌కు ఆటోలో తీసుకువెళ్లేవాడు. సంస్థ కొంతదూరంలో ఉండగానే ఆటో దింపి జనసంచారం లేని ప్రాంతానికి విద్యార్థిని తీసుకువెళ్లి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు ఇవ్వాలని కోరేవాడు. లేని పక్షంలో అత్యాచారం చేస్తానని బెదిరించేవాడు. దీంతో విద్యార్థినులు వారి ఒంటిపై ఉన్న నగలు, విలువైన వస్తువులను స్వరాజ్‌కు ఇచ్చి అక్కడి నుంచి వెనుతిరిగేవారు. ఇలాంటి కేసులు ఇటీవల ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆరు, దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు నిందితుడి కోసం పోలీసులు వేట కొనసాగించారు. గురువారం రాత్రి ఘట్‌కేసర్ ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగాడుతున్న స్వరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాలను అంగీకరించిన స్వరాజ్ నుంచి 18 తులాల బంగారు ఆభరణాలు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ ఈస్ట్ సీపీ మహేష్‌భగవత్, డీసీపీ రామచంద్రారెడ్డి, ఏసీపీ సందీప్, ఘట్‌కేసర్ సీఐ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.