Urbanisation
-
కొత్త నమూనాతో పట్టణాభివృద్ధి
తమ గ్రామాన్ని పట్టణాభివృద్ధి సంస్థ అహ్మదాబాద్‌లో కలపడాన్ని నిరసిస్తూ 15కి.మీ.దూరంలోని భావన్‌పూర్ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. సూరత్, హిమ్మత్‌నగర్ సమీప గ్రామాల్లో కూడా ఇటువంటి నిరసనలే కొనసాగుతున్నాయి. పట్టణ అభివృద్ధి ఫలాలను తిరస్కరించడం ఆశ్చర్యకరమైన ధోరణి. నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం కూడా వలసదారులు తిరుగుముఖం పట్టడానికి కారణంగా కనిపిస్తోంది. వ్యవసాయ సంక్షోభం కారణంగా హరియాణా నుంచి ఢిల్లీ, గుర్గావ్లకు వచ్చి, డ్రైవర్లుగా, క్లీనర్లుగా పనిచేసేవారంతా చలికాలం రాగానే కాలుష్యాన్ని భరించలేక గ్రామాలకు తిరుగుముఖం పడుతున్నారు. ఈ ధోరణి పెద్ద నగరాల్లోనే కాదు. కాన్పూర్, గ్వాలియర్ వంటి నగరాల్లో కూడా ఇదే పరిస్థితి. దేశంలోని జనాభాలో 34శాతానికి పైగా జనం పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. 2011తో పోలిస్తే ఇది మూడు శాతం ఎక్కువ. 2005 వరకు 50 లక్షల వరకు జనాభా వున్న నగర పరిధి అలాగే వుండగా, చిన్న సమూహాలు పెరుగుతూ వచ్చాయి. దేశంలోని పట్టణాలన్నీ పేదరికంతో, మౌలిక సదుపాయాలు లేకుండా, చిన్నపాటి ప్రణాళిక కూడా లేనట్టు కనిపిస్తాయి. దేశంలోని పట్టణాలన్నీ ఒక్కలాంటివే. ప్రాంతీయ, భౌగోళిక, సాంస్కృతిక వంటి భేదాలేవీ వీటి మధ్య కనిపించవు. పట్టణ జనాభా పెరగడంతో కనీస అవసరాలైన తాగునీరు, ప్రజా రవాణా, మురుగునీటి పారుదల, వసతి సౌకర్యాల అవసరం పెరిగింది. ఇదిలావుంటే, స్మార్ట్ సిటీల వ్యవహారం చూస్తే 90 స్మార్ట్ సిటీలలో 2,864 ప్రాజెక్టులు చేపట్టగా కేవలం 148 ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 70శాతానికి పైగా ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. చివరికి, ఇంకా కోటికిపైగా గృహాలు అవసరం పడుతున్నాయి. ఇక ప్రతి ఏడాది వచ్చే వరదలు, డెంగ్యూ వంటి వ్యాధులు ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలను మసకబారుస్తున్నాయి. ఢిల్లీ–ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, బుల్లెట్ ట్రైన్ వచ్చినప్పటికీ పట్టణానికి ఉండే సమస్యలు తీరవు. పట్టణం అని దేనిని పరిగణించాలనేది కూడా ఒక ప్రాథమిక సమస్యే. పట్టణాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి రావడంతో జనాభా, స్థానిక పాలనా సంస్థల ఆదాయం, వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగుల శాతం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని గవర్నర్ ఒక ప్రాంతాన్ని పట్టణంగా, మున్సిపాలిటీగా గుర్తిస్తారు. ఇంత అస్పష్టమైన నిర్వచనం కారణంగా పట్టణంగా పరిగణించడంలో అనేక వ్యత్యాసాలు తలెత్తుతున్నాయి. కొండప్రాంతాలైన ఈశాన్య రాష్ట్రాల్లో పట్టణాలను చూస్తే జనాభా వందల్లోనే ఉంటారు. గుజరాత్, మేఘాలయల్లోని వలసల్లో 13 వేలమంది వున్నా గ్రామాలుగా భావిస్తారు. పట్టణ మౌలిక వసతుల కోసం పెడుతున్న ఖర్చు చాలా స్వల్పం కావడం మరో సమస్య. ఇప్పటికీ మన దేశం తలసరి 17 డాలర్లు ఖర్చు చేస్తుం డగా, చైనా 116 డాలర్లు ఖర్చు చేయడం గమనార్హం. ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. ఎన్నెన్నో విభిన్నమైన పథకాలను ప్రకటిస్తున్నాయి. కానీ, అమలు మాత్రం జరగడం లేదు. ఆర్థిక వనరులు కూడా అంతంతమాత్రమే. జైపూర్, బెంగళూర్ తమకు రావల్సిన ఆస్తి పన్నులో కేవలం 5 నుంచి 20 శాతం మాత్రమే వసూలు చేయగలుగుతున్నాయి. ఇంత స్వల్ప ఆర్థిక వనరులతో స్థానిక సంస్థలు ఎలా మనుగడ సాగించాలి? దీంతోపాటు స్థానిక సంస్థలకు నైపుణ్యం కలిగిన వారు లేకపోవడం మరో కొరత. వనరుల తరలింపు, కనీస సేవలు అందించడానికి, ప్రాథమికమైన పద్దుల నిర్వహణకు నగరాల్లో కూడా తగినంత మంది సిబ్బంది లేరు. పట్టణ వలసలకు సంబంధించి ఒక స్పష్టమైన విధానం ఉండాలి. వలసలను దృష్టిలో పెట్టుకుని పట్టణ పథకాలు, కార్యక్రమాలు రూపొందించుకోవాలి. వలసదారులపై వివక్షను రూపుమాపడం, వాళ్ల హక్కులను కాపాడటం అభివృద్ధికి దోహదపడతాయి. రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా వలసలను తగ్గించవచ్చు. పట్టణ ప్రణాళికలు రూపొందించేవారు మన పట్టణాభివృద్ధి చారిత్రక సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. గత శతాబ్దంగా మన పట్టణాలు ఎన్నో మార్పులకు గురయ్యాయి. ఈశాన్య భారతంలో హిల్ స్టేషన్లు నెలకొల్పాలి. వాటి ఆర్థిక అవసరాల కోసం టీ, కాఫీ తోటల సాగు పెంచాలి. అలాగే, పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయాలి. చాలా పట్టణాలు అస్తవ్యస్తంగా పెరిగిపోయాయి. కంటోన్మెంట్లు, సివిల్ లైన్లను ఏర్పాటు చేసి, రైల్వే సౌకర్యం కూడా కల్పించాలి. పట్టణాభివృద్ధికి మనకో ప్రత్యేకమైన నమూనా కావాలి. భారత్ వెలిగిపోవాలంటే, పట్టణాభివృద్ధి అత్యవసరం. వ్యాసకర్త: వరుణ్ గాంధీ, పార్లమెంటు సభ్యులు ఈ–మెయిల్ : fvg001@gmail.com -
భాగ్యనగరి దౌర్భాగ్యం
ఆకాశాన్నంటే భవంతులతో, మిరుమిట్లు గొలిపే కాంతులతో, పెనువేగంతో దూసుకెళ్లే వాహనాలతో, అరచేతిలో ఇమిడే ఫోన్ ద్వారా దేన్నయినా క్షణాల్లో సమకూర్చుకునే సదుపాయాలతో వెలిగిపోయే నగరాల అసలు రంగు కుంభవృష్టి వేళ బయటపడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని అనేక కాలనీలు, బస్తీలు, అపార్టుమెంట్లు జల దిగ్బంధంలో చిక్కుకుని దిక్కుతోచక అల్లాడుతు న్నాయి. పదహారేళ్ల తర్వాత పడిన కుండపోత వర్షంతో కంటిమీద కునుకు కరువై జనం చిగురుటాకుల్లా వణుకుతున్నారు. నీరు, ఆహారం, విద్యుత్‌లాంటి కనీస అవసరాలైనా తీరక కష్టాలు పడుతున్నారు. గుక్కెడు నీళ్ల కోసం అగచాట్లు పడటం మాత్రమే తెలిసున్న నగర పౌరులు ముంచెత్తిన వరదనీరు ఎటుపోతుందో, ఎప్ప టికి పోతుందో అర్ధంకాక అయోమయంలో పడ్డారు. మూన్నాళ్ల వర్షాలకే ఇలాగైతే అవి ఇంకొన్ని రోజులు కొనసాగితే ఏమవుతుందో ఊహించుకోవడానికే భయం వేస్తుంది. కోటి జనాభాకు చేరువవుతున్న నగరం ఇలా జలగండాన పడటం, అధి కార యంత్రాంగం అప్రమత్తంగా లేకపోవడం క్షేమదాయకం కాదు. ఇది హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. కాస్త హెచ్చు తగ్గులతో దేశంలోని నగరాలన్నీ ఇలాగే అఘోరించాయి. దేశ రాజధాని ఢిల్లీ మొదలుకొని అన్నిటా ఇదే స్థితి. 2000 సంవత్సరంలో హైదరాబాద్ చవిచూసిన వరద కష్టాలే 2005లో ముంబై నగరం అనుభవంలోకొచ్చాయి. ఇప్పుడు మరోసారి ఆ నగరం కూడా నీట మునుగుతున్న జాడలు కనిపిస్తున్నాయి. 2014లో శ్రీనగర్, నిరుడు డిసెంబర్లో చెన్నై నగరమూ అతలాకుతలమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్న వాగులు, వంకలు... ప్రస్తు తానికి గ్రాఫిక్స్‌లో మాత్రమే కనబడి ఊరిస్తున్న రాజధాని అమరావతి నగరం సొగసు ఎలా ఉండబోతున్నదో చెబుతున్నాయి. ప్రకృతి ఉరిమినప్పుడు ఎవరూ చేయగలిగిందేమీ ఉండదన్నది వాస్తవమే. కానీ ముందస్తు అంచనాలుంటే, అందుకు తగ్గ ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటే విపత్తుల కారణంగా దాపురించే కష్ట నష్టాల్ని కనిష్టానికి పరిమితం చేయొచ్చు. పౌరుల ఇబ్బందుల్ని సునాయాసంగా తీర్చే దారి వెతకొచ్చు. విపత్తులు చుట్టుముట్టిన వేళ నగరంలో ఏ ఏ ప్రాంతాలు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నదో సాధారణ సమయాల్లో అంచనా వేసుకుని, అందుకు దోహదపడగల అంశాలేమిటో నిర్ధారించుకుని వాటిని సరిచేయడానికి ప్రయత్నిస్తే ఇన్ని ఇబ్బందులుండవు. అందుకు బదులు అధికారంలో ఉన్నవారు గత పాలకుల్ని నిందించి... విపక్షంలో ఉన్నవారు అధికార పక్షాన్ని తూలనాడి చేతులు దులుపుకుంటున్నారు. పట్టణీకరణ, నగరీకరణ పెరిగినకొద్దీ పాలకులు అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. అన్నిటినీ ఒక నగరానికే పరిమితం చేస్తే, పర్యవసానంగా వలసలు పెరిగి జనాభా విస్తరిస్తూ వేలు లక్షలై... అవి కోటికి చేరువై... ఇంకా ఇంకా పెరుగు తుంటే తమ విధానాలు చివరకు ఎలాంటి అనర్ధాలను సృష్టించబోతాయో తెలివి తెచ్చుకోవాలి. అభివృద్ధిని ఒకచోటే కేంద్రీకరించడం, లక్షలమంది జనం అక్కడకు రాక తప్పని స్థితి కల్పించడం పాలకులకు రివాజుగా మారింది. బెంగళూరు నగరం 2000-2010 మధ్య రెట్టింపైంది. 40 లక్షల నుంచి 85 లక్షలకు పెరిగిపోయింది. జపాన్ రాజధాని టోక్యో జనాభాలో క్షీణత కనిపిస్తుంటే ఢిల్లీ మాత్రం శరవేగంగా పెరుగుతున్నదని ఆమధ్య ఒక సర్వే వెల్లడించింది. ఇదే వరస కొనసాగితే 2030 నాటికి ఢిల్లీ జనాభా మూడున్నర కోట్లు మించిపోతుందని హెచ్చరించింది. పోనీ అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారా అంటే అదీ లేదు. 1908లో హైదరాబాద్ నగరాన్ని మూసీ వరదలు ముంచెత్తాక మరోసారి ఆ పరిస్థితి పునరావృతం కాకుండా మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహాలతో నిజాం రాజు పటిష్టమైన చర్యలు తీసుకున్నాడు. భారీ వర్షాలు కురిసినప్పుడు ఆ నీరంతా జనావాసాల్లోకి చొరబడకుండా రిజర్వాయర్ల నిర్మాణం, పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు వంటివి అందులో ప్రధానమైనవి. అప్పటితో పోలిస్తే నగరం అనేక రెట్లు పెరిగిపోయింది. కానీ ఇప్పటికీ వాటిని ఉప యోగించుకోవడమే తప్ప వర్తమానా నికి అనుగుణమైన నిర్మాణాలు లేవు. పైగా చెరువులు కబ్జాకు గురై అక్కడ కాలనీలు పుట్టుకొస్తున్నాయి. భారీ భవంతులు, విల్లాలు వెలుస్తున్నాయి. వీటన్నిటికీ అడ్డూఆపూ లేకుండా అనుమతులు మంజూరవుతున్నాయి. తీరా సమస్య వచ్చి పడేసరికి ఇది ఈనాటిది కాదంటూ దాటేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నగరాలు, పట్టణాల అభివృద్ధి కోసమంటూ వివిధ ప్రాజెక్టులపై ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకం మొదలుకొని అమృత్, స్మార్ట్‌సిటీ, స్వచ్ఛభారత్ వరకూ ఈ జాబితాలో ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ అవిచ్ఛిన్నంగా సాగుతున్నాయి. ఇవి సమర్ధవంతంగా అమలవుతున్నాయంటూ కొన్ని నగరా లను, పట్టణాలను గుర్తించి ర్యాంకులిస్తున్నారు. అందుకు కారకులంటూ అట్ట హాసంగా పలువురు అధికారులకు అవార్డులిస్తున్నారు. ఫలానా నగరం స్మార్ట్‌సిటీకి అర్హమైన జాబితాలో చేరిందని గొప్పలు పోతున్నారు. కానీ పట్టణాలనూ, నగరాలనూ ముంచెత్తుతున్న ఉత్పాతాలు వాటన్నిటినీ పరిహసిస్తున్నాయి. జరు గుతున్నదంతా తంతూ, తమాషా అని తేల్చేస్తున్నాయి. చాలా నగరాలు ఆదా యానికి దీటుగా ఖర్చు చేయవు. బడ్జెట్లు ఘనంగా ఉంటాయి. చివరాఖరికి వచ్చేసరికి ఎక్కడి పనులు అక్కడే ఉండిపోతాయి. నిత్యావసర స్వభావమున్న ఉద్యోగ బాధ్యతలను ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వడం అనర్థాలకు దారితీస్తుందన్న విషయం కూడా తెలియనంత అజ్ఞానం పాలకుల్లో గూడుకట్టుకుని ఉంటున్నది. ప్రణాళికల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పించకపోవడం, పాలనలో పారదర్శకత లోపించడం, అధికార యంత్రాంగానికి జవాబుదారీతనాన్ని నిర్దేశించకపోవడం వంటివి పట్టణీకరణకు పెను శాపంగా మారాయి. వీటన్నిటినీ సరిదిద్దిననాడే మన నగరాలు, పట్టణాలు సురక్షిత జనావాస కేంద్రాలుగా రూపుదిద్దుకుంటాయి. అవి ప్రశాంత జీవనానికి చిరునామాలవుతాయి. -
‘బ్రిక్స్’లో భిన్నాభిప్రాయాలు
సాక్షి, విశాఖపట్నం: బ్రిక్స్ దేశాల మూడో పట్టణీకరణ ఫోరం సదస్సులో పట్టణాభివృద్ధిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గురువారం నాలుగు అంశాలపై ప్లీనరీ జరిగింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన ప్రతినిధులు రోజంతా వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రెండో ప్లీనరీ ‘బ్రిక్స్ స్మార్ట్ సిటీస్ కాంక్లేవ్’ రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.కరికాల వలవన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వలవన్ మాట్లాడుతూ పట్టణ పౌరులకు మెరుగైన సదుపాయాల కల్పనకు ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. దక్షిణాఫ్రికా యూనివర్సిటీ ఫ్రొఫెసర్ ఫిలిప్ హారిసన్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీలతో కీడే ఎక్కువ జరిగే అవకాశాలున్నాయన్నారు. దీనివల్ల పల్లెలు, నగరాల మధ్య అంతరాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మూడో ప్లీనరీలో ‘ఫైనాన్సింగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ అంశంపై చర్చించారు. రాజధాని అమరావతికి రూ.500 కోట్ల నిధులు మంజూరవుతాయని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సంయుక్త కార్యదర్శి బి.ఆనంద్ తెలిపారు. త్వరలో ప్రకటించబోయే 27 స్మార్ట్ సిటీల్లో అమరావతి ఉందన్నారు. -
సమస్యల నిలయాలు
సుమారు 35శాతం జనాభా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో నివసిస్తున్నా మౌలిక సౌకర్యా లు లేక పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధునికతను సంతరించుకోవాల్సిన కాలనీలు మురికి కూపాలను తలపిస్తున్నాయి. అటు సొంత ఆదాయం సరిపోక, ఇటు ప్రభుత్వం నుంచి నిధులు సకాలంలో అందక పాలకమండళ్లు సతమతమవుతున్నాయి. పాలనను పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారుల పోస్టులు ఖాళీగా ఉండటం, సాంకేతిక సిబ్బంది లేకపోవడం మున్సిపాలిటీ లు మురుగు కూపాలుగా మారాయి. మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయతీలుండగా సుమారు 14లక్షలకు పైగా జనాభా పట్టణాల్లోనే ఉంటోంది. పట్టణీకరణ వేగంగా పెరుగుతుండడంతో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో జనాభా అంచనాలకు మించుతోంది. జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక సౌకర్యాల లేకపోవడంతో పట్టణాలు మురికి కూపాలను తలపిస్తున్నాయి. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 243 వార్డులకు 124 వార్డుల్లో మురికి వాడలుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. మున్సిపాలిటీలో సుదీర్ఘకాలంగా అంతర్భాగంగా ఉన్న కాలనీల్లో డ్రైనేజీలు, నల్లా కనెక్షన్లు ఆధునికీకరించడం లేదు. మరోవైపు శరవేగంగా వెలుస్తున్న కొత్త కాలనీల్లో సౌకర్యాలు కల్పించడంలేదు. నిధుల కొరతను పాలకమండళ్లు కారణంగా చూపుతున్నాయి. గ్రేడ్-1 మున్సిపాలిటీ మహబూబ్‌నగర్‌లో గతంలో నిర్మించిన కోయిలసాగర్, రామన్‌పాడు తాగునీటి పథకాలు పూర్తి స్థాయి ఫలితాన్ని ఇవ్వడం లేదు. నారాయణపేట, షాద్‌నగర్, కల్వకుర్తిలో తాగునీటి ఎద్దడి తీవ్రస్థాయిలో ఉంది. గద్వాలలో చేపట్టిన తాగునీటిపథకం పనులు ఆగిపోయాయి. షాద్‌నగర్‌కు మెట్రో వాటర్‌వర్క్స్ నుంచి నీరు అందించాలని నిర్ణయించినా సాంకేతిక సమస్యల మూలంగా ప్రణాళిక ఆచరణలోకి రావడం లేదు. అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ చెత్త సేకరణ, తరలింపు, డంపింగ్ సమస్యగా తయారైంది. కనీసం ఒక్కో మున్సిపాలిటీ సగటున 20 నుంచి 50 ఎకరాల మేర డంపింగ్ యార్డు స్థలాలను సమకూర్చుకోవాల్సి ఉన్నా శ్రద్ధ చూపడం లేదు. మురికివాడల వాసులకు ఇళ్ల స్థలాలు, పక్కాగృహాలు నిర్మించి ఇవ్వడంతోపాటు జీవనోపాధి కల్పిం చాల్సి ఉన్నా పాలక మండళ్లు, ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. పట్టాలెక్కని పట్టణ పాలన సుమారు రెండేళ్ల ప్రత్యేక అధికారుల పాలన అనంతరం ఎట్టకేలకు సుమారు ఐదునెలల క్రితం మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. కోర్టు కేసుల మూలంగా అచ్చంపేట, కొల్లాపూర్ నగర పంచాయతీల్లో ఎన్నిక నిలిచిపోయింది. అయితే మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, ఐజ మినహా అన్నిచోట్లా పూర్తిస్థాయి కమిషనర్లు లేకపోవడం పాలనపై ప్రభావం చూపుతోంది. మౌలిక వసతుల కల్పనలో కీలకంగా వ్యవహరించే సాంకేతిక సిబ్బంది లేకపోవడంతో సమస్యలు రెట్టింపవుతున్నాయి. ఎస్ఎఫ్సీ, టీఎఫ్సీ, ప్రణాళిక, ప్రణాళికేతర గ్రాంట్లు, బీఆర్జీఎఫ్ తదితర పద్దుల కింద నిధులు విడుదలవుతున్నా సకాలంలో అందడం లేదు. ఆస్తి, నల్లా పన్ను, సేల్స్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు, ఇంటి నిర్మాణ అనుమతులు తదితరాల ద్వారా మున్సిపాలిటీలు సొంతంగా ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. అయితే ప్రభుత్వం ద్వారా అందే నిధులను ప్రత్యేకించిన పనులకే వాడాలనే నిబంధన కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరంగా తయారయ్యాయి. కొత్త బోరుబావుల తవ్వకం, మోటార్ల బిగింపు తదితరాల కోసం జనరల్ ఫండ్‌పైనే ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఆర్థికాభివృద్ధిలో పట్టణీకరణ కీలకమే
శాటిలైట్ నగరాలతోనే సమస్యల పరిష్కారం సాక్షి, హైదరాబాద్: ‘ఒకే ప్రాంతంలో అభివృద్ధి జరిగితే అందరూ ఆ వైపుగానే పరుగు తీస్తారు. దీంతో ఆ ప్రాంతంపై ఒత్తిడి పెరిగి అనేక రకాల సమస్యలకు దారి తీస్తుంది. అలా కాకుండా శాటిలైట్ నగరాలను అభివృద్ధి చేస్తే పట్టణాలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు ప్రజలు లగ్జరీ జీవితాన్ని గడుపుతారు’ అని మౌలిక రంగ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. దేశం ఆర్థికంగా పురోగతి సాధించడంలో పట్టణాభివృద్ధి కీలకమైన పాత్రను పోషిస్తుందని వారు తెలిపారు. ‘పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన- పట్టణాభివృద్ధి వికేంద్రీకరణ, శాటిలైట్ నగరాల అభివృద్ధి’ అనే అంశంపై శుక్రవారం తాజ్‌కృష్ణ హోటల్లో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐఐ ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్యానల్, ఎల్అండ్టీ మెట్రో రైల్ సీఎండీ వీబీ గాడ్గిల్ మాట్లాడుతూ.. మన రాష్ట్రంలోనూ పెరిగే పట్టణ ప్రాంత జనాభాకి మౌలిక వసతుల కల్పన కోసం వికారాబాద్, భువనగిరి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, జడ్చెర్ల, చౌటుప్పల్ తదితర నగరాల్లో శాటిలైట్ నగరాల అభివృద్ధికి ప్రణాళికలను రచించడం జరుగుతోందని పేర్కొన్నారు. మురుగునీటి వ్యవస్థ, రక్షిత మంచినీరు, ట్రాఫిక్, పార్కులు, సంస్కృతి ఇలా అన్ని రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని శాటిలైట్ నగరాలను అభివృద్ధి చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ (ప్లానింగ్, టీఅండ్‌టీ అండ్ హెరిటేజ్) అడిషనల్ కమిషనర్ డీ రొనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. బార్సిలోనా, షాంఘై వంటి చోట్ల విజయవంతమైన శాటిలైట్ నగరాలను స్ఫూర్తిగా తీసుకుని..మన దేశ పరిస్థితులకు అనుగుణమైన నగరాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అప్పుడే అవి ప్రజాదరణకు నోచుకుంటాయన్నారు. భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల లేమి కారణంగానే చాలా కాలంగా విదేశీ సంస్థలు నగరానికి రావటంలేదన్నారు. అందుకే ముందుగా మౌలిక సదుపాయాలను కల్పించుకోవాలని, ఆ తర్వాతే శాటిలైట్ నగరాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. గఈ కార్యక్రమంలో అర్బన్ ప్రాక్టిస్, క్రిసిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజరీ డెరైక్టర్ రాకే శ్ బంగే రా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) చైర్మన్ బీ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాటిలైట్ నగరాలిలా ఉండాలి రాజధానికి సుమారు 100 కి.మీ. ల దూరంలో ఉన్న ముఖ్య పట్టణాలు, నగరాలను శాటిలైట్ నగరాలుగా అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించాలి. పకడ్బందీ పట్టణ ప్రణాళికతో పాటు డ్రైనేజీ, మంచినీరు, రహదారులు, వీధిలైట్లు, పారిశుద్ధ్యం వంటి వసతులు కల్పించాలి. శాటిలైట్ నగరాల నుంచి రాజధానికి చేరుకునేందుకు ఎంఎంటీఎస్ పరిధిని విస్తరించాలి. బస్సుల సంఖ్యను పెంచాలి. ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీలు, పరిశ్రమలను శాటిలైట్ నగరాల్లోనే ఏర్పాటు చేసేలా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాలి. ప్రతి చిన్న పనికి రాజధానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పలు ప్రభుత్వ విభాగాల కార్యాలయాలను శాటిలైట్ నగరాల్లో ఏర్పాటు చేయాలి.