భాగ్యనగరి దౌర్భాగ్యం
ఆకాశాన్నంటే భవంతులతో, మిరుమిట్లు గొలిపే కాంతులతో, పెనువేగంతో దూసుకెళ్లే వాహనాలతో, అరచేతిలో ఇమిడే ఫోన్ ద్వారా దేన్నయినా క్షణాల్లో సమకూర్చుకునే సదుపాయాలతో వెలిగిపోయే నగరాల అసలు రంగు కుంభవృష్టి వేళ బయటపడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని అనేక కాలనీలు, బస్తీలు, అపార్టుమెంట్లు జల దిగ్బంధంలో చిక్కుకుని దిక్కుతోచక అల్లాడుతు న్నాయి. పదహారేళ్ల తర్వాత పడిన కుండపోత వర్షంతో కంటిమీద కునుకు కరువై జనం చిగురుటాకుల్లా వణుకుతున్నారు.
నీరు, ఆహారం, విద్యుత్‌లాంటి కనీస అవసరాలైనా తీరక కష్టాలు పడుతున్నారు. గుక్కెడు నీళ్ల కోసం అగచాట్లు పడటం మాత్రమే తెలిసున్న నగర పౌరులు ముంచెత్తిన వరదనీరు ఎటుపోతుందో, ఎప్ప టికి పోతుందో అర్ధంకాక అయోమయంలో పడ్డారు. మూన్నాళ్ల వర్షాలకే ఇలాగైతే అవి ఇంకొన్ని రోజులు కొనసాగితే ఏమవుతుందో ఊహించుకోవడానికే భయం వేస్తుంది. కోటి జనాభాకు చేరువవుతున్న నగరం ఇలా జలగండాన పడటం, అధి కార యంత్రాంగం అప్రమత్తంగా లేకపోవడం క్షేమదాయకం కాదు.
ఇది హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. కాస్త హెచ్చు తగ్గులతో దేశంలోని నగరాలన్నీ ఇలాగే అఘోరించాయి. దేశ రాజధాని ఢిల్లీ మొదలుకొని అన్నిటా ఇదే స్థితి. 2000 సంవత్సరంలో హైదరాబాద్ చవిచూసిన వరద కష్టాలే 2005లో ముంబై నగరం అనుభవంలోకొచ్చాయి. ఇప్పుడు మరోసారి ఆ నగరం కూడా నీట మునుగుతున్న జాడలు కనిపిస్తున్నాయి. 2014లో శ్రీనగర్, నిరుడు డిసెంబర్‌లో చెన్నై నగరమూ అతలాకుతలమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్న వాగులు, వంకలు... ప్రస్తు తానికి గ్రాఫిక్స్‌లో మాత్రమే కనబడి ఊరిస్తున్న రాజధాని అమరావతి నగరం సొగసు ఎలా ఉండబోతున్నదో చెబుతున్నాయి.
ప్రకృతి ఉరిమినప్పుడు ఎవరూ చేయగలిగిందేమీ ఉండదన్నది వాస్తవమే. కానీ ముందస్తు అంచనాలుంటే, అందుకు తగ్గ ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటే విపత్తుల కారణంగా దాపురించే కష్ట నష్టాల్ని కనిష్టానికి పరిమితం చేయొచ్చు. పౌరుల ఇబ్బందుల్ని సునాయాసంగా తీర్చే దారి వెతకొచ్చు. విపత్తులు చుట్టుముట్టిన వేళ నగరంలో ఏ ఏ ప్రాంతాలు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నదో సాధారణ సమయాల్లో అంచనా వేసుకుని, అందుకు దోహదపడగల అంశాలేమిటో నిర్ధారించుకుని వాటిని సరిచేయడానికి ప్రయత్నిస్తే ఇన్ని ఇబ్బందులుండవు. అందుకు బదులు అధికారంలో ఉన్నవారు గత పాలకుల్ని నిందించి... విపక్షంలో ఉన్నవారు అధికార పక్షాన్ని తూలనాడి చేతులు దులుపుకుంటున్నారు.
పట్టణీకరణ, నగరీకరణ పెరిగినకొద్దీ పాలకులు అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. అన్నిటినీ ఒక నగరానికే పరిమితం చేస్తే, పర్యవసానంగా వలసలు పెరిగి జనాభా విస్తరిస్తూ వేలు లక్షలై... అవి కోటికి చేరువై... ఇంకా ఇంకా పెరుగు తుంటే తమ విధానాలు చివరకు ఎలాంటి అనర్ధాలను సృష్టించబోతాయో తెలివి తెచ్చుకోవాలి. అభివృద్ధిని ఒకచోటే కేంద్రీకరించడం, లక్షలమంది జనం అక్కడకు రాక తప్పని స్థితి కల్పించడం పాలకులకు రివాజుగా మారింది. బెంగళూరు నగరం 2000-2010 మధ్య రెట్టింపైంది. 40 లక్షల నుంచి 85 లక్షలకు పెరిగిపోయింది. జపాన్ రాజధాని టోక్యో జనాభాలో క్షీణత కనిపిస్తుంటే ఢిల్లీ మాత్రం శరవేగంగా పెరుగుతున్నదని ఆమధ్య ఒక సర్వే వెల్లడించింది. ఇదే వరస కొనసాగితే 2030 నాటికి ఢిల్లీ జనాభా మూడున్నర కోట్లు మించిపోతుందని హెచ్చరించింది. పోనీ అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారా అంటే అదీ లేదు. 1908లో హైదరాబాద్ నగరాన్ని మూసీ వరదలు ముంచెత్తాక మరోసారి ఆ పరిస్థితి పునరావృతం కాకుండా మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహాలతో నిజాం రాజు పటిష్టమైన చర్యలు తీసుకున్నాడు.
భారీ వర్షాలు కురిసినప్పుడు ఆ నీరంతా జనావాసాల్లోకి చొరబడకుండా రిజర్వాయర్ల నిర్మాణం, పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు వంటివి అందులో ప్రధానమైనవి. అప్పటితో పోలిస్తే నగరం అనేక రెట్లు పెరిగిపోయింది. కానీ ఇప్పటికీ వాటిని ఉప యోగించుకోవడమే తప్ప వర్తమానా నికి అనుగుణమైన నిర్మాణాలు లేవు. పైగా చెరువులు కబ్జాకు గురై అక్కడ కాలనీలు పుట్టుకొస్తున్నాయి. భారీ భవంతులు, విల్లాలు వెలుస్తున్నాయి. వీటన్నిటికీ అడ్డూఆపూ లేకుండా అనుమతులు మంజూరవుతున్నాయి. తీరా సమస్య వచ్చి పడేసరికి ఇది ఈనాటిది కాదంటూ దాటేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నగరాలు, పట్టణాల అభివృద్ధి కోసమంటూ వివిధ ప్రాజెక్టులపై ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకం మొదలుకొని అమృత్, స్మార్ట్‌సిటీ, స్వచ్ఛభారత్ వరకూ ఈ జాబితాలో ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ అవిచ్ఛిన్నంగా సాగుతున్నాయి. ఇవి సమర్ధవంతంగా అమలవుతున్నాయంటూ కొన్ని నగరా లను, పట్టణాలను గుర్తించి ర్యాంకులిస్తున్నారు. అందుకు కారకులంటూ అట్ట హాసంగా పలువురు అధికారులకు అవార్డులిస్తున్నారు.
ఫలానా నగరం స్మార్ట్‌సిటీకి అర్హమైన జాబితాలో చేరిందని గొప్పలు పోతున్నారు. కానీ పట్టణాలనూ, నగరాలనూ ముంచెత్తుతున్న ఉత్పాతాలు వాటన్నిటినీ పరిహసిస్తున్నాయి. జరు గుతున్నదంతా తంతూ, తమాషా అని తేల్చేస్తున్నాయి. చాలా నగరాలు ఆదా యానికి దీటుగా ఖర్చు చేయవు. బడ్జెట్లు ఘనంగా ఉంటాయి. చివరాఖరికి వచ్చేసరికి ఎక్కడి పనులు అక్కడే ఉండిపోతాయి. నిత్యావసర స్వభావమున్న ఉద్యోగ బాధ్యతలను ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వడం అనర్థాలకు దారితీస్తుందన్న విషయం కూడా తెలియనంత అజ్ఞానం పాలకుల్లో గూడుకట్టుకుని ఉంటున్నది. ప్రణాళికల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పించకపోవడం, పాలనలో పారదర్శకత లోపించడం, అధికార యంత్రాంగానికి జవాబుదారీతనాన్ని నిర్దేశించకపోవడం వంటివి పట్టణీకరణకు పెను శాపంగా మారాయి. వీటన్నిటినీ సరిదిద్దిననాడే మన నగరాలు, పట్టణాలు సురక్షిత జనావాస కేంద్రాలుగా రూపుదిద్దుకుంటాయి. అవి ప్రశాంత జీవనానికి చిరునామాలవుతాయి.