బ్రిక్స్ దేశాల మూడో పట్టణీకరణ ఫోరం సదస్సులో పట్టణాభివృద్ధిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
సాక్షి, విశాఖపట్నం: బ్రిక్స్ దేశాల మూడో పట్టణీకరణ ఫోరం సదస్సులో పట్టణాభివృద్ధిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గురువారం నాలుగు అంశాలపై ప్లీనరీ జరిగింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన ప్రతినిధులు రోజంతా వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రెండో ప్లీనరీ ‘బ్రిక్స్ స్మార్ట్ సిటీస్ కాంక్లేవ్’ రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.కరికాల వలవన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వలవన్ మాట్లాడుతూ పట్టణ పౌరులకు మెరుగైన సదుపాయాల కల్పనకు ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు.
దక్షిణాఫ్రికా యూనివర్సిటీ ఫ్రొఫెసర్ ఫిలిప్ హారిసన్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీలతో కీడే ఎక్కువ జరిగే అవకాశాలున్నాయన్నారు. దీనివల్ల పల్లెలు, నగరాల మధ్య అంతరాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మూడో ప్లీనరీలో ‘ఫైనాన్సింగ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ అంశంపై చర్చించారు. రాజధాని అమరావతికి రూ.500 కోట్ల నిధులు మంజూరవుతాయని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సంయుక్త కార్యదర్శి బి.ఆనంద్ తెలిపారు. త్వరలో ప్రకటించబోయే 27 స్మార్ట్ సిటీల్లో అమరావతి ఉందన్నారు.