సంఘర్షణలకు యుద్ధాలు పరిష్కారం కాదు
‘బ్రిక్స్’ సదస్సులో ప్రధాని మోదీ స్పష్టికరణ
ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాటం సాగించాలని పిలుపు
కజన్: సంఘర్షణలు, సమస్యల పరిష్కారానికి చర్చలు, దౌత్యమార్గాలే శ్రేయస్కరమని ప్రధాని మోదీ మరోసారి తేల్చిచెప్పారు. శాంతియుత మా ర్గంలో చర్చలు, సంప్రదింపులకే తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఏ సమస్యకైనా యుద్ధాలతో పరిష్కారం లభించందని స్పష్టంచేశారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి శాంతి చర్చలకు శ్రీకారం చుట్టాలని ఇరుపక్షాలకు పిలుపునిచ్చారు.
రష్యాలోని కజన్ నగరంలో బుధవారం 16వ ‘బ్రిక్స్’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. బ్రిక్స్ అనేది విభజన సంస్థ కాదని, మొత్తం మానవాళి ప్రయోజనాల కోసం పనిచేస్తే సంస్థ అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని కూటమికి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, సంఘర్షణలు, ఆర్థిక అనిశి్చతి, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి సవాళ్లపై మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపించేలా బ్రిక్స్ సానుకూల పాత్ర పోషించగలదని చెప్పారు. బ్రిక్స్ వైవిధ్యంతో కూడిన, సమగ్ర వేదిక అని వివరించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే...
ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు వద్దు
‘‘యుద్ధానికి కాదు.. చర్చలు, దౌత్యానికే మా మద్దతు ఉంటుంది. కోవిడ్–19 సంక్షోభాన్ని మనమంతా కలిసికట్టుగా అధిగమించాం అదే తరహాలో ముందు తరాలకు సురక్షితమైన, బలమైన, సౌభాగ్యవంతమైన భవిష్యత్తును అందించడానికి నూతన అవకాశాలు మనం సృష్టించగలం. ప్రస్తుత సవాళ్ల నేపథ్యంలో బ్రిక్స్‌పై ప్రపంచ దేశాలకు ఎన్నో అంచనాలున్నాయి. వాటిని నెరవేర్చేలా మనం పనిచేయాలి.
ఉగ్రవాద భూతాన్ని అంతం చేయడానికి అన్ని దేశాలూ కలిసికట్టుగా కృషి చేయాలి. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పనికిరావు. అందరూ ఒకే ఆలోచనతో ఉంటేనే లక్ష్యం సాధించడం సులువవుతుంది. యువతను ఉగ్రవాదం, తీవ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకోవడానికి కఠిన చర్యలు అవసరం. అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో సమగ్ర తీర్మానం చేసేలా మనమంతా కలిసి ఒత్తిడి పెంచాలి.
అలాగే సైబర్ భద్రత, సురక్షితమైన కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం కోసం మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థతోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సమగ్ర సంస్కరణలు అవసరం. నిరి్ధష్ట గడువులోగా సంస్కరణలు వచ్చేలా మనం ఉమ్మడిగా ముందుకు సాగాలి. బ్రిక్స్‌లో మన ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అంతర్జాతీయ సంస్థలకు బ్రిక్స్ ప్రత్యామ్నాయం అనే భావన రాకూడదు.
ఆయా సంస్థలను సంస్కరించే వేదిక అనే అభిప్రాయం అందరిలోనూ కలగాలి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడాన్ని మనం కర్తవ్యంగా స్వీకరించాలి. ఆహార భద్రత, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. బ్రిక్స్‌లోకి మరికొన్ని భాస్వామ్య దేశాలను ఆహా్వనించడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఈ విషయంలో కూటమి దేశాలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలి. అదేసమయంలో బ్రిక్స్ వ్యవస్థాపక సభ్యదేశాలను గౌరవించాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు.
కూటమిలోకి మరో ఐదు దేశాలు
బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) కూటమిలో చేరేందుకు గ్లోబల్ సౌత్ దేశాలు ఎంతగానో ఆసక్తి చూపుతున్నాయని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చెప్పారు. ఈ విషయంలో ఆయా దేశాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల పట్ల చురుగ్గా స్పందించాలని కూటమిలోని సభ్యదేశాలకు సూచించారు. కొత్త దేశాలను కూటమిలో భాగస్వాములుగా చేర్చుకోవాలని బ్రిక్స్ ప్రస్తుత సదస్సులో నిర్ణయించినట్లు తెలిపారు.
బ్రిక్స్‌లో తాజాగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) సభ్యదేశాలుగా చేరాయి. బ్రిక్స్ ప్రయాణంలో ఇదొక కీలకమైన ఘట్టమని జిన్‌పింగ్ చెప్పారు. ఆయన బుధవారం బ్రిక్స్ సదస్సులో మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో బిక్స్ దేశాల్లో 10 ఓవర్సీస్ లెరి్నంగ్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. వీటిలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శిక్షణ ఇస్తామని తెలిపారు.
భారత ఆర్థిక ప్రగతి సూపర్: పుతిన్
భారత ఆర్థిక ప్రగతి అద్భుతమంటూ బ్రిక్స్ సదస్సు వేదిక సాక్షిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతించారు. ఈ విషయంలో బ్రిక్స్ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందన్నారు. ‘‘హెచ్చు వృద్ధి రేటు సాధించాల్సిన అవసరాన్ని గురించి దేశాధినేతలుగా మనమంతా తరచూ మాట్లాడుతుంటాం. ప్రధాని మోదీ దాన్ని విజయవంతంగా సాధించి చూపిస్తున్నారు. 7.5 శాతం వృద్ధి రేటుతో భారత్‌ను మనందరికీ ఆదర్శంగా నిలిపారు. ఆయన సాధిస్తున్న విజయాలకు అభినందనలు. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నందుకు మోదీకి ధన్యవాదాలు’’ అన్నా రు. ద్వైపాక్షిక వర్తకంలో భారత్, రష్యా సాధిస్తున్న వృద్ధి పట్ల పుతిన్ సంతృప్తి వెలిబుచ్చారు.
ఉగ్రవాదంతో అందరికీ ముప్పు
బ్రిక్స్ సదస్సు అనంతరం కూటమి నేతలు బుధవారం ఒక ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశారు. ఉగ్రవాదాన్ని ‘ఉమ్మడి ముప్పు’గా పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని నియంత్రించడానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని తీర్మానించారు. ఉగ్రవాదం అనేది ఏ ఒక్క మతం, జాతీయత, నాగరికతకు సంబంధించింది కాదని ఉద్ఘాటించారు. అది ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఉగ్రవాద నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని బ్రిక్స్ కూటమి నేతలు నిర్ణయించారు. ప్రపంచానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులను కూడా డిక్లరేషన్‌లో ప్రస్తావించారు. అజర్‌బైజాన్‌లో జరగబోయే కాప్–29 సదస్సులో వాతావరణ మార్పులకు సంబంధించి ఒక పరిష్కారం మార్గం వెలువడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment