చైనా, భారత్ సంబంధాలు బలపడాలి జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక భేటీలో మోదీ
ఇది ప్రపంచమంతటికీ మేలన్న ప్రధాని
నిస్సైనికీకరణ ఒప్పందంపై నేతల హర్షం
సరిహద్దుల్లో శాంతి నెలకొనాలని వ్యాఖ్యలు
వారి మధ్య ఐదేళ్ల తర్వాత ఇదే తొలి భేటీ
త్వరలో ప్రత్యేక ప్రతినిధుల స్థాయి భేటీలు
కజాన్: భారత్, చైనా సంబంధాల మెరుగుదల దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ప్రధాని నరేంద్ర మోదీ నడుమ ద్వైపాక్షిక సమావేశం బుధవారం జరిగింది. రష్యాలో జరిగిన మూడు రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదికైంది. జిన్‌పింగ్, మోదీ అధికారికంగా భేటీ కావడం ఐదేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. లద్దాఖ్ సమీపంలో సరిహద్దు గస్తీపై ఇరు దేశాల సైనిక, తదితర ఉన్నతాధికారుల స్థాయిలో కుదిరిన తాజా ఒప్పందాన్ని అధినేతలిద్దరూ స్వాగతించారు.
ఇరుదేశాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం దిశగా పలు అంశాలపై ప్రత్యేక ప్రతినిధులు నడుమ మరిన్ని ఉన్నత స్థాయి చర్చలు జరపాలని నిర్ణయించారు. సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతల పరిరక్షణే ఇరుదేశాల ధ్యేయం కావాలని మోదీ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పరస్పర విశ్వాసం, గౌరవం, పరిణతే ప్రాతిపదికగా ఇరు దేశాల సంబంధాలు బలపడాలని పిలుపునిచ్చారు. రష్యాలోని కజాన్‌లో బ్రిక్స్ సదస్సు ముగిసిన అనంతరం నేతల భేటీ జరిగింది.
అన్ని అంశాలపైనా వారిద్దరూ 50 నిమిషాలకు పైగా లోతుగా చర్చలు జరిపారు. ‘‘విభేదాలు, వివాదాలను చర్చలు తదితరాల ద్వారా సజావుగా పరిష్కరించుకోవాలి. శాంతి, సౌభ్రాతృత్వాలను అవి దెబ్బతీయకుండా జాగ్రత్త పడాలి’’ అంటూ చైనా అధ్యక్షునికి మోదీ ఈ సందర్భంగా హితవు పలికారు. ప్రపంచంలోనే అతి పెద్ద దేశాలైన చైనా–భారత మధ్య సత్సంబంధాలు ఇరు దేశాల ప్రజలకే గాక ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, సామరస్యాలకు చాలా కీలకమని పేర్కొన్నారు.
భేటీ అనంతరం ఈ మేరకు మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ భేటీని ఇరు దేశాల ప్రజలతో పాటు అంతర్జాతీయ సమాజం కూడా ఆసక్తిగా గమనిస్తోందని జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. సమస్యలు, విభేదాల పరిష్కారానికి, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు ఇరు దేశాల మధ్యా అన్ని స్థాయిల్లోనూ మరింత సమన్వయం, మరిన్ని చర్చలు అత్యవసరమన్నారు. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, సమస్యలు తదితరాలు కూడా నేతలిద్దరి చర్చల్లో చోటుచేసుకున్నాయి.
షాంఘై సహకార సంస్థకు 2025లో చైనా సారథ్యానికి పూర్తిస్థాయిలో మద్దతిస్తామని జిన్‌పింగ్‌కు మోదీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. చైనా, భారత సైనికుల మధ్య 2020 నాటి గాల్వన్ లోయ ఘర్షణల అనంతరం ఇరు దేశాల సంబంధాలు దారుణంగా క్షీణించడం తెలిసిందే. వాటిని చక్కదిద్దుకునే ప్రయత్నాల దిశగా ఈ భేటీని కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కరచాలనం
చర్చలు కొనసాగుతాయి
పలు ద్వైపాక్షిక అంశాలను అధినేతలిద్దరూ దీర్ఘకాలిక దృష్టితో లోతుగా సమీక్షించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ‘‘సరిహద్దు వివాదం మొదలుకుని పలు విభేదాలపై ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు కొనసాగాలని వారు నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు త్వరలోనే చర్చలుంటాయి’’ అని వెల్లడించారు. మోదీ–జిన్‌పింగ్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇరుదేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు ముందుగా సరిహద్దు ప్రాంతాల వద్ద శాంతి, సామరస్యం నెలకొనాలన్న అంశంపై వారిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్టు వివరించారు. అభివృద్ధిపరమైన సవాళ్లను అధిగమిస్తూ పరస్పర సహకారం, సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించారన్నారు. ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో భారత్‌కు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనాకు విదేశాంగ మంత్రి వాంగ్ యీ సారథ్యం వహిస్తున్నారు. వారి నడుమ 2019లో చివరిసారిగా చర్చలు జరిగాయి.
ఉజ్బెక్, యూఏఈ అధ్యక్షులతో మోదీ భేటీ
బ్రిక్స్ సదస్సు చివరి రోజు బుధవారం ఉజ్బెకస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌అల్ నహ్యాన్‌తో కూడా మోదీ భేటీ అయ్యారు. వారిద్దరితో చర్చలు అత్యంత ఫలప్రదంగా జరిగినట్టు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అనంతరం రెండు రోజుల రష్యా పర్యటన ముగించుకుని మోదీ భారత్ బయల్దేరారు.
Comments
Please login to add a commentAdd a comment