China-India relationship
-
సుహృద్భావమే లక్ష్యం
కజాన్: భారత్, చైనా సంబంధాల మెరుగుదల దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ప్రధాని నరేంద్ర మోదీ నడుమ ద్వైపాక్షిక సమావేశం బుధవారం జరిగింది. రష్యాలో జరిగిన మూడు రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదికైంది. జిన్‌పింగ్, మోదీ అధికారికంగా భేటీ కావడం ఐదేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. లద్దాఖ్ సమీపంలో సరిహద్దు గస్తీపై ఇరు దేశాల సైనిక, తదితర ఉన్నతాధికారుల స్థాయిలో కుదిరిన తాజా ఒప్పందాన్ని అధినేతలిద్దరూ స్వాగతించారు. ఇరుదేశాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం దిశగా పలు అంశాలపై ప్రత్యేక ప్రతినిధులు నడుమ మరిన్ని ఉన్నత స్థాయి చర్చలు జరపాలని నిర్ణయించారు. సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతల పరిరక్షణే ఇరుదేశాల ధ్యేయం కావాలని మోదీ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పరస్పర విశ్వాసం, గౌరవం, పరిణతే ప్రాతిపదికగా ఇరు దేశాల సంబంధాలు బలపడాలని పిలుపునిచ్చారు. రష్యాలోని కజాన్‌లో బ్రిక్స్ సదస్సు ముగిసిన అనంతరం నేతల భేటీ జరిగింది. అన్ని అంశాలపైనా వారిద్దరూ 50 నిమిషాలకు పైగా లోతుగా చర్చలు జరిపారు. ‘‘విభేదాలు, వివాదాలను చర్చలు తదితరాల ద్వారా సజావుగా పరిష్కరించుకోవాలి. శాంతి, సౌభ్రాతృత్వాలను అవి దెబ్బతీయకుండా జాగ్రత్త పడాలి’’ అంటూ చైనా అధ్యక్షునికి మోదీ ఈ సందర్భంగా హితవు పలికారు. ప్రపంచంలోనే అతి పెద్ద దేశాలైన చైనా–భారత మధ్య సత్సంబంధాలు ఇరు దేశాల ప్రజలకే గాక ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, సామరస్యాలకు చాలా కీలకమని పేర్కొన్నారు. భేటీ అనంతరం ఈ మేరకు మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ భేటీని ఇరు దేశాల ప్రజలతో పాటు అంతర్జాతీయ సమాజం కూడా ఆసక్తిగా గమనిస్తోందని జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. సమస్యలు, విభేదాల పరిష్కారానికి, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు ఇరు దేశాల మధ్యా అన్ని స్థాయిల్లోనూ మరింత సమన్వయం, మరిన్ని చర్చలు అత్యవసరమన్నారు. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, సమస్యలు తదితరాలు కూడా నేతలిద్దరి చర్చల్లో చోటుచేసుకున్నాయి. షాంఘై సహకార సంస్థకు 2025లో చైనా సారథ్యానికి పూర్తిస్థాయిలో మద్దతిస్తామని జిన్‌పింగ్‌కు మోదీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. చైనా, భారత సైనికుల మధ్య 2020 నాటి గాల్వన్ లోయ ఘర్షణల అనంతరం ఇరు దేశాల సంబంధాలు దారుణంగా క్షీణించడం తెలిసిందే. వాటిని చక్కదిద్దుకునే ప్రయత్నాల దిశగా ఈ భేటీని కీలక ముందడుగుగా భావిస్తున్నారు. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కరచాలనం చర్చలు కొనసాగుతాయి పలు ద్వైపాక్షిక అంశాలను అధినేతలిద్దరూ దీర్ఘకాలిక దృష్టితో లోతుగా సమీక్షించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ‘‘సరిహద్దు వివాదం మొదలుకుని పలు విభేదాలపై ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు కొనసాగాలని వారు నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు త్వరలోనే చర్చలుంటాయి’’ అని వెల్లడించారు. మోదీ–జిన్‌పింగ్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు ముందుగా సరిహద్దు ప్రాంతాల వద్ద శాంతి, సామరస్యం నెలకొనాలన్న అంశంపై వారిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్టు వివరించారు. అభివృద్ధిపరమైన సవాళ్లను అధిగమిస్తూ పరస్పర సహకారం, సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించారన్నారు. ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో భారత్‌కు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనాకు విదేశాంగ మంత్రి వాంగ్ యీ సారథ్యం వహిస్తున్నారు. వారి నడుమ 2019లో చివరిసారిగా చర్చలు జరిగాయి. ఉజ్బెక్, యూఏఈ అధ్యక్షులతో మోదీ భేటీ బ్రిక్స్ సదస్సు చివరి రోజు బుధవారం ఉజ్బెకస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్అల్ నహ్యాన్తో కూడా మోదీ భేటీ అయ్యారు. వారిద్దరితో చర్చలు అత్యంత ఫలప్రదంగా జరిగినట్టు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అనంతరం రెండు రోజుల రష్యా పర్యటన ముగించుకుని మోదీ భారత్ బయల్దేరారు. -
చైనాతో అత్యంత క్లిష్టంగా సంబంధాలు
మ్యూనిక్: చైనాతో భారత సంబంధాలు ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ అన్నారు. సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించవద్దన్న ఒప్పందాలను చైనా ఉల్లంఘించడంతో పరిస్థితి మరింత విషమించిందన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి సరిహద్దుల్లోని పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. జర్మనీలోని మ్యూనిక్‌లో జరుగుతున్న సెక్యూరిటీ కాన్ఫరెన్స్ (ఎంఎస్సీ)లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాతో వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు 45 ఏళ్ల పాటు శాంతియుతంగానే ఉన్నాయని గుర్తు చేశారు. చైనా వంటి ఒక పెద్ద దేశం ఒప్పందాలను ఉల్లంఘిస్తే అది అంతర్జాతీయ సమాజమంతా ఆందోళన చెందాల్సిన విషయమేనన్నారు. సుదూరాల్లోని చిన్న దేశాలకు భారీగా అప్పులిచ్చి అక్కడి వ్యూహాత్మక ప్రాంతాలను చైనా తన అదుపులోకి తెచ్చుకుంటున్న తీరు ఆందోళనకరమని జై శంకర్ అన్నారు. అనుసంధానం ముసుగులో చేస్తున్న ఇలాంటి పనులు ఇతర దేశాల సార్వభౌమత్వానికి ముప్పని అభిప్రాయపడ్డారు. క్వాడ్‌ను ఆసియా నాటో అనడం సరికాదని స్పష్టం చేశారు. -
మాటకి కట్టుబడి వెనుదిరిగిన చైనా సైన్యం
న్యూఢిల్లీ: శిబిరాలు తీసేస్తున్నారు. జెట్టీలు ధ్వంసం చేస్తున్నారు. హెలిప్యాడ్లను తొలగిస్తున్నారు. యుద్ధ ట్యాంకుల్ని వెనక్కి మళ్లిస్తున్నారు. భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత 10 నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతల నివారణకు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చైనా అందరినీ ఆశ్చర్య పరిచేలా వాయువేగంతో ఉపసంహరణ పూర్తి చేస్తోంది. పాంగాంగ్ సరస్సుకి తూర్పుగా ఫింగర్ 8వైపు చైనా దళాలు మళ్లుతూ ఉంటే, భారత్‌కు చెందిన దళాలు ఫింగర్ 3లోని శాశ్వత శిబిరంలో ఇకపై ఉంటారు. ఈ మధ్య ప్రాంతాన్ని నో మ్యాన్ ల్యాండ్ కింద ప్రకటించారు. అంటే ఆ ప్రాంతంలో ఏ దేశ సైనికులు కూడా పెట్రోలింగ్ నిర్వహించకూడదు. అనుకున్న మాటకి కట్టుబడి చైనా సైన్యం వెనక్కి మళ్లుతుండడానికి సంబంధించిన పలు వీడియోలను భారత ఆర్మీ మంగళవారం విడుదల చేసింది. చైనా వాయువేగంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తోంది. ఉపసంహరణ కార్యక్రమం ఇదే స్థాయిలో కొనసాగితే పాంగాంగ్ సరస్సు వెంబడి ఉన్న సైనిక ఉపసంహరణ మరొక్క రోజులోనే ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. చైనా జవాన్లు జూన్‌లో భారత్ సైనికులపై దాడికి దిగడంతో సంక్షోభం మరింత ముదిరింది. చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకోవాలని భారత్ భావించినా చైనా మొదట్లో సహకరించలేదు. ఎట్టకేలకు గత నెల 24న తొమ్మిదో రౌండు కమాండర్ స్థాయి చర్చల్లో బలగాలను ఉపసంహరించాలన్న నిర్ణయానికి వచ్చారు. గత వారంలోనే ఈ ఉపసంహరణ కార్యక్రమం మొదలైనప్పటికీ డ్రాగన్ దేశం ఇప్పుడు మరింత ముమ్మరం చేసింది. క్రేన్ల సాయంతో అన్నీ ధ్వంసం చైనా తమ దేశానికి చెందిన 200 యుద్ధ ట్యాంకుల్ని కేవలం ఎనిమిది గంటల వ్యవధిలో 100 కి.మీ. మళ్లించారు. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సదస్సు ఉత్తర, దక్షిణ తీరాల వెంబడి ఉన్న బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి. గత పది నెలలుగా ఎదురెదురుగా ఉన్న ఇరు దేశాలకు చెందిన సైన్యం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరాలను ఎత్తేస్తున్నారు. యుద్ధ ట్యాంకులను వెనక్కి మళ్లిస్తున్నారు. భారత ఆర్మీ విడుదల చేసిన వీడియోల్లో చైనా సైనికులు జెట్టీలు, బంకర్లను ధ్వంసం చేసి బరువైన ఆయుధాలను మోసుకుంటూ పర్వతాల వెంబడి నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు ఉన్నాయి. ఇక శిబిరాలను తొలగించడానికి భారీ క్రేన్లను వాడుతున్నారు. ఏప్రిల్ 2020 తర్వాత నిర్మించిన కట్టడాలన్నీ ధ్వంసం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని భారతీయ ఆర్మీ నిరంతరం పర్యవేక్షిస్తోంది. మానవరహిత ఏరియల్ వెహికల్స్, ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా ఈ మొత్తం ప్రక్రియను రికార్డు చేస్తోంది. తొలి విడత బలగాల ఉపసంహరణ పూర్తి కావడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్రసుతం ఇరువైపులకి చెందిన యుద్ధట్యాంకులు 100 వరకు మోహరించి ఉన్నాయి. చైనా వాయువేగంతో ఉపసంహరణ పూర్తి చేస్తున్నప్పటికీ ఆ దేశాన్ని పూర్తిగా నమ్మే పరిస్థితి అయితే లేదు. ‘‘చైనా వెనక్కి తగ్గింది. కానీ ఆ దేశం పట్ల ఉన్న అపనమ్మకం ఇంకా అలాగే ఉంది’’అని రాజకీయ విశ్లేషకుడు పథిక్రిత్ పైనే అన్నారు. -
సరిహద్దుల్లో చైనా హెలికాప్టర్–డ్రోన్
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో భారత్‌తో పదేపదే కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్ దేశం మరో అడుగు ముందుకువేయనుంది. పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు వీలుగా ఇటీవలే అభివృద్ధి చేసిన అత్యాధునిక హెలికాప్టర్–డ్రోన్‌ను త్వరలోనే టిబెట్‌లో భారత్ సరిహద్దుల్లో మోహరించనుందని చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ‘చైనా తయారీ మొట్టమొదటి ఈ హెలికాప్టర్–డ్రోన్‌ను 5,000 మీటర్ల నుంచి 6,700 మీటర్ల ఎత్తైన ప్రదేశాల నుంచి ఆపరేట్ చేయవవచ్చు. 500 కిలోల వరకు బరువు మోస్తూ గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ఐదు గంటలపాటు ఏకబిగిన ఎగరగలదు’అని వెల్లడించింది. ప్రభుత్వ ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా(ఎవిక్) గత వారమే దీనిని విజయవంతంగా ప్రయోగించి చూసిందని తెలిపింది. చైనా–భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఇది అందుబాటులోకి రానుందని పేర్కొంది. ‘శత్రు దేశ సైనిక కార్యకలాపాలపై నిఘా, శత్రుదేశాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలకు అంతరాయం కలిగించడంతోపాటు కాల్పులు జరపగల గలదు. నిట్టనిలువుగా, సమాంతరంగా ప్రయాణించగల ఈ ఆధునిక హెలికాప్టర్‌ను ఆపరేట్ చేయడమూ తేలికే. పర్వతమయమైన టిబెట్ ప్రాంతంలోని సరిహద్దుల పరిరక్షణలో చైనాకు అదనపు బలం కానుంది’అని పరిశీలకులు అంటున్నారు. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలకు రెండు దేశాలు సైనిక బలగాలను పెద్ద ఎత్తున తరలిస్తున్నాయి. గాల్వన్ లోయ, ప్యాంగ్యాంగ్ సొ ప్రాంతాలకు మరిన్ని బలగాలను తరలించామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాంతాల్లోనే చైనా కూడా తాత్కాలిక నిర్మాణం చేపట్టడంతో పాటు, 2,500 మంది సైనికులను సిద్ధంగా ఉంచింది. అయితే, అక్కడ భారత బలగాల బలమే అధికంగా ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని సైనికాధికారి ఒకరు వెల్లడించారు. గాల్వన్‌లోయలోని దార్బక్–షాయక్– దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్ వెంబడి ఉన్న కేఎం 120 సహా పలు వ్యూహాత్మక ప్రదేశాల్లో చైనా ఆర్మీ మోహరించడం ఆందోళనకరమన్నారు. -
యాంటీ చైనాతో జతకడుతారా? తస్మాత్ జాగ్రత్త!
బీజింగ్: యాంటీ చైనా కూటమితో జతకట్టే విషయంలో భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలని చైనా మీడియా పేర్కొంది. "మలబార్' భారత్-అమెరికా నౌకాదళ విన్యాసాల్లో జపాన్ కూడా పాలుపంచుకుంటున్న నేపథ్యంలో ఆ దేశ మీడియా ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం భారత్-చైనా సంబంధాలు ప్రస్తుతం చక్కగా ఉన్నాయని పేర్కొంది. 'చైనా-భారత్ సంబంధాలు చక్కనిపథంలో ముందుకుసాగుతున్నాయి. ఆరోగ్యకరమైన సంబంధాల వల్ల ఇరుదేశాలూ లబ్ధిపొందుతాయి. ఈ నేపథ్యంలో యాంటీ చైనా క్యాంప్‌లో జతకలిసే విషయంలో భారత్ ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాలి' అని చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్లోబల్ టైమ్స్ పత్రిక వ్యాఖ్యానించింది. ఏకకాలంలో భారత-చైనా సైనిక విన్యాసాలు, మలబార్ త్రైపాక్షిక డ్రిల్స్ జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించింది. హ్యాండ్ ఇన్ హ్యాండ్- 2015 పేరిట ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్-చైనా సైన్యాల సంయుక్త విన్యాసాలు చైనాలోని యునాన్ ప్రావిన్స్ కున్మింగ్ పట్టణంలో జరుగుతున్నాయి. అదేసమయంలో బంగాళాఖాతంలో భారత్, అమెరికా, జపాన్ నౌకాదళాల సంయుక్త యుద్ధ క్రీడలు కూడా కొనసాగుతున్నాయి. ఈ రెండు ఏకకాలంలో జరుగడం అనేక ఊహాగానాలకు తావిస్తున్నదని చైనా మీడియా వ్యాఖ్యానించింది.